దీప్తి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ : పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతూ, ఎన్నారై పెళ్లి కొడుకుల నుంచి డబ్బు గుంజుకుంటున్న పల్లపూరి దీప్తి కేసులో బెజవాడ పోలీసులకు చుక్కెదురు అయింది. విచారణ పరిధితో సంబంధం లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ పటమట పోలీసుల తీరును న్యాయస్థానం గురువారం తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది.
టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే..
కాగా పల్లపూరి దీప్తి అరెస్ట్ నేపథ్యంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే పటమట పోలీసులు కేసు పెట్టారని దీప్తి తల్లి పూర్ణవల్లి ఆరోపించారు. సంబంధం లేని కేసును సీఐ దామోదర్‌తో ఎమ్మెల్యే కేసు నమోదు చేయించారని అన్నారు. ఎన్నారై ధరణికుమార్‌ను తన కుమార్తె డబ్బులు అడగలేదన్నారు. రెండు రోజుల పరిచయంతో లక్షా ఎనభై ఆరువేలు ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో వేస్తారా? అని పూర్ణవల్లి ప్రశ్నించారు. మూడోరోజే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు చేశారు.
కాగా మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న పల్లపూరి దీప్తిని నిన్న (బుధవారం) విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పటమటకు చెందిన ధరణీకుమార్ మూడు నెలల క్రితం భారత్ మ్యాట్రీమోనిలో వధువు కోసం వెతకగా, దీప్తి అనే యువతి పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యవసరంగా తనకు కొంత డబ్బు అవసరం అని ధరణీకుమార్ను అడిగింది.
ఆమె మాటలు నమ్మిన అతడు రెండు దఫాలుగా రూ.1.86 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బు తీసుకున్న నాటి నుంచి దీప్తి ఆచూకీ తెలియకపోవడంతో ధరణీకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా, నిందితురాలు గుంటూరు బ్రాడీపేటకు చెందిన దీప్తిగా గుర్తించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఆమెను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.