direct admissions
-
ఆనర్స్ డిగ్రీతో నేరుగా పీహెచ్డీ.. వివరాలు ఇదిగో..
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రోగ్రాముల్లో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై నేరుగా పీహెచ్డీ చేయొచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అవకాశం కల్పిస్తోంది. ఆనర్స్ కోర్సులో నిర్ణీత స్కోరు పాయింట్లు సాధించి ఉంటే నేరుగా పీహెచ్డీ చేయవచ్చు. జాతీయ నూతన విద్యా విధానంలో పీహెచ్డీ ప్రవేశాలకు కొన్ని నూతన అంశాలను కేంద్ర ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. వీటిని అనుసరించి ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలో ప్రవేశానికి విధివిధానాలను యూజీసీ ఖరారు చేసింది. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులో 10 స్కోరు పాయింట్లలో 7.5 పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 0.5 స్కోరు పాయింట్ల మినహాయింపునిచ్చింది. ఆనర్స్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పరిశోధన అంశాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో 7.5 స్కోరు పాయింట్లుకన్నా తక్కువ వచ్చిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన తరువాతే పీహెచ్డీ చేసేందుకు అర్హత ఉంటుంది. సీట్ల భర్తీలోనూ మార్పులు యూనివర్సిటీల్లోని పీహెచ్డీ కోర్సుల సీట్లను భర్తీ చేసే విధానంలోనూ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయా యూనివర్సిటీలే నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజా విధానాన్ని అనుసరించి ఇకపై జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా వర్సిటీల్లోని సీట్లను భర్తీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయా వర్సిటీలు, రాష్ట్రాలు సొంతంగా భర్తీ చేసుకోవాలంటే 60:40 నిష్పత్తిలో ప్రవేశాలు కల్పించారు. యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు లేదా రాష్ట్రాల కామన్ ప్రవేశ పరీక్షల ద్వారా 40 శాతం సీట్లను భర్తీ చేస్తే మిగతా 60 శాతం సీట్లను జాతీయస్థాయి పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, ఆనర్స్ డిగ్రీలో నిర్ణీత స్కోరు సాధించిన వారు కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే పీహెచ్‌డీకి ఎంపిక కావాలి. -
‘అంబేడ్కర్’ వర్సిటీ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో 2015-16 సంవత్సరానికిగాను డైరెక్ట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఆలస్యరుసుం లేకుండా ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 ఆఖరి గడువు అని వారు తెలిపారు.