Diamond series
-
సెల్కాన్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు
రెండు ఫేస్బుక్ ఖాతాలు కూడా డైమండ్ సిరీస్‌లో కొత్త 4జీ మోడళ్లు వడ్డీలేని వాయిదాల్లోనూ విక్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న సెల్కాన్ తాజాగా డైమండ్ సిరీస్‌లో రెండు 4జీ మోడళ్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ అకౌంట్లను నిర్వహించుకునే ఏర్పాటు ఉండడం ఈ స్మార్ట్ఫోన్ల ప్రత్యేకత. భారతీయ బ్రాండ్ నుంచి ఈ ఫీచర్లతో మోడళ్లు రావడం ఇదే ప్రథమం అని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. హోమ్ క్రెడిట్ కంపెనీతో చేతులు కలిపినట్టు చెప్పారు. వడ్డీలేని వాయిదాల్లో ఈ ఫోన్లను కొనుక్కోవచ్చన్నారు. 2017లో 4జీ పైనే ఫోకస్ చేస్తామన్నారు. మరో 10–12 మోడళ్లు ప్రవేశపెడతామన్నారు. రూ.15 వేల శ్రేణిలోనూ స్మార్ట్ఫోన్ల తయారీ మొదలు పెడతామని వివరించారు. ఫిబ్రవరి నుంచి విదేశాలకు కొత్త మోడళ్ల ఎగుమతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రూ.1,999లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది రోజల్లో సెల్కాన్ విడుదల చేయనుంది. పరిశోధన కేంద్రం.. సెల్కాన్ ఆర్అండ్డీ కేంద్రం త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానుందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. తెలంగాణలో స్మార్ట్ఫోన్ల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ కలను కంపెనీ నిజం చేసిందని అన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అందుబాటు ధరలకుతోడు స్థానిక భాషలను సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల రాకతో డిజిటల్ చెల్లింపులు అధికమవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్ ప్లాంటులో 18 నెలల్లో 50 లక్షలకుపైగా ఫోన్లను తయారు చేశామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని వెల్లడించారు. అందుబాటు ధరలో, ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన మోడళ్లు తీసుకొస్తామని చెప్పారు. రూ.10 వేలలోపు మోడళ్లకు రుణ సౌకర్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇవీ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు.. రెండు మోడళ్లనూ 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో రూపొందించారు. ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, పిక్చర్ నాణ్యతను పెంచే బ్యూటీ ప్లస్ యాప్ ఏర్పాటు ఉంది. ఫ్లో యూఐ, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 6 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర ఫీచర్లు. 21 భాషలను ఇవి సపోర్ట్ చేస్తాయి. డైమండ్ ‘యు’ స్మార్ట్‌ఫోన్‌ను 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో తయారు చేశారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని ప్రత్యేకత. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. ధర రూ.5,999 ఉంది. డైమండ్ మెగా మోడల్‌ను 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో తయారు చేశారు. 2700 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ధర రూ.6,400గా నిర్ణయించారు. -
మేడిన్ ఇండియా ఫోన్లు కోరుతున్నారు..
-
మేడిన్ ఇండియా ఫోన్లు కోరుతున్నారు..
♦ చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత ♦ రెండేళ్లలో తయారీ హబ్‌గా భారత్ ♦ సెల్కాన్ సీఎండీ వై.గురు ♦ డైమండ్ సిరీస్‌లో కొత్త 4జీ ఫోన్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటి దాకా చైనా ఉత్పత్తులు వెల్లువెత్తుతున్న భారత సెల్‌ఫోన్ మార్కెట్లో వినూత్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత కస్టమర్లు ప్రస్తుతం మేడిన్ ఇండియా ఫోన్లనే కోరుతున్నారని సెల్కాన్ సీఎండీ వై.గురు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోందన్న కారణంగా చైనా ఉత్పత్తుల వాడకం పట్ల భారత్‌లో పెరుగుతున్న వ్యతిరేకతే ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందన్నారు. అలాగే భారత్‌లో తయారైన ఫోన్ల కోసం పలు దేశాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని వెల్లడించారు. ఈయూ దేశాల కోసం ఒక ప్రముఖ విదేశీ టెలికం కంపెనీ నుంచి భారీ ఆర్డరును దక్కించుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ కోసం 4జీ స్మార్ట్ఫోన్లను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. 