DDC
-
సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, హెచ్– న్యూ వంటి ప్రత్యేక విభాగాలూ డ్రగ్స్‌ను పట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు వీటిని భద్రపరచడమనేది పోలీసులు పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇటీవల మాదకద్రవ్యాల నిరోధక చట్టంలో (ఎన్డీపీఎస్ యాక్ట్) కేంద్రం కీలక సవరణలు చేసింది. దీని ఆధారంగా నిర్ణీత సమయం తర్వాత డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అందుకు అనుమతి జారీ చేయడానికి సిటీలో డ్రగ్ డిస్పోజల్ కమిటీని (డీడీసీ) ఏర్పాటు చేస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక సవరణ చేసిన కేంద్రం... ఇలా పోలీసుస్టేషన్ల అధీనంలో ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలు జరగడం, కొందరు పోలీసులే వాటిని వినియోగించడం, అమాయకులపై కేసుల నమోదుకు వీటిని వినియోగించడం వంటి ఉదంతాలు ఉత్తరాదిలో చోటు చేసుకున్నాయి. డ్రగ్‌ను ఎలుకలు తినేశాయని, కింది పడిపోయిదని రికార్డుల్లో పొందుపరిచి ఇలా దుర్వినియోగం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్డీపీఎస్ యాక్ట్‌కు కీలక సవరణ చేసింది. దీని ప్రకారం మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు అప్పీల్ సమయం ముగిసే వరకు వాటిని భద్రపరచాల్సిన అవసరం తప్పింది. వీటిని ధ్వంసం చేయడానికి విధివిధానాలను రూపొందించింది. గంజాయి సహా పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రతి మాదకద్రవ్యం శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపిస్తారు. వీళ్లు ధ్రువీకరిస్తూ, నివేదిక ఇస్తేనే న్యాయస్థానం స్వాధీనం చేసుకున్నది మాదకద్రవ్యంగా అంగీకరిస్తుంది. ఇలా ఈ రిపోర్టు వచ్చే వరకు మాత్రమే ఆ డ్రగ్‌ను భద్రపరచాలి. ఎఫ్ఎస్ఎల్ నుంచి అందిన నివేదికను కోర్టులో సమర్పించే పోలీసులు దాంతో పాటు తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ను తీసుకువెళ్తారు. ఇందులోంచి కొంత మొత్తం తీసి భద్రపరచమని ఆదేశించే న్యాయమూర్తులు మిగిలింది ధ్వంసం చేయడానికి అనుమతి ఇస్తారు. రాంకీ ప్లాంట్‌లో ధ్వంసానికి యోచన.. ఇలా అనుమతి వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి పోలీసులకు ఆస్కారం వస్తుంది. అయితే ఎవరికి వారుగా ఈ పని చేసుకుంటూపోతే జవాబుదారీతన కొరవడటంతో పాటు దుర్వినియోగానికి, అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. దీని పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా డీడీసీని ఏర్పాటు చేశారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ గజరావ్ భూపాల్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది. సీసీఎస్ అదనపు డీసీపీ (పరిపాలన) స్నేహ మెహ్రా, ఏసీపీ కె.నర్సింగ్‌రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మాదకద్రవ్యాలను ఎక్కడపడితే అక్కడ ధ్వంసం చేస్తే పర్యావరణంతో పాటు స్థానికుల పైనా అనేక దుష్ఫరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు నగర శివార్లలో రాంకీ సంస్థ నిర్వహిస్తున్న యూనిట్లో నిపుణుల పర్యవేక్షణలో ఈ డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నాయి. సిటీ పోలీసులూ ఇదే యూనిట్‌ను వాడాలని యోచిస్తున్నారు. ఠాణాల్లో పేరుకుపోయేవి.. గతంలో అమలులో ఉన్న ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు స్వా«ధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చాలా కాలం వరకు భద్రపరచాల్సి వస్తోంది. నగరంలో చిక్కుతున్న వాటిలో ఇతర డ్రగ్స్ కంటే గంజాయి ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో పోలీసుస్టేష్లలోని మాల్ఖానాలు (అధికారిక గోదాములు) మొత్తం వీటితో నిండిపోయేవి. మాదకద్రవ్యానికి సంబం«ధించిన కేసు విచారణ కోర్టులో పూర్తి కావడానికి కొన్నేళ్లు పట్టేది. