గుజరాత్‌కు పెట్టుబడుల వెల్లువ!
వైబ్రంట్ గుజరాత్ సదస్సులో కార్పొరేట్ల క్యూ
⇒ రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రకటించిన
⇒ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
⇒ ఆదిత్య బిర్లా రూ.20,000 కోట్ల పెట్టుబడులు...
⇒ జాబితాలో విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు కూడా..
గాంధీనగర్: గుజరాత్‌కు పెట్టుబడులు పోటెత్తనున్నాయి. ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించిన ఏడో వైబ్రంట్ గుజరాత్ సదస్సు(వీజీఎస్)లో దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పోటాపోటీగా భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. ఈ మూడు రోజుల సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, వివిధ దేశాల నేతలు హాజరయ్యారు.
గుజరాత్ సీఎంగా మోదీ హయాంలో 2003లో తొలిసారిగా ఆరంభించిన వీజీఎస్ అప్పటినుంచీ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతూ వస్తోంది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, తీవ్ర ఒడిదుడుకులు ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ ఈ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. స్థిరమైన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌తో కలిసికట్టుగా సాగేందుకు ప్రపంచంలో అనేక దేశాలు ముందుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.
ముకేశ్ అంబానీ జోష్...
వీజీఎస్ ప్రారంభం రోజే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడులను గుజరాత్లో వెచ్చించనున్నట్లు ప్రకటించారు. రానున్న 12-18 నెలల కాలంలో తమ గ్రూప్‌లోని పలు వ్యాపార విభాగాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని ముకేశ్ చెప్పారు.
పెట్రోకెమికల్ ప్లాంట్లలో సామర్థ్య విస్తరణ, 4జీ టెలికం బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభంతోపాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యకలాపాల్లో రిలయన్స్ తమవంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. ఇప్పటిదాకా జరిగిన వీజీఎస్లన్నింటికీ తాను హాజరయ్యానన్న ముకేశ్... మోదీని ప్రపంచ నాయకుడిగా అభివర్ణించారు. భారత్‌కు ఆయన గర్వకారణమని వ్యాఖ్యానించారు.
గుజరాత్‌కే ప్రాధాన్యం: బిర్లా
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వీజీఎస్ సందర్భంగా గుజరాత్లో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సిమెంట్ ఇతరత్రా ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు బిర్లా తెలిపారు.
గ్రూప్‌నకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడుల గమ్యస్థానమని కూడా పేర్కొన్నారు. హాజరైన ఇతర కార్పొరేట్లలో అడాగ్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ, హిందూజా గ్రూప్‌నకు చెందిన శశి రూయా, భారతీ గ్రూప్ సునీల్ మిట్టల్, ఆది గోద్రెజ్, ఉదయ్ కొటక్, ఏఎం నాయక్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తదితరులు ఉన్నారు.
ఇక విదేశీ కంపెనీల విషయానికొస్తే..
ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం రియో టింటో గుజరాత్‌లోని వజ్రాలు సానబట్టే పరిశ్రమలో 30,000 కొత్త ఉద్యోగాల కల్పించనున్నట్లు వెల్లడించింది. అంత్యంత నమ్మకమైన వ్యాపార గమ్యంగా నిలుస్తున్న గుజరాత్‌తో మున్ముందు మరింతగా కలిసి పనిచేస్తామని కంపెనీ సీఈఓ శామ్ వాల్ష్ చెప్పారు.
తమ కంపెనీ భారత్‌పై చాలా ఆశావహంగా ఉందని.. గడిచిన ఏడాది వ్యవధిలో 25 కోట్ల డాలర్లను ఇక్కడ వెచ్చించినట్లు మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానుందని జపాన్ వాహన దిగ్గజం సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ పేర్కొన్నారు. గుజరాత్లో నిర్మిస్తున్న తమ కొత్త ప్లాంట్ 2017కల్లా ఉత్పత్తికి సిద్ధమవుతుందన్నారు. ఈ ప్లాంట్కోసం రూ.4,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మరిన్ని సంస్కరణలు అవసరం...
