డిపాజిటర్ల అవగాహన కోసం ఆర్‌బీఐ గ్రాంట్లు
స్వచ్ఛంద సంస్థల దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 27
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిటర్లకు అవగాహన కల్పించటానికి రిజర్వుబ్యాంక్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనికోసం ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’ను ఏర్పాటుచేసింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించే వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునివ్వటానికి ఈ ఫండ్ నుంచి వాటికి గ్రాంట్లను మంజూరుచేయనుంది. గ్రాంట్లు పొందే సంస్థలు డిపాజిటర్లకు సురక్షితమైన బ్యాంకు లావాదేవీలు, భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్ని, సదస్సులను నిర్వహించాలని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక విధానాలు, విషయాలపట్ల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాల్ని కూడా చేపట్టవచ్చని తెలిపింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు గ్రాంటు కోసం ఫిబ్రవరి 27 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అలాగే ఫండ్ కోసం ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాలను విడుదలచేసింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని, వినియోగంలోలేని అకౌంట్ల డబ్బుల్ని బ్యాంకులు వడ్డీతో సహా ఈ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించింది. ఈ ఫండ్ ఒక కమిటీ ఆధీనంలో ఉంటుందని పేర్కొంది.