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి మరికొంత సమయం ఉండేది. అంటే ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లు, నిర్దోషులుగా తేలితే పోలీసులు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని అప్పీల్ అంటారు. ఈ సమయం ముగిసే వరకు ఆ మాకద్రవ్యాన్ని కేసు నమోదై ఉన్న పోలీసుల అధీనంలో ఉంచుకోవాల్సి వచ్చేది. సిటీలో డ్రగ్స్‌ను, నిందితులను శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్, హెచ్–న్యూ అధికారులు పట్టుకుంటారు. దీనికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా శాంతిభద్రతల విభాగం ఠాణాలోనే నమోదు చేస్తారు. ఈ కారణంగానే ఠాణాల మాల్ఖానాలన్నీ గంజాయితో నిండిపోయేవి. (చదవండి: ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్ చేస్తాం ) -
గర్భిణులు ఒలింపిక్స్‌కు వెళ్లొద్దు!
ఈ ఏడు జరిగే ఒలింపిక్స్‌కు గర్భిణులు వెళ్లకపోవడం మంచిదని అమెరికా ప్రభుత్వం సలహా ఇస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈసారి బ్రెజిల్లో జరిగే ఒలింపిక్స్‌కు జికా వైరస్ ప్రమాదం పొంచి ఉందని, దీంతో గర్భిణిలు ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లరాదని సూచిస్తోంది. పుట్టబోయే పిల్లలకు జికా వైరస్ వల్ల ఎటువంటి నష్టం కలగకూడదన్న అభిప్రాయంతోనే ఈ ప్రత్యేక సూచన చేస్తున్నట్లు సీడీసీ తెలిపింది. 2016లో తప్పనిసరిగా ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకున్న గర్భిణిలు మాత్రం ముందుగా తమ డాక్లర్లు, లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ల సలహాలు, సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సీడీసీ ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. ముఖ్యంగా జికా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచిస్తోంది గర్భిణులు మాత్రమే కాదు, వారి భర్తలు ఒలింపిక్స్‌కు వెళ్లినా జికా ప్రమాదం ఉంటుందని సీడీసీ చెప్తోంది. అందుకే అలా వెళ్లాలనుకునే వారు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లి వచ్చిన భర్తతో సెక్స్ విషయంలోనూ గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని, లేందంటే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణిగా ఉన్నంతకాలం సెక్స్ దూరంగా ఉండటం మంచిదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్లో జికా వ్యాప్తి గణనీయంగా ఉండటంతో సీడీసీ ఈ ప్రత్యేక సిఫార్సులు చేసింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని సీడీసీ వెల్లడించింది. దోమల వల్ల కలిగే జికా వైరస్ బ్రెజిల్లో వ్యాప్తి చెందుతున్నట్లు గత సంవత్సరంలో బ్రెజిలియన్ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు సీడీసీ చెబుతోంది. గర్భిణులకు జికా వైరస్ సోకితే పుట్టబోయే పిల్లల పెరుగుదలలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీడీసీ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చిన్న తలతో పుట్టడం, శారీరక ఎదుగుదల లోపించడం, వినికిడి శక్తిలోపం వంటి అసాధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు జీవితానికే ప్రమాదం కావచ్చని చెబుతోంది. -
రుణాల వసూళ్లే లక్ష్యం
