సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్‌ డ్రైవ్‌ | The City Been Running Special Drive On Drugs For Few Days | Sakshi
Sakshi News home page

సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్‌ డ్రైవ్‌

Published Tue, Jun 21 2022 7:33 AM | Last Updated on Tue, Jun 21 2022 9:18 AM

The City Been Running Special Drive On Drugs For Few Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నడుస్తోంది. శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, హెచ్‌– న్యూ వంటి ప్రత్యేక విభాగాలూ డ్రగ్స్‌ను పట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు వీటిని భద్రపరచడమనేది పోలీసులు పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇటీవల మాదకద్రవ్యాల నిరోధక చట్టంలో (ఎన్డీపీఎస్‌ యాక్ట్‌) కేంద్రం కీలక సవరణలు చేసింది. దీని ఆధారంగా నిర్ణీత సమయం తర్వాత డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అందుకు అనుమతి జారీ చేయడానికి సిటీలో డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీని (డీడీసీ) ఏర్పాటు చేస్తూ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

కీలక సవరణ చేసిన కేంద్రం... 

  • ఇలా పోలీసుస్టేషన్ల అధీనంలో ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలు జరగడం, కొందరు పోలీసులే వాటిని వినియోగించడం, అమాయకులపై కేసుల నమోదుకు వీటిని వినియోగించడం వంటి ఉదంతాలు ఉత్తరాదిలో చోటు చేసుకున్నాయి. డ్రగ్‌ను ఎలుకలు తినేశాయని, కింది పడిపోయిదని రికార్డుల్లో పొందుపరిచి ఇలా దుర్వినియోగం చేశారు.  
  • వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్డీపీఎస్‌ యాక్ట్‌కు కీలక సవరణ చేసింది. దీని ప్రకారం మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు అప్పీల్‌ సమయం ముగిసే వరకు వాటిని భద్రపరచాల్సిన అవసరం తప్పింది. వీటిని ధ్వంసం చేయడానికి విధివిధానాలను రూపొందించింది. 
  • గంజాయి సహా పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రతి మాదకద్రవ్యం శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి (ఎఫ్‌ఎస్‌ఎల్‌) పంపిస్తారు. వీళ్లు ధ్రువీకరిస్తూ, నివేదిక ఇస్తేనే న్యాయస్థానం స్వాధీనం చేసుకున్నది మాదకద్రవ్యంగా అంగీకరిస్తుంది. ఇలా ఈ రిపోర్టు వచ్చే వరకు మాత్రమే ఆ డ్రగ్‌ను భద్రపరచాలి. 
  • ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి అందిన నివేదికను కోర్టులో సమర్పించే పోలీసులు దాంతో పాటు తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ను తీసుకువెళ్తారు. ఇందులోంచి కొంత మొత్తం తీసి భద్రపరచమని ఆదేశించే న్యాయమూర్తులు మిగిలింది ధ్వంసం చేయడానికి అనుమతి ఇస్తారు.  

రాంకీ ప్లాంట్‌లో ధ్వంసానికి యోచన.. 
ఇలా అనుమతి వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి పోలీసులకు ఆస్కారం వస్తుంది. అయితే ఎవరికి వారుగా ఈ పని చేసుకుంటూపోతే జవాబుదారీతన కొరవడటంతో పాటు దుర్వినియోగానికి, అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. దీని పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా డీడీసీని ఏర్పాటు చేశారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) సంయుక్త పోలీసు కమిషనర్‌ గజరావ్‌ భూపాల్‌ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది. సీసీఎస్‌ అదనపు డీసీపీ (పరిపాలన) స్నేహ మెహ్రా, ఏసీపీ కె.నర్సింగ్‌రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  

మాదకద్రవ్యాలను ఎక్కడపడితే అక్కడ ధ్వంసం చేస్తే పర్యావరణంతో పాటు స్థానికుల పైనా అనేక దుష్ఫరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు నగర శివార్లలో రాంకీ సంస్థ నిర్వహిస్తున్న యూనిట్‌లో నిపుణుల పర్యవేక్షణలో ఈ డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నాయి. సిటీ పోలీసులూ ఇదే యూనిట్‌ను వాడాలని 
యోచిస్తున్నారు.   

ఠాణాల్లో పేరుకుపోయేవి.. 

  • గతంలో అమలులో ఉన్న ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం పోలీసులు స్వా«ధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చాలా కాలం వరకు భద్రపరచాల్సి వస్తోంది. నగరంలో చిక్కుతున్న వాటిలో ఇతర డ్రగ్స్‌ కంటే గంజాయి ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో పోలీసుస్టేష్లలోని మాల్‌ఖానాలు (అధికారిక గోదాములు) మొత్తం వీటితో నిండిపోయేవి.  
  • మాదకద్రవ్యానికి సంబం«ధించిన కేసు విచారణ కోర్టులో పూర్తి కావడానికి కొన్నేళ్లు పట్టేది. ఆ తర్వాత అప్పీల్‌ చేసుకోవడానికి మరికొంత సమయం ఉండేది. అంటే ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లు, నిర్దోషులుగా తేలితే పోలీసులు ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడాన్ని అప్పీల్‌ అంటారు. 
  • ఈ సమయం ముగిసే వరకు ఆ మాకద్రవ్యాన్ని కేసు నమోదై ఉన్న పోలీసుల అధీనంలో ఉంచుకోవాల్సి వచ్చేది. సిటీలో డ్రగ్స్‌ను, నిందితులను శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్, హెచ్‌–న్యూ అధికారులు పట్టుకుంటారు. దీనికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా శాంతిభద్రతల విభాగం ఠాణాలోనే నమోదు చేస్తారు. ఈ కారణంగానే ఠాణాల మాల్‌ఖానాలన్నీ గంజాయితో నిండిపోయేవి.

(చదవండి: ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్‌ చేస్తాం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement