Defence Research and Development Organisation (DRDO)
-
నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. నావికాదళ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన లాంచర్‌ను ఈ క్షిపణిలో వినియోగించారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు సంబంధిత శాస్త్రవేత్తలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్ రెడ్డి అభినందించారు. -
ఏడాది చివరికల్లా సరిహద్దుల్లో కంచె పూర్తి
న్యూఢిల్లీ: దేశ భూ సరిహద్దుల్లో చేపట్టిన 7,500 కిలోమీటర్ల పొడవైన కంచె నిర్మాణం ఈ ఏడాది చివరినాటికి ఎటువంటి ఖాళీల్లేకుండా పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశ రక్షణ విధానంపై విదేశాంగ విధానం ప్రభావం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే దేశానికి స్వతంత్ర రక్షణ వ్యూహం రూపొందిందని చెప్పారు. బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భూ సరిహద్దుల్లో కొనసాగుతున్న రక్షణ కంచె నిర్మాణంలో కేవలం 3 శాతం ఖాళీల వల్లే దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలు, అక్రమ చొరబాట్లు తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొనసాగుతున్నాయనీ, వీటన్నిటికీ 2022 నుంచి అట్టుకట్టపడుతుందని పేర్కొన్నారు. ధ్వంసం చేసేందుకు గానీ, కోసివేసేందుకు గానీ వీలులేనటువంటి కొత్త రకం కంచెను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలనే మనం కోరుకుంటున్నాం. ఎవరైనా మన సరిహద్దులకు భంగం కలిగించినా, మన సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినా, దీటుగా సమాధానం ఇవ్వడమే మన రక్షణ విధానంలో అత్యంత ముఖ్యమైంది’అని ఆయన తెలిపారు. ఇటువంటి విధానం లేకుండా మన దేశ ప్రగతి కానీ, ప్రజాస్వామ్యం మనుగడ కానీ అసాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం డీఆర్డీవో, కొన్ని ఇతర సంస్థలతో కలిసి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని దేశీయంగా త్వరలోనే సమకూర్చుకోనున్నామని తెలిపారు. కృత్రిమ మేథ, రోబోటిక్ సాంకేతికతను వినియోగిస్తూ సరిహద్దుల వెంట సాగే శత్రు దాడులను అడ్డుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా దేశ రక్షణకు మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను వివరించారు. 2008–14 మధ్య కాలంలో సరిహద్దుల్లో కేవలం 3,600 కిలోమీటర్ల రహదారులను నిర్మించగా, 2014–20 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం అంతకుమూడు రెట్లు అంటే, 4,764 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందన్నారు. ఇదే సమయంలో బడ్జెట్ కేటాయింపులు కూడా రూ.23 వేల కోట్ల నుంచి రూ.14,450 కోట్లకు పెంచామన్నారు. చైనాతో సరిహద్దుల వెంట గతంలో ఏడాదికి 230 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరగ్గా తమ ప్రభుత్వం 470 కిలోమీటర్ల చొప్పున రహదారులను పూర్తి చేసిందని తెలిపారు. -
కరోనా : నమూనాల సేకరణకు ‘కోవ్‌సాక్’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ఉపయోగపడే అనేక టెక్నాలజీలను అభివృద్ధి చేసిన భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) తాజాగా నమూనాల సేకరణకు ఉపయోగించే ప్రత్యేకమైన గదిని అభివృద్ధి చేసింది. కరోనా శాంపిల్ కలెక్షన్ కియాస్క్ (కోవ్‌సాక్) అని పిలుస్తున్న ఈ గదిని హైదరాబాద్‌లోని ఈఎస్ఐ డాక్టర్లతో సంప్రదింపులు జరిపిన తరువాత రూపొందించామని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి నుంచి నమూనాలు సురక్షితంగా సేకరించేందుకు ఈ కోవ్‌సాక్ ఉపయోగపడుతుందని పేర్కొంది. బాధితుడు కూర్చునే ప్రాంతాన్ని మానవ ప్రమేయం లేకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయడం దీని ప్రత్యేకత. ఫలితంగా వైద్య సిబ్బంది నమూనాలు సేకరించిన ప్రతిసారీ ప్రత్యేకంగా వ్యక్తిగత రక్షణ పరికరాలను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. నమూనాల సేకరణ తర్వాత రోగి గది నుంచి బయటకు వచ్చిన వెంటనే నాలుగు నాజిళ్ల ద్వారా డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను 70 సెకన్ల పాటు స్ప్రే చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించింది. నీటితో, అతినీలలోహిత కిరణాలతోనూ శుభ్రం చేసేందుకు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేశామని డీఆర్డీవో తెలిపింది. రెండు నిమిషాల వ్యవధిలో మరో రోగి నుంచి నమూనాలు సేకరించేందుకు కోవ్‌సాక్‌ను సిద్ధం చేయవచ్చని చెప్పింది. అవసరాన్ని బట్టి కోవ్‌సాక్‌ను బహిరంగ ప్రదేశాల్లోనూ ఉపయోగించవచ్చని పేర్కొంది. రోగి, వైద్య సిబ్బంది మధ్య మాటల కోసం కోవ్సాక్లో ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది. ఒక్కో కోవ్‌సాక్ ఖరీదు రూ.లక్ష దాకా ఉంటుందని, కర్ణాటకలోని బెల్గామ్ వద్ద ఉన్న ఒక పరిశ్రమ రోజుకు పది యూనిట్లు తయారు చేయగలదని పేర్కొంది. డీఆర్డీవో ఇప్పటికే రెండు కోవ్సాక్లను డిజైన్ చేసి పరీక్షల కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి అందజేసిందని వెల్లడించింది. -
నక్సల్స్ వేటకు ‘ఇనుప డేగలు’
* మానవ రహిత విమానాలను రూపొందిస్తున్న డీఆర్డీవో న్యూఢిల్లీ: దట్టమైన అడవులపై సంచరిస్తూ నక్సల్స్ జాడ కనిపెట్టే మానవ రహిత విమానాలను (యూఏవీ) అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తెలిపింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్కంఢ్లలో సీఆర్పీఎఫ్ దళాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ అటవీప్రాంతాలపై మార్చి లేదా ఏప్రిల్‌లో ‘నిశాంత్’ యూఏవీని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు డీఆర్డీవో అధినేత అవినాశ్ చాదర్ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ద్వైవార్షిక ‘డిఫెక్స్‌పో’ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘అధికారులు సుమారు 16 యూఏవీలు కావాలని కోరారు. ఇంతకుముందు నక్సల్స్ వేటకు వైమానికదళానికి చెందిన యూఏవీలను ఉపయోగించారు. కానీ స్థానిక అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని తొలగించారు. మేం తాజాగా రూపొంచిన విమానాలు దట్టమైన అడవుల్లో సైతం నిఘా కార్యక్రమాలను నిర్వహిస్తాయి’’ అని ఆయన వివరించారు. అగ్ని-5, ఐఎన్ఎస్ అరిహంత్ రెడీ దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి, ఐఎన్ఎస్ అరిహంత్ అణు జలాంతర్గామి వచ్చే ఏడాదికల్లా భారత అమ్ములపొదిలోకి చేరనున్నాయని డీఆర్డీవో చీఫ్ అవినాశ్ వెల్లడించారు. 5 వేల కి.మీ.లోని లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-5ని ఇప్పటికే దిగ్విజయంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదే మరో రెండు, మూడుసార్లు పరీక్షించిన తర్వాత అగ్ని-5ని సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అరిహంత్‌ను మూడు నెల ల్లో మరోసారి పరీక్షించనున్నట్టు తెలిపారు.