న్యూఢిల్లీ: దేశ భూ సరిహద్దుల్లో చేపట్టిన 7,500 కిలోమీటర్ల పొడవైన కంచె నిర్మాణం ఈ ఏడాది చివరినాటికి ఎటువంటి ఖాళీల్లేకుండా పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశ రక్షణ విధానంపై విదేశాంగ విధానం ప్రభావం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే దేశానికి స్వతంత్ర రక్షణ వ్యూహం రూపొందిందని చెప్పారు. బీఎస్‌ఎఫ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
భూ సరిహద్దుల్లో కొనసాగుతున్న రక్షణ కంచె నిర్మాణంలో కేవలం 3 శాతం ఖాళీల వల్లే దేశంలోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలు, అక్రమ చొరబాట్లు తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొనసాగుతున్నాయనీ, వీటన్నిటికీ 2022 నుంచి అట్టుకట్టపడుతుందని పేర్కొన్నారు. ధ్వంసం చేసేందుకు గానీ, కోసివేసేందుకు గానీ వీలులేనటువంటి కొత్త రకం కంచెను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలనే మనం కోరుకుంటున్నాం. ఎవరైనా మన సరిహద్దులకు భంగం కలిగించినా, మన సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినా, దీటుగా సమాధానం ఇవ్వడమే మన రక్షణ విధానంలో అత్యంత ముఖ్యమైంది’అని ఆయన తెలిపారు.
ఇటువంటి విధానం లేకుండా మన దేశ ప్రగతి కానీ, ప్రజాస్వామ్యం మనుగడ కానీ అసాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం డీఆర్‌డీవో, కొన్ని ఇతర సంస్థలతో కలిసి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని దేశీయంగా త్వరలోనే సమకూర్చుకోనున్నామని తెలిపారు. కృత్రిమ మేథ, రోబోటిక్ సాంకేతికతను వినియోగిస్తూ సరిహద్దుల వెంట సాగే శత్రు దాడులను అడ్డుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా దేశ రక్షణకు మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను వివరించారు.
2008–14 మధ్య కాలంలో సరిహద్దుల్లో కేవలం 3,600 కిలోమీటర్ల రహదారులను నిర్మించగా, 2014–20 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం అంతకుమూడు రెట్లు అంటే, 4,764 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందన్నారు. ఇదే సమయంలో బడ్జెట్ కేటాయింపులు కూడా రూ.23 వేల కోట్ల నుంచి రూ.14,450 కోట్లకు పెంచామన్నారు. చైనాతో సరిహద్దుల వెంట గతంలో ఏడాదికి 230 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరగ్గా తమ ప్రభుత్వం 470 కిలోమీటర్ల చొప్పున రహదారులను పూర్తి చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment