dog adoption
-
సొత్తుతో పాటు.. కుక్కపిల్లనూ వదలలేదు సార్..!
హైదరాబాద్: పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సొత్తుతో పాటు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని సైతం ఎత్తుకెళ్లిన ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీనగర్ బాలాజీ నగర్‌కు చెందిన ఐలయ్య గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అల్మరా తాళం పగులగొట్టి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వీటితో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను కూడా అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం (వేలి ముద్రల నిపుణులు)తో కలిసి వివరాలు సేకరించారు. ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో.. -
కోట్లల్లో పెరిగిపోతున్న పెట్ డాగ్స్ ఇండస్ట్రీ..
పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ భారత్‌లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్ పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్ కోసం ఫుడ్, ట్రీట్మెంట్ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక పిల్లుల్లో 2% వాటికి మాత్రమే బ్రాండెడ్ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్ సెలూన్లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్ డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్లు, డాగ్ సిట్టర్లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్లు, నోబిల్ ట్రీట్మెంట్ వ్యాన్లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు ఉన్నాయి. TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్‌లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. -
తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!
మిషిగన్: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు. అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్ హార్న్‌కు చెందిన థియా చేజ్ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆల్ టెర్రయిన్ వెహికిల్(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. -
ఆ ఆర్మీ శునకాలను పొగిడిన మోదీ
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశ భద్రతా వ్యవస్థలో శునకాల సేవల గురించి ప్రస్తావించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కామాండేషన్ కార్డు పొందిన ఆర్మీ శునకాలు విదా, సోఫియాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ( అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ ) కర్తవ్య నిర్వహణలో వాటి సేవలను మోదీ కొనియాడారు. ప్రజలందరూ శునకాలను పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, విదా నార్తర్న్ కమాండ్‌లోని యూనిట్లో విధులు నిర్వర్తిస్తోంది. ఐదు మైన్లు, ఒక గ్రెనేడ్ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడింది. ఇక సోఫియా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తోంది. వాసన పట్టి బాంబులను గుర్తించటంలో సోఫియా నిపుణురాలు. -
ఆ కుక్క ఆచూకీ చెబితే 5 లక్షల రివార్డ్
కాలిఫోర్నియా : చాలామంది పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా తోడు- నీడలా వెంట తీసుకెళ్తారు. అలాంటి వాటికి ఏమైనా జరిగితే వారు విలవిల్లాడిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాలెర్మో అనే మహిళ ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుకుంటోంది. దాని పేరు జాక్సన్. గత వారం కిరాణ దుకాణం నుంచి వస్తుండగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎమిలీ తన స్నేహితులతో కలిసి కుక్కను వెతికినా.. ఎంతకీ దాని ఆచూకీ లభించకపోవడంతో కావాలనే ఎవరో దాన్ని అపహరించి ఉంటారని భావించిన మహిళ దాన్ని వెతకడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించింది. కుక్కను వెతికి ఇచ్చిన వారికి రూ. 5 లక్షల నజరానాను ప్రకటించింది. అంతేగాక కుక్కను వెతకడానికి సహాయంగా ఓ విమానాన్ని సైతం అద్దెకు తీసుకుంది. విమాన ఖర్చులకు అదనంగా 1200 డాలర్లను కేటాయించింది. జాన్సన్‌ను వెతికి పట్టుకోడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఎమిలీ ఒక గోఫండ్‌మేను ప్రారంభించింది. అందుకు ఆమెకు 7వేల డాలర్ల కంటే ఎక్కువగానే సేకరించడంతో అదనంగా వచ్చిన డబ్బును డాగ్ రెస్క్యూకి విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇక ఈ విషయంపై కుక్క యాజమాని ఎమిలీ మాట్లాడుతూ.. ‘జాన్సన్ ఎప్పుడూ నాతోనే ఉండేది. మాది నిజమైన ప్రేమ. నేను నా అయిదేళ్ల జాక్సన్‌ను వెతకడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. దాన్ని కనుగొనడానికి నాకు సహాయం కావాల’ని ఆవేదనతో కోరుకుంది. -
అబ్బాయిలూ.. మీ లేఖ అందింది!
కొత్త వ్యక్తులతో స్నేహం చేయడానికి కొంతమంది ఆసక్తి చూపుతారు. తమ అభిప్రాయాలు, ఆలోచనలకు దగ్గరగా ఉండేవాళ్లతో పరిచయం చేసుకోడానికి ఉవ్విళ్లురుతారు. అయితే ఇంగ్లండ్‌లోని ఓ నలుగురు స్నేహితులు మాత్రం విచిత్రంగా ఓ జంతువుతో స్నేహం చేయాలని భావించారు. అంతేగాక దానితో స్నేహం కోసం ఓ లేఖ కూడా రాశారు. చివరికి బదులుగా వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు వాళ్లు దేనితో స్నేహం చేయాలనుకుంటున్నారు.. సమాధానం ఏం వచ్చింది అని ఆలోచిస్తున్నారా.. అయితే చదవండి. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన జాక్ మెక్క్రాసన్, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇటీవల ఓ ఇంట్లోకి అద్దెకు దిగారు. వారికి పెంపుడు జంతువులంటే ప్రాణం. కానీ ఇంటి యాజమాని అందుకు అనుమతించకపోవడంతో నిరాశ చెందారు. దీనికి పరిష్కారం అలోచించిన ఆ స్నేహితులు ఎదురింట్లో పెంపుడు కుక్క ఉందని తెలుసుకున్నారు. ఇక తలచిందే తడవుగా మీ కుక్కతో వాకింగ్ చేయొచ్చా.. స్నేహం చేయొచ్చా అని పక్కింటి వారికి లేఖ రాశారు. దీనికి ప్రతిస్పందనగా వారికి కుక్క తరఫున మరో లేఖ అందింది. అది చూసిన ఆ నలుగురు ఆనందంలో మునిగితేలారు. ‘‘అబ్బాయిలూ.. మీరు రాసిన లేఖ అందింది. నాకూ కొత్త వ్యక్తులను కలవడం ఇష్టమే. మీరు నా స్నేహితులవ్వడం గొప్ప విషయంగా భావిస్తున్నా. కానీ ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. మన స్నేహం విలువ రోజుకు ఐదు బంతులు విసిరాలి. నన్ను బుజ్జిగించి ఆడుకోవాలి. ఇది మీకు అంగీకారమైతే నా సేవకుడి (ఇంటి యాజమానురాలి)కి వాట్సాప్ చేయండి. త్వరలోనే కలుద్దాం’’ అంటూ ఆ కుక్క భావాలను లెటర్ రూపంలో ఇంటి యాజమానురాలు పంపారు. ఈ విషయమంతా సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్‌గా మారింది. ఈ లేఖను చదివిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మా పెంపుడు కుక్కకు స్నేహితులంటే ప్రాణం. మీరు ఎప్పుడైనా రావచ్చు’ అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. Been saying we’d love a dog about the house but our landlord doesn’t allow pets, so my housemate posted a letter to our neighbours asking if we could walk their dog every once and a while and the response was better than we could have ever hoped for pic.twitter.com/dcMOfPk5UH — Jack McCrossan (@Jack_McCrossan) December 10, 2019 -
కుక్కనుకుని పెంచితే చివరకు..
బీజింగ్ : కుక్క ఎప్పటికి ఎలుక కాలేదు. ఇది వాస్తవం. కానీ తాను కుక్క అనుకుని తెచ్చి పెంచుకున్న ఆ జీవి కాస్తా చివరకూ ఎలుక అయ్యింది. అంటే మొదట కుక్కగా ఉండి తరువాత ఎలుకగా మారలేదు. పుట్టడం, పెరగడం అంతా ఎలుకగానే చేసింది. కానీ దాన్ని పెంచుకున్న యాజమానే దాన్ని కుక్కగా భావించాడు. ఈ వింత సంఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని స్మాల్ మౌంటేన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుని ఇంటి దగ్గర అతనికి ఓ చిన్న జీవి కనిపించింది. చూడ్డానికి చాలా చిన్నగా, నల్లగా ఉన్న ఆ జీవిని సదరు వ్యక్తి కుక్క పిల్లగా భావించాడు. దాంతో ఆ కుక్క పిల్లను పెంచుకోవాలని ముచ్చడపడ్డాడు. స్నేహితున్ని అడిగి ఆ బుజ్జి కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్లగానే భావించి దాన్ని కొన్ని రోజులపాటు పెంచాడు. కానీ కొన్ని రోజులు గడిచిన తరువాత తాను పెంచుతున్న జీవి కుక్క కాదేమోనని ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. అసలు తన దగ్గర ఉన్న జీవి ఏంటో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. దాంతో ఆ జీవి ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫోటోలో ఉన్న జీవి ఏంటో చెప్పమని నెటిజన్లను కోరాడు. చివరకూ ఓ నెటిజన్ సదరు జీవిని ఎలుకగా తేల్చాడు. ఆ జీవి పేరు పేరు బ్యాంబో రాట్ అని అది ఎక్కువగా దక్షిణ చైనాలో కనిపిస్తుందని.. అది వెదురు తినడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని తెలిపాడు. గతంలో కూడా చైనాకు చెందిన ఓ వ్యక్తి కుక్కగా భావించి ఎలుగు బంటిని పెంచాడు. -
అనుష్క ఒడి చేరిన పసి శునకం
కుక్కపిల్ల సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత, కుక్క పిల్ల, పిల్లి పిల్ల కాదేదీ ప్రేమకు అనర్హం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా మన హీరోయిన్లకు కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకోవడం, వాటిని ముద్దాడటం, ప్రేమతో లాలించడం అధికం అయ్యింది. జంతు సంరక్షణ అనేది ఆహ్వానించ దగ్గ విషయమే. త్రిష, ఎమిజాక్సన్ లాంటి భామామణులు జంతు సంరక్షణ సంస్థల ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కోవలో నటి అనుష్క చేరారు. ఈ బ్యూటీ ఒక కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. ఇప్పటికే అనుష్క హైదరాబాద్‌లో జంతువుల సంరక్షణ కోసం ఆహారాన్ని అందించే సంస్థకు సాయం అందిస్తున్న ఈ ముద్దు గుమ్మ శునక రాజుల ప్రదర్శన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అలాంటి ఒక శునక ప్రదర్శనలో ఒక పసి శునకాన్ని దత్తత తీసుకున్నారు. అనుష్క మాట్లాడుతూ తనకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం అన్నారు. జంతు సంరక్షణ సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మానవ జీవితంలో అత్యం త ప్రేమ పాత్రులుగా పెంపుడు జంతువులుంటాయన్నారు. అలాంటి వాటిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.