సాక్షి, కాకినాడ:రుణమాఫీ పుణ్యమాని అప్పులు వసూలు కాక మునిగిపోయిన బ్యాంక్‌లు తమ బకాయిలను ముక్కు పిండి వసూలు చేసుకొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. అప్పు తీర్చకపోతే వడ్డీ రాయితీలను కోల్పోతారంటూ రైతులను హెచ్చరిస్తున్న బ్యాంకర్లు నేటి నుంచి గ్రామాల్లో మకాం వేయాలని తీర్మానించారు. మేనేజర్లతో సహా సిబ్బంది ప్రతీరోజు కనీసం ఒక గ్రామంలో పూర్తిగా మకాం వేయాలని, ఇంటింటికి వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలియజేసి అప్పులను తీర్చేందుకు వారిని ఒప్పించాలని నిర్ణయించారు. రుణమాఫీపై ప్రభుత్వం విధాన పరమైన ప్రకటన చేసినందున సాధ్యమైనంత త్వరగా రుణబకాయిలన్నీ చెల్లించాలని.. లేకుంటే ప్రభుత్వం నుంచి పొందే రాయితీలు కోల్పోయే ప్రమాదం ఉందని డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) సమావేశం రైతులకు హితవు పలికింది. కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ నీతూప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్షిక రుణప్రణాళిక ప్రగతిపై శాఖలవారీగా చర్చించారు. తొలుత లీడ్ బ్యాంక్ మేనేజర్ జగన్నాథస్వామి మొదటి త్రైమాసికంలో వార్షిక రుణప్రణాళిక ప్రగతిని వివరించారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రూ.5514 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు కేవలం రూ.585 కోట్లు అందించి 17 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకోగలిగామన్నారు. ఇక రూ.1022 కోట్ల మేర టెర్మ్ లోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా రూ.528 కోట్లు ఇచ్చామన్నారు. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1468 కోట్లకు రూ. 159 కోట్లు మాత్రమే ఇవ్వ గలిగామన్నారు. ప్రతీ కుటుంబంలోని భార్య, భర్తలిద్దరికి అకౌంట్లు తెరిచే లక్ష్యంతో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ‘సంపూర్ణ విత్తీయ సమావేశన్’ కార్యక్రమానికి బ్యాంకర్లందరూ సమాయత్తం కావాలన్నారు. ఆంధ్రాబ్యాంక్ డీజీఎం వీఎస్ శేషగిరిరావు మాట్లాడుతూ అన్ని బ్యాంకుల సిబ్బంది గ్రామాల్లో మకాం వేసి రుణబకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా కూడా రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు నెలలుగా నెలకొన్న స్తబ్దతను తొలగిం చేందుకు బ్యాంకర్లతో పాటు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. రైతుమిత్ర గ్రూపులను చైతన్య పర్చాలని, రుణ అర్హత కార్డుల జారీకి గుర్తించిన లక్షా 16వేల మంది కౌలు రైతులకు కొత్త రుణాల జారీకి డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో 40,171 స్వయం సహాయక సంఘాలకు 1,273 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు కేవలం 1802 బృందాలకు రూ.59కోట్ల మేర రుణాలు అందించగలిగారన్నారు. ఆర్బీఐ ఏజీఎం అనురాధ, జేసీ ఆర్.ముత్యాలరాజు, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, హౌసింగ్, ఎస్సీ కార్పొరేషన్ పీడీలు సెల్వరాజ్, సిరి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాల సాధనకు తప్పనిసరిగా సమీక్ష : కలెక్టర్ కాకినాడ సిటీ : ప్రభుత్వ పథకాల అమలులో అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన లక్ష్యాల సాధనకు తప్పనిసరిగా సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం రాత్రి ఆమె మండల స్థాయి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్లు, గృహనిర్మాణం, ఉపకారవేతనాలు, ఉపాధిహామీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులు తదితర అంశాల ఆధార్సీడింగ్పై సమీక్షించారు. వంద రోజుల కార్యాచరణ అమలుకు నిర్దేశించిన సూచనలు పాటిస్తూ అధికారులు మండల, క్లస్టర్‌స్థాయి ఉద్యోగులతో సమీక్షలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు, ఎస్పీహెచ్ఓలు ప్రధాన కేంద్రాల్లో ఉండాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో అనుమతి తీసుకున్నాకే ప్రధాన కేంద్రం విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, డీఆర్వో యాదగిరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.