ముగ్గురి ఆత్మహత్యాయత్నం
క్షణికావేశాంలో ఆత్మహత్యలకు యత్నిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నచిన్న కారణాలకూ చాలామంది బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. ఇదే కోవలో తాజాగా ముగ్గురు ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తల్లి మందలించిందని..
ఏలూరు (సెంట్రల్) : తల్లి మందలించిందని ఓS బాలుడు బ్లీచింగ్ పౌడరును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఔట్ పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ హనుమాన్ నగర్‌కు చెందిన చింతాడి లక్ష్మి భర్త చనిపోవడంతో తన కుమారుడు రాజేష్‌ను పోషించుకుంటోంది. రాజేష్ సక్రమంగా స్కూల్‌కు వెళ్లకపోవడంతో సోమవారం రాత్రి ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ సోమవారం రాత్రి బ్లీచింగ్ పౌడరును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తల్లి చికిత్స నిమిత్తం అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భర్త మందలించాడని
భర్త మందలించాడని మనస్థాపానికి గురైన ఓ మహిళ గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. పెండ్యాల వెంకట్రావు, కళావతి దంపతులు ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి భర్త వెంకట్రావు కళావతిని మందలించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
భార్య సరిగా కూర వండలేదని..
భార్య కూర సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడిన భర్త గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. పెంట్రాల కోటి, నాంచారమ్మ దంపతులు ద్వారకాతిరుమలలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కోటి సోమవారం రాత్రి కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లగా.. భార్య కూర సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మనస్థాపానికి గురై గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతనిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.