మేడిన్ ఇండియా ఫోన్లు కోరుతున్నారు..
♦ చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత
♦ రెండేళ్లలో తయారీ హబ్‌గా భారత్
♦ సెల్‌కాన్ సీఎండీ వై.గురు
♦ డైమండ్ సిరీస్‌లో కొత్త 4జీ ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటి దాకా చైనా ఉత్పత్తులు వెల్లువెత్తుతున్న భారత సెల్‌ఫోన్ మార్కెట్లో వినూత్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత కస్టమర్లు ప్రస్తుతం మేడిన్ ఇండియా ఫోన్లనే కోరుతున్నారని సెల్‌కాన్ సీఎండీ వై.గురు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోందన్న కారణంగా చైనా ఉత్పత్తుల వాడకం పట్ల భారత్‌లో పెరుగుతున్న వ్యతిరేకతే ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందన్నారు. అలాగే భారత్‌లో తయారైన ఫోన్ల కోసం పలు దేశాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయని వెల్లడించారు. ఈయూ దేశాల కోసం ఒక ప్రముఖ విదేశీ టెలికం కంపెనీ నుంచి భారీ ఆర్డరును దక్కించుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ కోసం 4జీ స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేస్తున్నట్టు వివరించారు.
2018 కల్లా పూర్తిగా ఇక్కడే..
చైనా ఉత్పత్తుల విషయంలో కంపెనీలు, కస్టమర్ల నుంచి వ్యతిరేకత రావడంతో దేశీయ సెల్‌ఫోన్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. పీసీబీ, ఎల్‌సీడీ, చిప్‌సెట్లను కొరియా, తైవాన్ నుంచి, మెమరీ కార్డులు జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. చార్జర్లు, బ్యాటరీలు, హెడ్‌సెట్లు, బాక్స్‌ల వంటి మిగిలిన విడిభాగాలన్నీ భారత్‌లోనే తయారు చేయిస్తున్నట్టు గురు తెలిపారు. చైనా కంటే ఇక్కడే తయారీ వ్యయం తక్కువగా ఉందన్నారు. అన్ని విడిభాగాలు భారత్‌లోనే తయారు చేయాలన్న నిబంధన 2018 నాటికి ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉందన్నారు.
మరిన్ని కొత్త మోడళ్లు..
డిసెంబర్‌కల్లా మరో రెండు 4జీ, రెండు 3జీ స్మార్ట్‌ఫోన్లను సెల్‌కాన్ ప్రవేశపెడుతోంది. అధిక మెగా పిక్సెల్‌తోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌తో రూ.7 వేలలోపు ధరల శ్రేణిలో మోడళ్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం 4జీ విభాగంలో ట్యాబ్లెట్ పీసీలతో కలిపి మొత్తం 4 మోడళ్లను విక్రయిస్తోంది. అన్ని మోడళ్లనూ మేడ్చల్ ప్లాంటులో తయారు చేస్తోంది. కంపెనీ అమ్మకాలు సాగిస్తున్న ధరల శ్రేణిలో తెలంగాణలో 41 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం మార్కెట్ వాటా ఉన్నట్టు సెల్‌కాన్ తెలిపింది.
మరో రెండు 4జీ మోడళ్లు..
డైమండ్ సిరీస్‌లో ఏస్, పాప్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లను సెల్‌కాన్ విడుదల చేసింది. ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్, 5 ఎంపీ కెమెరాను రెండు మోడళ్లలోనూ పొందుపరిచారు. డైమండ్ ఏస్‌ను 5 అంగుళాల డిస్‌ప్లే, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రూపొందించారు. ధర రూ.4,999. డైమండ్ పాప్‌ను 4.5 అంగుళాల స్క్రీన్‌తో తయారు చేశారు. ఫోన్ ధర రూ.4,699 ఉంది. స్క్రీన్ పగలకుండా ఉండేందుకు డ్రాగన్‌ట్రైల్ గ్లాస్‌ను వాడామని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. అన్ని మోడళ్లకూ జియో వెల్కం ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు.