ప్రభుత్వం మారినా తప్పని రైతన్న కష్టాలు
బీజేపీ కిసాన్‌మోర్చా
జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వం మారిన రైతులకు కష్టాలు తప్పడంలేదని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు పేర్కొన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం శనివారం జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా స్థానిక అతిథి గృహంలో బీజేపీ నియోజవర్గం ఇన్చార్జి మల్లికార్జున్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింగ్‌రావు మాట్లాడుతూ వర్షాలు ముఖం చాటేయడంతో వేల రుపాయాల పెట్టుబడితో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోరుబావుల్లోని నీటిని పంటలకు మళ్లించుకుందామంటే విద్యుత్ కోతలు అవరోధంగా మారాయన్నారు.
ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా మారిందన్నారు. రూ.లక్ష లోపు రుణ మాఫీలో స్పష్టతలేకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. జిల్లాలో కరువు ఛాయలున్నందున కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొవాలన్నారు. సమావేశంలో మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు హన్మంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి, రాఘవేంద్ర నాయక్, విశ్వనాథ్‌యాదవ్, వేణుపల్లోడ్, కాశప్ప, నాగరాజు తదితరలు పాల్గొన్నారు.