రుణాల వసూళ్లే లక్ష్యం | Goal debt collection | Sakshi
Sakshi News home page

రుణాల వసూళ్లే లక్ష్యం

Published Wed, Aug 13 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

రుణాల వసూళ్లే లక్ష్యం

రుణాల వసూళ్లే లక్ష్యం

 సాక్షి, కాకినాడ:రుణమాఫీ పుణ్యమాని అప్పులు వసూలు కాక మునిగిపోయిన బ్యాంక్‌లు తమ బకాయిలను ముక్కు పిండి వసూలు చేసుకొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. అప్పు తీర్చకపోతే వడ్డీ రాయితీలను కోల్పోతారంటూ రైతులను హెచ్చరిస్తున్న బ్యాంకర్లు నేటి నుంచి గ్రామాల్లో మకాం వేయాలని తీర్మానించారు. మేనేజర్లతో సహా సిబ్బంది ప్రతీరోజు కనీసం ఒక గ్రామంలో పూర్తిగా మకాం వేయాలని, ఇంటింటికి వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలియజేసి అప్పులను తీర్చేందుకు వారిని ఒప్పించాలని నిర్ణయించారు. రుణమాఫీపై ప్రభుత్వం విధాన పరమైన ప్రకటన  చేసినందున సాధ్యమైనంత త్వరగా రుణబకాయిలన్నీ చెల్లించాలని.. లేకుంటే ప్రభుత్వం నుంచి పొందే రాయితీలు కోల్పోయే ప్రమాదం ఉందని డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) సమావేశం రైతులకు హితవు పలికింది.  కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ నీతూప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్షిక రుణప్రణాళిక ప్రగతిపై శాఖలవారీగా చర్చించారు. తొలుత లీడ్ బ్యాంక్ మేనేజర్ జగన్నాథస్వామి మొదటి త్రైమాసికంలో వార్షిక రుణప్రణాళిక ప్రగతిని వివరించారు.
 
 ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో రూ.5514 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు కేవలం రూ.585 కోట్లు అందించి 17 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకోగలిగామన్నారు. ఇక రూ.1022 కోట్ల మేర టెర్మ్ లోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా రూ.528 కోట్లు ఇచ్చామన్నారు. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1468 కోట్లకు రూ. 159 కోట్లు మాత్రమే ఇవ్వ గలిగామన్నారు. ప్రతీ కుటుంబంలోని భార్య, భర్తలిద్దరికి అకౌంట్లు తెరిచే లక్ష్యంతో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న  ‘సంపూర్ణ విత్తీయ సమావేశన్’ కార్యక్రమానికి బ్యాంకర్లందరూ సమాయత్తం కావాలన్నారు. ఆంధ్రాబ్యాంక్ డీజీఎం వీఎస్ శేషగిరిరావు మాట్లాడుతూ అన్ని బ్యాంకుల సిబ్బంది గ్రామాల్లో మకాం వేసి రుణబకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
 
 ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా కూడా రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు నెలలుగా నెలకొన్న స్తబ్దతను తొలగిం చేందుకు బ్యాంకర్లతో పాటు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. రైతుమిత్ర గ్రూపులను చైతన్య పర్చాలని, రుణ అర్హత కార్డుల జారీకి గుర్తించిన లక్షా 16వేల మంది కౌలు రైతులకు కొత్త రుణాల జారీకి డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో 40,171 స్వయం సహాయక సంఘాలకు 1,273 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు కేవలం 1802 బృందాలకు రూ.59కోట్ల మేర రుణాలు అందించగలిగారన్నారు. ఆర్బీఐ ఏజీఎం అనురాధ, జేసీ ఆర్.ముత్యాలరాజు, వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, హౌసింగ్, ఎస్సీ కార్పొరేషన్ పీడీలు సెల్వరాజ్, సిరి తదితరులు పాల్గొన్నారు.
 
 లక్ష్యాల సాధనకు తప్పనిసరిగా సమీక్ష : కలెక్టర్
 కాకినాడ సిటీ : ప్రభుత్వ పథకాల అమలులో అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన లక్ష్యాల సాధనకు తప్పనిసరిగా సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం రాత్రి ఆమె మండల స్థాయి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్లు, గృహనిర్మాణం, ఉపకారవేతనాలు, ఉపాధిహామీ, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులు తదితర అంశాల ఆధార్‌సీడింగ్‌పై సమీక్షించారు. వంద రోజుల కార్యాచరణ అమలుకు నిర్దేశించిన సూచనలు పాటిస్తూ అధికారులు మండల, క్లస్టర్‌స్థాయి ఉద్యోగులతో సమీక్షలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు, ఎస్‌పీహెచ్‌ఓలు ప్రధాన కేంద్రాల్లో ఉండాలన్నారు.  డీఎంఅండ్‌హెచ్‌వో అనుమతి తీసుకున్నాకే ప్రధాన కేంద్రం విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, డీఆర్వో యాదగిరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement