తెనాలి: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వీక్షకులను తన వశం చేసుకున్న యూట్యూబ్ ఆధారిత చానల్ తెనాలి నుంచి ప్రారంభించనున్నట్లు టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర ఫిలిం సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వెల్లడించారు. స్థానిక చెంచుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. టీవీ చానల్స్ తరహాలోనే యూట్యూబ్ చానల్‌లో అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయ కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయనున్నట్లు వివరించారు. చానల్ ప్రసారాలు భారత్‌తో పాటు అమెరికా, కెనడా, ఇటలీ, జర్మనీ, యూకే దేశాల్లో ఆయా స్థానిక భాషల్లో ప్రసారం చేసేలా తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్త చేసినట్లు చెప్పారు. ఒక్కో దేశంలో ఒక్కో సీఈవో ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు.
తెలుగు కార్యక్రమాల రూపకల్పనకు ఈ రంగంలో అనుభవజ్ఞులైన పుట్టా శ్రీధర్, సి.సుజాత, ముత్తపు రాంబాబు, శ్రీనివాసకుమార్ దర్శకత్వ బాధ్యతల్లో ఉంటారని దిలీప్‌రాజా చెప్పారు. పెదరావూరు స్టూడియోలో షూటింగ్ నుంచి ప్రసారం వరకు అవసరమైన ఎడిటింగ్, డబ్బింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా ఇక్కడే జరుగుతాయన్నారు. వారాంతపు చర్చలు ‘షాడో’, విద్యార్థులతో ‘పాస్‌వర్డ్’, మహిళలకు ‘ఇండియా టేస్టస్ట్’, యువతకు ‘డ్యాన్స్ చాలెంజ్’, రాజకీయనేతల ‘మై వాయిస్’ కార్యక్రమాలుంటాయని వివరించారు. ‘దిలీప్ రాజా యూట్యూబ్ చానల్’ పేరుతో ఆవిష్కరించే ఈ చానల్‌లో ఔత్సాహికులు తీసే షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలనూ ప్రసారం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment