‘సాక్షి’తో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా
తెనాలికి చెందిన టీవీ చిత్రాల దర్శకుడు దిలీప్‌రాజా.. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. 14 మంది సభ్యులతో కూడిన సెన్సార్ బోర్డు పదవిని స్వీకరించి శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. మంచి సినిమాలను ప్రేక్షకులే ఆదరించాలని, సమాజానికి హాని కలిగించే చిత్రాలను తిప్పికొట్టాలని చెప్పారు. సెన్సార్ బోర్డు సభ్యుడిగా తనకున్న పరిమితుల ప్రకారం వ్యవహరిస్తానని స్పష్టంచేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మీ సినీ నేపథ్యం
మూడు దశాబ్దాలుగా దాదాపు 300 వరకూ టీవీ ఎపిసోడ్స్, టెలీ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఎన్నో పాఠాలు నేర్పింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు... ప్రశ్నార్థకంగా నిలిచిపోయాయి. వెనకాల వెక్కిరింపులు, ఎకసెక్కాలు మామూలే.! కన్నీళ్లు సుడులు తిరిగి ఎందుకీ చిత్రాల గోల? అనుకున్న సందర్భాలనేకం.
అంతలోనే మళ్లీ కెమెరా ముందుకు వెళుతూ వచ్చా. సినిమా అంటే నాకు అంత ఇష్టం. పిచ్చి కూడా..! ఇంతకాలానికి నా ప్రయాణానికో గమ్యం ఏర్పడింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో సెన్సార్ బోర్డు సభ్యుడి పదవి దక్కడం సంతోషంగా ఉంది.
టెలీఫిలిమ్స్‌పై..
1986లో నేను తొలిసారి దర్శకత్వం వహించిన టెలీఫిలిమ్ ‘కాలింగ్ బెల్’. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో ప్రసారమై ఎంతో ఆదరణకు నోచుకుంది. ఆ క్రమంలో కొత్తబాట, నిశ్శబ్దగీతం, సుజలాం సుఫలాం, పాణిగ్రహణం, పల్లె ఒడిలో, మన్నెంలో మొనగాడు, రక్షకులు ఇలా ఎన్నో టెలీఫిలిమ్స్ తీశాను. ఇందులో ఒక ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్/ ఐపీఎస్‌లు నటించారు. సినిమా ఆసక్తి లేని, ఆ రంగంతో సంబంధం లేని పెద్దలతో మేకప్ వేయించాను. నేను పరిచయం చేసిన నటీనటులు ఈరోజు టీవీ, సినిమాల్లో రాణిస్తున్నారు.
భవిష్యత్తు కార్యాచరణ?
ఈ ప్రయాణంలో సరికొత్త మలుపుగా హాస్య ప్రధానమైన సినిమా రూపకల్పనకు అన్నీ సిద్ధం చేసుకున్నా. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏదో సాధించాలన్న తపనే ఇందుకు కారణం. నా సినిమా షూటింగ్ నూతన రాజధాని పరిధిలోనే ఉంటుంది. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఔట్‌డోర్ షూటింగులకు అనువైన లోకేషన్లు చాలా ఉన్నాయి. నా టెలీఫిలిమ్స్ దాదాపు ఈ ప్రాంతాల్లోనే తీశాను. మన నిర్మాతలు అటుకేసి దృష్టిసారిస్తారని ఆశిస్తున్నాను.
నేటి సినిమాలపై మీ అభిప్రాయం
సినిమాలను చూసి మంచిని అనుకరించాలే గానీ చెడును ఆదర్శంగా తీసుకోరాదు. మితిమీరిన హింస, సెక్స్, ఫ్యాక్షనిజం, ఉగ్రవాదాన్ని చూపే సినిమాలను ప్రేక్షకులు తిప్పికొట్టిననాడు అలాంటి సినిమాలు తీయడానికి ఎవరూ సాహసం చేయరు. మంచి కథాంశంతో తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించటం శుభపరిణామం. ఈ వాతావరణం మరిన్ని మంచి సినిమాలు వచ్చేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను. సెన్సార్ బోర్డు సభ్యుడిగా చట్టప్రకారం అనుసరిస్తాను. రాజీపడే ప్రశ్నే లేదు.