వీజీఎస్లో పాల్గొన్న కార్పొరేట్ దిగ్గజాలు, నిపుణులు భారత్‌లో మరిన్ని ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాలని సూచించారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి పన్నులు, సబ్సిడీల్లో కీలక సంస్కరణలు ఆవశ్యకమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ అద్భుత పాలనను ఇప్పుడు భారత్‌వ్యాప్తంగా ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారని మాస్టర్ కార్డ్ చీఫ్, అమెరికా-ఇండియా వ్యాపార మండలి చైర్మన్ అజయ్ బంగా చెప్పా రు. అమెరికా ఇన్వెస్టర్లు భారత్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారని.. ఇరు దేశాల మధ్య వారధిగా వ్యహరించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
అదానీ హల్చల్..
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్, అమెరికా కంపెనీ సన్ ఎడిసన్ కలిపి గుజరాత్లో భారీ సోలార్(సౌర విద్యుత్) పార్క్‌ను నెలకొల్పనున్నాయి. ఇరు కంపెనీలు జాయింట్ వెంచర్(జేవీ)గా నిర్మించే ఈ సోలార్ పార్కు కోసం రూ.25,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వైబ్రంట్ అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 20,000 ఉద్యోగాలను ఇది కల్పించనుందని కూడా తెలిపింది.
అదానీ గ్రూప్‌తో జట్టుకట్టడం ద్వారా భారత్‌లోనే అతిపెద్ద ఫోటోవోల్టాయిక్(సోలార్) ప్యానల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండం తమకు గర్వకారణమని సన్ ఎడిసన్ సీఈఓ అహ్మద్ చాటిలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్రవీకృత సహజవాయువు(ఎన్ఎన్జీ) దిగుమతితోపాటు చమురు-గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిలో సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంధన దిగ్గజం ఉడ్‌సైడ్ ఎనర్జీతో అదానీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్య ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఉడ్‌సైడ్ ఎనర్జీ సీఈఓ పీటర్ కోల్మన్ సంతకాలు చేశారు. మోదీతో అదానీకి సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగురేఖ భారత్: కిమ్
గాంధీనగర్: మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. ఆదివారమిక్కడ మొదలైన వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ... ఈ ఏడాది(2015)లో ఇండియా వృద్ది రేటు 6.4 శాతానికి పుంజుకోవచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఈ జోరు మరింత పెరగనుందని కూడా చెప్పారు. అయితే, కుల పరమైన పక్షపాత ధోరణలు, ఇతరత్రా అంశాలు ప్రగతికి అడ్డంకిగా నిలుస్తాయని ఆయన హెచ్చరించారు.
దేశ ఆర్థిక ఫలాలను ప్రజలందరికీ పంచే విధంగా ప్రధాని మోదీ పలు పథకాలపై దృష్టిపెట్టారని... దీనివల్ల వృద్ధి రేటు కూడా పుంజుకోవడానికి దోహదపడుతుందని కిమ్ అభిప్రాయపడ్డారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయిన వృద్ధి రేటు ప్రస్తుత 2014-15 సంవత్సరంలో కొంత మెరుగుపడిన(క్యూ1లో 5.7%, క్యూ2లో 5.3%) సంగతి తెలిసిందే.
ఈ ఏడాది 7 శాతం వృద్ధి: పీడబ్ల్యూసీ
నిర్మాణాత్మక సంస్కరణల నేపథ్యంలో భారత్‌లో ఈ ఏడాది(2015) వృద్ధి రేటు 7 శాతాన్ని అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ముడి చమురు ధరల భారీ క్షీణత స్వల్పకాలంలో జీడీపీకి చేయూతనిస్తాయని అభిప్రాయపడింది. మరోపక్క, చైనాలో వృద్ధి రేటు మందగించొచ్చని పేర్కొంది. కాగా, పెట్టుబడులు ఇంకా పుంజుకోవాల్సిన నేపథ్యంలో 2014-15 ద్వితీయార్ధంలో(క్యూ3, క్యూ4) వృద్ధి రేటు కాస్త తగ్గే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. అయితే, సంస్కరణలను వేగంగా అమలు చేయడం, ముడిచమురు దరల తగ్గుముఖం... వృద్ధికి చేయూతనిస్తాయని హెచ్ఎస్బీసీ తెలిపింది.