‘దేవాడ’కు రోడ్డేశారు
సాక్షి, నిజాంసాగర్: బాన్సువాడ– బిచ్కుంద ప్రధాన రహదారిపై ఉన్న దేవాడ వాగుపై అధికారులు తాత్కాలిక వంతెన నిర్మించారు. దీంతో ప్రజల రవాణా కష్టాలు తీరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దేవాడ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 15 రోజులకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గినా తాత్కాలిక వంతెన వేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై శుక్రవారం ‘తాత్కాలిక రోడ్డైనా వేయరూ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదేశాలతో ఆర్అండ్బీ అధికారులు కదిలారు. వేగంగా తాత్కాలిక వంతెన పనులు పూర్తి చేయించారు. సాయంత్రమే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దారి కష్టాలు తీరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.