Dr Reddys Labs
-
లాభాల జోరు, 17వేలను దాటేసిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ శుక్రవారం కూడా భారీ లాభాలతో కొనసాగుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లు పైగా దూసుకెళ్లగా,నిఫ్టీ 157 పాయింట్లు ఎగిసి 17087 వద్ద కొనసాగుతోంది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోను లాభాలు కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ డా.రెడ్డీస్ 4 శాతం కుప్పకూలి టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. ఇంకా సిప్లా, శ్రీసిమెంట్, సన్‌ఫార్మా,ఎస్బీఐ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీగా పుంజుకుంది. 46 పైసల లాభంతో 79.39 వద్ద ట్రేడ్ అవుతోంది. -
గుడ్ న్యూస్: 2 డీజీ సాచెట్ కమర్షియల్ లాంచ్
సాక్షి, ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ ప్రజలను భయపెడుతోంది. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా చికిత్సలో ప్రభావవంతగా పనిచేస్తున్న, డీఆర్డీవో, రెడ్డీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) డ్రగ్ ఇక మార్కెట్లో లభ్యం కానుంది. సోమవారం 2డీజీ ఔషధాన్ని కమర్షియల్‌గా లాంచ్ చేసింది. దేశంలోని ప్రధాన ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ఉత్పత్తిని సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 99.5 శాతం సమర్ధత కలిగిన ఈ 2డీజీ సాచెట్ 990 రూపాయల వద్ద ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనుంది. మొదట్లో తమ ఉత్పత్తి 2డీజీ ఔషధం మెట్రో, టైర్-1 నగరాల్లోని ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందనీ, ఆతరువాత భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని అని కంపెనీ ఒక ప్రకటన తెలిపింది. దీంతో రెడ్డీస్ ఉదయం సెషన్లో షేర్ ధర ఒక శాతం ఎగిసింది. డాక్టర్ రెడ్డీస్ సహకారంతో డీఆర్డీవో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ భాగస్వామ్యంతో ