నక్సల్స్ వేటకు ‘ఇనుప డేగలు’
* మానవ రహిత విమానాలను రూపొందిస్తున్న డీఆర్‌డీవో
న్యూఢిల్లీ: దట్టమైన అడవులపై సంచరిస్తూ నక్సల్స్ జాడ కనిపెట్టే మానవ రహిత విమానాలను (యూఏవీ) అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్కంఢ్‌లలో సీఆర్‌పీఎఫ్ దళాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ అటవీప్రాంతాలపై మార్చి లేదా ఏప్రిల్‌లో ‘నిశాంత్’ యూఏవీని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు డీఆర్‌డీవో అధినేత అవినాశ్ చాదర్ పేర్కొన్నారు.
శుక్రవారమిక్కడ ద్వైవార్షిక ‘డిఫెక్స్‌పో’ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘అధికారులు సుమారు 16 యూఏవీలు కావాలని కోరారు. ఇంతకుముందు నక్సల్స్ వేటకు వైమానికదళానికి చెందిన యూఏవీలను ఉపయోగించారు. కానీ స్థానిక అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని తొలగించారు. మేం తాజాగా రూపొంచిన విమానాలు దట్టమైన అడవుల్లో సైతం నిఘా కార్యక్రమాలను నిర్వహిస్తాయి’’ అని ఆయన వివరించారు.
అగ్ని-5, ఐఎన్‌ఎస్ అరిహంత్ రెడీ
దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి, ఐఎన్‌ఎస్ అరిహంత్ అణు జలాంతర్గామి వచ్చే ఏడాదికల్లా భారత అమ్ములపొదిలోకి చేరనున్నాయని డీఆర్‌డీవో చీఫ్ అవినాశ్ వెల్లడించారు. 5 వేల కి.మీ.లోని లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-5ని ఇప్పటికే దిగ్విజయంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదే మరో రెండు, మూడుసార్లు పరీక్షించిన తర్వాత అగ్ని-5ని సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అరిహంత్‌ను మూడు నెల ల్లో మరోసారి పరీక్షించనున్నట్టు తెలిపారు.