ఇదో పోలీసుల ‘లొంగుబాటు’ డ్రామా! | Ground report: The truth about Chhattisgarh's recent Maoist surrenders | Sakshi
Sakshi News home page

ఇదో పోలీసుల ‘లొంగుబాటు’ డ్రామా!

Published Sat, Dec 19 2015 4:52 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

ఇదో పోలీసుల ‘లొంగుబాటు’ డ్రామా! - Sakshi

ఇదో పోలీసుల ‘లొంగుబాటు’ డ్రామా!

రాయ్‌పూర్: నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్ట మరీ గర్వంగా చెప్పుకోగా, ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో పోలీసులు సాధించిన ఘన విజయమంటూ కొన్ని జాతీయ వార్తా పత్రికలు డిసెంబర్ 9వ తేదీన ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లొంగిపోయిన 26 మందిలో ఎవరూ మావోయిస్టులు కాదు. కనీసం సానుభూతిపరులు కూడా లేరట. అదంతా పోలీసు ఉన్నతాధికారుల స్క్రీన్ ప్లే ప్రకారం జరిగిన హైడ్రామా అని తాజాగా మీడియా దర్యాప్తులో వెల్లడైంది.

సుక్మా జిల్లాలోని చింతల్నార్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మెకానిక్ బుద్రుకు డిసెండర్ 8వ తేదీన  దోర్నపాల్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా అంతకుముందు రోజు కబురొచ్చింది. తనపై 2010 నాటి పాత రేప్ కేసు ఒకటి పెండింగ్‌లో ఉండడంతో పోలీసుల ఆదేశం మేరకు 45 కిలోమీటర్ల దూరంలోని దోర్నపాల్ పోలీసు స్టేషన్‌కు బుద్రు వెళ్లాడు. అక్కడ పోలీసులు ‘మావోయిస్టుగా లొంగిపోతావా లేదా రేప్ కేసులో అరెస్ట్ చేయమంటావా?, పైగా మావోయిస్టుగా లొంగిపోతే పదివేల రూపాయల జీవన భృతి కూడా లభిస్తుంది’ అని బెదరించారు. అసహాయుడైన బుద్రు అలాగే చేశాడు. చింతల్నార్‌లోనే ఓ చిన్న వ్యాపారం చేసుకుంటున్న రమేశ్ అనే 24 ఏళ్ల యువకుడికి మావోయిస్టులు హత్య చేసినట్టుగా భావిస్తున్న ప్రత్యేక పోలీసు అధికారి నగేష్ హత్య కేసులో ఇరికిస్తామంటూ పోలీసులు ఫిక్స్ చేశారు.

ఇక గోవింద్ అనే మరో షాప్ కీపర్‌ను ఇలాంటి ఆరోపణలతో ఠాణాకు పోలీసులు పిలిపించారు. ఎప్పడో గోవింద్ షాప్ ముందు నక్సలైట్లు ఓ వ్యక్తిని చంపిన కేసులో అతను ప్రత్యక్ష సాక్షి. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు. సాక్షిగా ఉన్న అతడు విచారణలో దోషిగా తేలాడని కేసు మారుస్తామంటూ పోలీసులు బెదిరించారు. చేసేదేమిలేక మావోయిస్టుగా లొంగిపోయేందుకు గోవింద్ కూడా అంగీకరించాడు. పోలీసుల ఆదేశం మేరకు బుద్రు, రమేశ్, గోవింద్‌లు డిసెంబర్ 8వ తేదీన దోర్నపాల్, చింతల్నార్ గ్రామాలకు మధ్యనున్న పోలంపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ 23 మంది యువకులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్లను కూడా ఇలాగే పాత కేసులు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు బుద్రు, రమేశ్, గోవింద్‌లకు తెలిసిపోయింది.

 బస్తర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్‌ఆర్‌పీ కల్లూరి, పోలీసు, పౌర ఉన్నతాధికారుల సమక్షంలో మావోయిస్టుల లొంగుబాటు డ్రామా రసవత్తరంగా నడిచింది. పోలీసులు ఎలా చెబితే అలా నడుచు కోవాల్సిన దారుణ పరిస్థితుల్లో తాము బతుకుతున్నామని, అందుకే ఈ లొంగుబాటు నాటకానికి లొంగిపోవాల్సి వచ్చిందని చింతల్నార్ వాసులు వాపోతున్నారు. నక్సల్స్ ఏరివేత పేరిట 2011లో భద్రతా దళాలు ప్రజల ఇళ్లను, దుకాణాలను తగులబెట్టినప్పటి నుంచి వారు మరీ భయపడుతున్నారు. 2010లో మావోయిస్టులు 76 మంది భద్రతా సిబ్బందిని కాల్చి చంపిన సంఘటను ప్రతీకారంగా భద్రతా సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు.

 ఈ లొంగుబాటు నాటకం గురించి ఆ ఏరియా పోలీస్ సూపరింటెండెంట్ డీ. శ్రావణ్ వద్దకు తీసుకెళ్లగా ఏదీ నాటకం కాదని, అంతా వాస్తవమేనంటూ సమర్ధించుకున్నారు. కేవలం ఆయుధాలు పట్టుకున్న మావోయిస్టులే కాదని, మావోయిస్టు సానుభూతిపరులైన, మావోయిస్టు సిద్ధాంతపరమైన ఆలోచన కలిగివున్న వారు కూడా చట్టం ముందు నేరస్థులేనని ఆయన కొత్త సిద్ధాంతం చెప్పారు.

 

పైగా మావోయిస్టులుగా లొంగిపోయిన వారికి పదివేల రూపాయలు అందజేశామని, ఇందిర ఆవాస్ యోజన పథకం కింద వాళ్లకు ఇళ్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు వాళ్లంతా ఇంటికెళ్లి హాయిగా ఉన్నారని, లేకపోతే ఈ పాటికి అరెస్టై జైళ్లలో ఊచలు లెక్కబెట్బేరాని వ్యాఖ్యానించారు. వారిపైన కేసులను ఎత్తివేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు కేసులు ఎత్తివేయడం కుదరదని, ఆ కేసుల పట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement