dilip raja
-
జీవితంతో బాబూజి
భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బాబూజి’. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందు తున్న ఈ చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. కాగా అదే నగరానికి వెళ్లిన జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ చిత్రంలో జగ్జీవన్‌రామ్ పాత్రధారి మిలటరీ ప్రసాద్‌పై చిత్రీకరిస్తున్న సీన్‌కి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ – ‘‘మహాత్మాగాంధీ ఆహ్వానంతో స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చిన జగ్జీవన్‌రామ్ మరెందరినో ఆ ఉద్యమంలోకి తీసుకురావటం, జైలు శిక్ష అనుభవించడం వంటివాటిని ‘బాబూజి’లో తప్పనిసరిగా చూపించాలని మీరాకుమార్ సూచించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, 2024 జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
కుర్రాళ్ల గుండె చప్పుడు
అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ చిత్రాన్ని తెరకెక్కించిన దిలీప్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘యూత్’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అనేది ట్యాగ్‌లైన్. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ సమర్పణలో పెదరావురు ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. షూటింగ్‌ని తిరిగి గోవాలో ప్రారంభించారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘గోవా బీచ్ దగ్గర కొన్ని ఛేజింగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. జనవరిలో చివరి షెడ్యూల్‌ను ఏపీలోని 13 జిల్లాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా కథను, నటీనటుల వివరాలను ప్రస్తుతానికి బహిర్గతం చేయడం లేదు. ఈ సినిమా కాకుండా ‘తను నేనూ ఒక్కటే’ అనే టైటిల్‌తో మరో సినిమా రూపొందించనున్నాం’’ అన్నారు. -
వలస కార్మికుడే హీరో
‘పండుగాడు ఫొటో స్టూడియో’ ఫేమ్ దర్శకుడు దిలీప్‌రాజా ‘లాక్డౌన్’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ‘లాక్డౌన్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్ బోర్డ్ ఆమోదం ఇచ్చినట్లుగా దిలీప్‌రాజా తెలిపారు. ఈ సినిమాను విజయ బోనెల, ప్రదీప్ దోనూపూడి నిర్మించనున్నారు. ఈ ‘లాక్డౌన్’ సినిమా గురించి దిలీజ్ రాజా మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఒకవైపు కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలీల బతుకు చిత్రమే ‘లాక్డౌన్’. ఈ చిత్రంలో వలస కార్మికుడే హీరో. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అలాగే ‘యూత్: కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు దిలీప్‌రాజా. -
త్వరలో మా ఏపీ ఎన్నికలు
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నాం’’ అని ‘మా–ఏపీ’ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ‘మా–ఏపీ’ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘మా–ఏపీ’ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, సెక్రటరీలు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ.. మిగతా కార్యవర్గ సభ్యులు తమ రాజీనామాలను అందజేయవచ్చు.. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక నామినేషన్లు వేసుకోవచ్చు. ఈసారి ‘మా–ఏపీ’ అధ్యక్ష స్థానానికి ఒక ప్రముఖ హీరో బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘మా–ఏపీ’లో శాశ్వత సభ్యత్వం గల సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాలకు చెందినవారు పోటీ చేయవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెల 31 వరకు ఏపీలో షూటింగ్‌లు నిలిపివేశాం. ఎవరైనా షూటింగ్‌లు జరిపితే శాశ్వత సభ్యత్వాలను రద్దు చేస్తాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకులు శ్రీధర్, రత్నాకర్, స్టోరీ బోర్డు సభ్యుడు అశోక్ వడ్లమూడి, ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కుర్రాళ్ల గుండెచప్పుడు
‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రదర్శ కుడు దిలీప్ రాజా తెరకెక్కించనున్న చిత్రం ‘యూత్’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అన్నది ఉప శీర్షిక. ధన్య బాలకృష్ణ లీడ్ రోల్లో, రావత్ సింధు, వెన్నెల, ఆలోక్ జైన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘నా బలం, నా శ్రేయోభిలాషి అయిన డైరెక్టర్ సుకుమార్‌గారు కథ విని ఓకే అంటేనే ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చేశాం. ఇప్పుడు ‘యూత్’ కథ కూడా సుకుమార్‌గారు బాగుందంటేనే మొదలుపెడతాం. యువత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు? ఎలాంటి బాధలను భరిస్తున్నారో తెలియజెప్పేదే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో హిందీ నుంచి ఇద్దరు, తమిళ్ నుంచి ఇద్దరు ప్రముఖ నటులు నటిస్తారు. మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి సినిమాని జూన్‌లో రిలీజ్ చేయాల నుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం రెండు ట్యూ¯Œ ్స రెడీ అయ్యాయి’’ అన్నారు సంగీత దర్శకుడు యాజమాన్య. -
మా ఏపీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్’ (మా ఏపీ) లో సభ్యులైన నిరుపేద కళాకారులు, సాంకేతిక నిపుణులు తమ పేర్లను ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సర్వేలో విధిగా నమోదు చేసుకోవాలి. నమోదు అయిన ‘మా ఏపీ’ సభ్యులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉంటుంది’’ అని ‘మా ఏపీ’ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా, అధ్యక్షురాలు కవిత అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో వారు మాట్లాడుతూ–‘‘రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనల మేరకు ‘మా–ఏపీ’ 24 విభాగాల యూనియన్ సంబంధిత శాఖ అధికారుల నుంచి ఆమోదం పొందిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మా ఏపీ’కి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 400 మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు సభ్యులుగా ఉన్నారు. ప్రేక్షకులే నిర్ణేతలుగా ‘మా–ఏపీ’ సినీ అవార్డుల వేడుకలను జనవరిలో నిర్వహిస్తున్నాం. అన్ని విభాగాల్లోని వారికి అవార్డులు అందిస్తాం. మా ఏపీ సభ్యులకు హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారిని కలిసి మంజూరు చేసేలా కృషి చేస్తాం’’ అన్నారు. -
పాటలు నచ్చడంతో సినిమా చేశా
‘‘ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాల్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఆదాయపు పన్ను విషయం ఏమో అనుకున్నా. ‘నా ఫ్రెండ్ సినిమా చేస్తున్నారు.. మీరు అందులో నటించాలి’ అన్నారు. ఆ ఆఫీసర్ ఫ్రెండే మా దిలీప్ రాజా అని తెలిసింది. కట్ చేస్తే... మొదట నాకు కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పా’’ అని అలీ అన్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో అలీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి రిలీజ్ చేశారు. అలీ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాతో ఈ సినిమా నిర్మించారు. మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లి అయిపోతుంది అనేది ఈ చిత్ర కథ. రెండేళ్లు ఈ కథ కోసం కష్టపడ్డా. జంధ్యాలగారి మార్క్ కామెడీతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దిలీప్ రాజా. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, నటీనటులు బాబూమోహన్, శ్రీకాంత్, నరేష్, ‘అల్లరి’ నరేష్, చార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన మా ఏపీ అధ్యక్షురాలు కవిత
తెనాలి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ (మా–ఏపీ) అధ్యక్షురాలు, సినీనటి కవిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసినట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా శుక్రవారం తెలిపారు. తెనాలిలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మా–ఏపీ కార్యక్రమాలు, రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి తమ కమిటీ ముఖ్యమంత్రితో చర్చించనుందని వివరించారు. కమిటీలో కవితతో పాటు సీనియర్ నటులు నరసింహరాజు, గీతాంజలి, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, సినీ జర్నలిస్ట్ వీరబాబు ఉంటారని వివరించారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేసి, రాష్ట్రంలో సినిమాలు నిర్మించే సంస్థలకు సబ్సిడీ, జీఎస్టీలో రాష్ట్రం వాటా, వినోదం పన్ను తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. త్రికోటేశ్వరున్ని దర్శించుకున్న సినీనటుడు పృధ్వి నరసరావుపేట రూరల్(నరసరావుపేట): కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పృధ్వికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి అశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట సినీనటులు తేజస్విని, పద్మరేఖ, జేసినా, ఆషా, పార్టీ నాయకులు చింతా కిరణ్ ఉన్నారు. -
‘మా ఏపీ’లోకి తెలంగాణ, చెన్నై టెక్నీషియన్లు
సాక్షి, తెనాలి: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా–ఏపీ) యూనియన్‌లో ఇప్పటివరకు తెలంగాణ, చెన్నై నుంచి 200 మందికి పైగా సినిమారంగ టెక్నీషియన్లు సభ్యత్వం తీసుకున్నట్లు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా తెలిపారు. మా–ఏపీ కీలక నిర్ణయాల సమావేశాన్ని మే నెల మొదటి వారంలో తెనాలిలోనే జరిపేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. సంస్థ అధ్యక్షురాలు కవిత, ఉపాధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, కార్యదర్శులు అన్నపూర్ణ, గీతాంజలి, శ్రీలక్ష్మితో పాటు చెన్నై యూనియన్ సభ్యులు హాజరుకానున్నట్టు వివరించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దిలీప్‌రాజా మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం పదేళ్ల తర్వాత ఏపీలోని సినిమా యూనియన్లకే ప్రాధాన్యత ఉంటుందని గుర్తుచేశారు. కెమెరా అసిస్టెంట్లు, లైట్ ఆఫీసర్లు, మేకప్ మెన్, ఆర్ట్ విభాగం, ప్రొడక్షన్ విభాగం, రవాణా, నగారా వంటి వివిధ శాఖల టెక్నీషియన్లు సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని చెప్పారు. సినిమాకు చెందిన నిజమైన టెక్నీషియన్లకు మాత్రమే ఇందులో సభ్యత్వం ఉంటుందన్నారు. వివిధ శాఖల్లో పని నేర్చుకుంటున్న వ్యక్తులకు అప్రెంటిస్ సభ్యత్వం ఇస్తున్నామని వివరించారు. -
అభిమాన కోలాహలం
యూ–టర్న్ తీసుకోవడానికి సమంత రాజమండ్రి వెళ్లారు. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్, రాధిక చేతన్, దిలీప్ రాజ్ ముఖ్య తారలుగా రూపొందిన కన్నడ చిత్రం ‘యూ–టర్న్’. ఈ సినిమాను అదే టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సమంత లీడ్ రోల్ చేస్తోన్న ఈ సినిమాకి పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ శనివారం రాజమడ్రిలో ప్రారంభమైంది. అయితే.. సమంతను చూడటానికి చాలా మంది అభిమానులు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడంతా కోలాహలం నెలకొంది. వారి అభిమానానికి ఫిదా అయ్యారు సమంత. ‘‘యూ–టర్న్’ సినిమా స్టారై్టంది. అభిమానుల ప్రేమ నన్ను మరింత ప్రోత్సహిస్తోంది. మూవీని మరింత బాగా తీయడంలో నాకు ప్రేరణ కల్పిస్తోంది’’ అని పేర్కొన్నారు సమంత. -
యూ టర్న్‌కు రెడీ
అదో ఫ్లై ఓవర్. అక్కడ ఎవరైతే డివైడర్స్ని తొలగించి మరీ యూ టర్న్ తీసుకుంటారో వాళ్లు అవుట్. గేమ్‌లో నుంచి కాదు లైఫ్‌లో నుంచి. కాపాడాలని చూసినా, తప్పించుకోవాలని ట్రై చేసినా ఆ ట్రయల్స్ అన్నీ వేస్ట్. డెత్ బెల్ మోగడం ఖాయం. ఎందుకలా? ఈ మిస్టరీ ఏంటీ? అన్న ప్రశ్నలకు.. రెండేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన ‘యూ టర్న్’ చిత్రాన్ని చూసినవారికి సమాధానాలు తెలిసే ఉంటాయి. శ్రద్ధా శ్రీనాథ్, రాధిక చేతన్, దిలీప్ రాజ్ ముఖ్య తారలుగా పవన్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నారు. సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘‘పవన్‌కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ తమిళ, తెలుగు భాషల్లో ‘యూ టర్న్’ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఆమె తెలుగులో నటిస్తున్న ‘రంగస్థలం, మహానటి’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
తెనాలి నుంచి యూ ట్యూబ్ చానల్
తెనాలి: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వీక్షకులను తన వశం చేసుకున్న యూట్యూబ్ ఆధారిత చానల్ తెనాలి నుంచి ప్రారంభించనున్నట్లు టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర ఫిలిం సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వెల్లడించారు. స్థానిక చెంచుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. టీవీ చానల్స్ తరహాలోనే యూట్యూబ్ చానల్లో అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయ కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయనున్నట్లు వివరించారు. చానల్ ప్రసారాలు భారత్‌తో పాటు అమెరికా, కెనడా, ఇటలీ, జర్మనీ, యూకే దేశాల్లో ఆయా స్థానిక భాషల్లో ప్రసారం చేసేలా తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్త చేసినట్లు చెప్పారు. ఒక్కో దేశంలో ఒక్కో సీఈవో ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు. తెలుగు కార్యక్రమాల రూపకల్పనకు ఈ రంగంలో అనుభవజ్ఞులైన పుట్టా శ్రీధర్, సి.సుజాత, ముత్తపు రాంబాబు, శ్రీనివాసకుమార్ దర్శకత్వ బాధ్యతల్లో ఉంటారని దిలీప్‌రాజా చెప్పారు. పెదరావూరు స్టూడియోలో షూటింగ్ నుంచి ప్రసారం వరకు అవసరమైన ఎడిటింగ్, డబ్బింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా ఇక్కడే జరుగుతాయన్నారు. వారాంతపు చర్చలు ‘షాడో’, విద్యార్థులతో ‘పాస్వర్డ్’, మహిళలకు ‘ఇండియా టేస్టస్ట్’, యువతకు ‘డ్యాన్స్ చాలెంజ్’, రాజకీయనేతల ‘మై వాయిస్’ కార్యక్రమాలుంటాయని వివరించారు. ‘దిలీప్ రాజా యూట్యూబ్ చానల్’ పేరుతో ఆవిష్కరించే ఈ చానల్లో ఔత్సాహికులు తీసే షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలనూ ప్రసారం చేస్తామన్నారు. -
రాష్ట్రానికి ఎందుకు తీసుకురారు?