2018 కల్లా పూర్తిగా ఇక్కడే.. చైనా ఉత్పత్తుల విషయంలో కంపెనీలు, కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దేశీయ సెల్‌ఫోన్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. పీసీబీ, ఎల్సీడీ, చిప్సెట్లను కొరియా, తైవాన్ నుంచి, మెమరీ కార్డులు జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. చార్జర్లు, బ్యాటరీలు, హెడ్సెట్లు, బాక్స్‌ల వంటి మిగిలిన విడిభాగాలన్నీ భారత్‌లోనే తయారు చేయిస్తున్నట్టు గురు తెలిపారు. చైనా కంటే ఇక్కడే తయారీ వ్యయం తక్కువగా ఉందన్నారు. అన్ని విడిభాగాలు భారత్‌లోనే తయారు చేయాలన్న నిబంధన 2018 నాటికి ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందన్నారు. మరిన్ని కొత్త మోడళ్లు.. డిసెంబర్‌కల్లా మరో రెండు 4జీ, రెండు 3జీ స్మార్ట్ఫోన్లను సెల్కాన్ ప్రవేశపెడుతోంది. అధిక మెగా పిక్సెల్‌తోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌తో రూ.7 వేలలోపు ధరల శ్రేణిలో మోడళ్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం 4జీ విభాగంలో ట్యాబ్లెట్ పీసీలతో కలిపి మొత్తం 4 మోడళ్లను విక్రయిస్తోంది. అన్ని మోడళ్లనూ మేడ్చల్ ప్లాంటులో తయారు చేస్తోంది. కంపెనీ అమ్మకాలు సాగిస్తున్న ధరల శ్రేణిలో తెలంగాణలో 41 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం మార్కెట్ వాటా ఉన్నట్టు సెల్కాన్ తెలిపింది. మరో రెండు 4జీ మోడళ్లు.. డైమండ్ సిరీస్‌లో ఏస్, పాప్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ఫోన్లను సెల్కాన్ విడుదల చేసింది. ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్, 5 ఎంపీ కెమెరాను రెండు మోడళ్లలోనూ పొందుపరిచారు. డైమండ్ ఏస్‌ను 5 అంగుళాల డిస్ప్లే, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రూపొందించారు. ధర రూ.4,999. డైమండ్ పాప్‌ను 4.5 అంగుళాల స్క్రీన్‌తో తయారు చేశారు. ఫోన్ ధర రూ.4,699 ఉంది. స్క్రీన్ పగలకుండా ఉండేందుకు డ్రాగన్ట్రైల్ గ్లాస్‌ను వాడామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. అన్ని మోడళ్లకూ జియో వెల్కం ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. -
సెల్కాన్ 4జీ మొబైల్ రూ.6,666
హైదరాబాద్ : సెల్కాన్ మొబైల్స్ డైమండ్ సిరీస్‌లో భాగంగా క్యూ4జీప్లస్ పేరుతో డ్యుయల్ సిమ్ మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6,666. డైమండ్ సిరీస్‌లో భాగంగా కంపెనీ లోగడ 4జీ ప్లస్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, దీనికి మంచి ఆదరణ రావడంతో అదనపు ఫీచర్లు, హంగులు జోడించి క్యూ4జీ ప్లస్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 4ఎక్స్‌కార్టెక్స్ ఏ53 మీడియాటెక్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా తదితర సదుపాయాలు ఉన్నాయి. 4జీ సాంకేతికతతో ఇంటర్నెట్ విని యోగం అనూహ్యంగా పెరుగుతుందని భావిస్తున్నట్టు మొబైల్ ఆవిష్కరణ సందర్భంగా సెల్కాన్ సీఎండీ వై గురు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రానున్న నెలల్లో మరిన్ని 4జీ మొబైల్స్‌ను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. -
సెల్కాన్ నుంచి డైమండ్ క్యూ4జీ
ధర రూ.5,249 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న సెల్కాన్ 4జీ మోడళ్ల సంఖ్యను పెంచుతోంది. తాజాగా డైమండ్ సిరీస్‌లో డ్యూయల్ సిమ్‌తో కూడిన క్యూ4జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర రూ.5,249. ఎల్టీఈ 1,800/850 మెగాహెట్జ్ ఎఫ్‌డీడీ, 2,300 మెగాహెట్జ్ టీడీడీ బ్యాండ్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఐపీఎస్ డిస్ప్లేతో 4.5 అంగుళాల స్క్రీన్, ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, 1 జీబీ డీడీఆర్3 ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో రూపొందించారు. 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్, ఆటోఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర ఫీచర్లు. బ్యాక్ కేస్ ఉచితం. మొబైల్ ఫోన్ల రంగంలో భవిష్యత్ 4జీ ఎల్టీఈ మోడళ్లదేనని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రవేశపెట్టిన 4జీ ట్యాబ్లెట్ సిరీస్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు. మరిన్ని 4జీ ఎల్టీఈ ఆధారిత మోడళ్లను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.