స్విచ్చేస్తే షాక్
సాక్షి, మంచిర్యాల : మరోసారి వినియోగదారులపై కరెంటు చార్జీల మోత మోగనుంది. సంస్థ లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచేలా ఎన్పీడీసీఎల్ ప్రతిపాదనలు చేసింది. దీంతో విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి కానుంది. ఫలితంగా ఏటా రూ.30 కోట్ల వరకు భారం పడనుంది. ఇప్పటికే వస్తున్న కరెంటు చార్జీలను భరించలేకుండా ఉన్న వినియోగదారులు.. మరోమారు పెంచనుండడంతో లబోదిబోమంటున్నారు.
కమిషన్‌కు పెంపు ప్రతిపాదనలు.. : విద్యుత్ చార్జీల పెంపు టారిఫ్ రేట్లను రూపొందించిన ఎన్పీడీసీఎల్ ప్రతిపాదనలను ఇటీవల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేసింది. కమిషన్ కూడా చార్జీల పెంపుపై సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. చార్జీల పెంపుపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషనర్ గురువారం ఈ విషయమై వరంగల్‌లో సమావేశమైంది. ఇందులో జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ అశోక్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు టారిఫ్ రేట్లపై వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.
ఇందులో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినా సభ్యులు మాత్రం మౌనంగా ఉండి .. చార్జీల పెంపు తప్పదని స్పష్టం చేశారు. చార్జీలు పెరిగితే జిల్లా ప్రజలపై సుమారుగా ఏటా రూ.30 కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. చార్జీల పెంపు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు.. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో రానున్న రోజుల్లో కరెంట్ కోతల ముప్పూ ఉండడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లావ్యాప్తంగా 6,44,151 విద్యుత్ కనెక్షన్లు..
జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలకు సంబంధించి 6,44,151 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో.. 5,10,695 గృహ సంబంధిత కనె క్షన్లు ఉండగా, పరిశ్రమలు 3,420, వ్యవసాయ కనెక్షన్లు 1,30,036 ఉన్నాయి. ప్రతినెలా 124 మిలియన్ యూనిట్ల నుంచి 140 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు సగటున నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకంలో ఉంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో డిస్కంల ఖర్చులు.. విద్యుత్ చార్జీల ఆదాయం మధ్య రూ.2.5 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు లోటు ఉంటోంది. అందుకే.. ఈ లోటును చార్జీల రూపేణా పూడ్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి.
చార్జీల పెంపు స్వల్పమే..
ప్రస్తుతం కొంత మేరకే చార్జీలు పెంచాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. అదే ప్రతిపాదన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు అందజేసింది. 100-200 యూనిట్లు వాడితే 4 శాతం, 200 ఆ పైనా విద్యుత్ వాడితే 5.57 శాతం మేరకు బిల్లులు పెంచాలని నిర్ణయించింది. గృహేతర, వాణిజ్య, పరిశ్రమలు, వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలు, పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, ప్రార్థనా మందిరాల్లో విద్యుత్ వినియోగంపై ప్రస్తుతమున్న చార్జీల కన్నా 5.75 శాతం హెచ్చిస్తూ ప్రతిపాదనలు పంపింది.
దీంతోపాటు హెచ్‌టీ వినియోగం కింద సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వాడిన పరిశ్రమలకు అదనంగా ఒక రూపాయి చొప్పున టీవోడీ చార్జీని వినియోగించాలని విద్యుత్ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఇదిలావుంటే.. జిల్లాలో గృహావసరాలకు సంబంధించి చాలా మంది 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. ఇతర కేటగిరిల్లోనూ వాడకం ఎక్కువే. ఈ లెక్కన చూసుకుంటే.. జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై రూ. 30 కోట్ల మేరకు భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.