సాక్షి, తెనాలి: తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వపరంగా ప్రయత్నం జరగడంలేదని కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా విమర్శించారు. ఏపీకి చెందిన నటీ నటులు ఎందరో తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారని చెప్పారు. ఈ సినీ పరిశ్రమను ఇక్కడకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్, చిత్రపురి కాలనీలు లాంటివి అమరావతిలోనూ ఏర్పాటు చేస్తే నటీనటులు, టెక్నీషియన్లు ఏపీకి వస్తారన్నారు. రాజధానిలో స్టూడియోలు నిర్మించేవారికి భూమి కేటాయిస్తే ముందుకొచ్చేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారని దిలీప్‌రాజా తెలిపారు. -
రాజీపడే ప్రశ్నే లేదు
‘సాక్షి’తో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా తెనాలికి చెందిన టీవీ చిత్రాల దర్శకుడు దిలీప్‌రాజా.. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. 14 మంది సభ్యులతో కూడిన సెన్సార్ బోర్డు పదవిని స్వీకరించి శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. మంచి సినిమాలను ప్రేక్షకులే ఆదరించాలని, సమాజానికి హాని కలిగించే చిత్రాలను తిప్పికొట్టాలని చెప్పారు. సెన్సార్ బోర్డు సభ్యుడిగా తనకున్న పరిమితుల ప్రకారం వ్యవహరిస్తానని స్పష్టంచేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మీ సినీ నేపథ్యం మూడు దశాబ్దాలుగా దాదాపు 300 వరకూ టీవీ ఎపిసోడ్స్, టెలీ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఎన్నో పాఠాలు నేర్పింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు... ప్రశ్నార్థకంగా నిలిచిపోయాయి. వెనకాల వెక్కిరింపులు, ఎకసెక్కాలు మామూలే.! కన్నీళ్లు సుడులు తిరిగి ఎందుకీ చిత్రాల గోల? అనుకున్న సందర్భాలనేకం. అంతలోనే మళ్లీ కెమెరా ముందుకు వెళుతూ వచ్చా. సినిమా అంటే నాకు అంత ఇష్టం. పిచ్చి కూడా..! ఇంతకాలానికి నా ప్రయాణానికో గమ్యం ఏర్పడింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో సెన్సార్ బోర్డు సభ్యుడి పదవి దక్కడం సంతోషంగా ఉంది. టెలీఫిలిమ్స్పై.. 1986లో నేను తొలిసారి దర్శకత్వం వహించిన టెలీఫిలిమ్ ‘కాలింగ్ బెల్’. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో ప్రసారమై ఎంతో ఆదరణకు నోచుకుంది. ఆ క్రమంలో కొత్తబాట, నిశ్శబ్దగీతం, సుజలాం సుఫలాం, పాణిగ్రహణం, పల్లె ఒడిలో, మన్నెంలో మొనగాడు, రక్షకులు ఇలా ఎన్నో టెలీఫిలిమ్స్ తీశాను. ఇందులో ఒక ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్/ ఐపీఎస్‌లు నటించారు. సినిమా ఆసక్తి లేని, ఆ రంగంతో సంబంధం లేని పెద్దలతో మేకప్ వేయించాను. నేను పరిచయం చేసిన నటీనటులు ఈరోజు టీవీ, సినిమాల్లో రాణిస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ? ఈ ప్రయాణంలో సరికొత్త మలుపుగా హాస్య ప్రధానమైన సినిమా రూపకల్పనకు అన్నీ సిద్ధం చేసుకున్నా. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏదో సాధించాలన్న తపనే ఇందుకు కారణం. నా సినిమా షూటింగ్ నూతన రాజధాని పరిధిలోనే ఉంటుంది. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఔట్‌డోర్ షూటింగులకు అనువైన లోకేషన్లు చాలా ఉన్నాయి. నా టెలీఫిలిమ్స్ దాదాపు ఈ ప్రాంతాల్లోనే తీశాను. మన నిర్మాతలు అటుకేసి దృష్టిసారిస్తారని ఆశిస్తున్నాను. నేటి సినిమాలపై మీ అభిప్రాయం సినిమాలను చూసి మంచిని అనుకరించాలే గానీ చెడును ఆదర్శంగా తీసుకోరాదు. మితిమీరిన హింస, సెక్స్, ఫ్యాక్షనిజం, ఉగ్రవాదాన్ని చూపే సినిమాలను ప్రేక్షకులు తిప్పికొట్టిననాడు అలాంటి సినిమాలు తీయడానికి ఎవరూ సాహసం చేయరు. మంచి కథాంశంతో తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించటం శుభపరిణామం. ఈ వాతావరణం మరిన్ని మంచి సినిమాలు వచ్చేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను. సెన్సార్ బోర్డు సభ్యుడిగా చట్టప్రకారం అనుసరిస్తాను. రాజీపడే ప్రశ్నే లేదు.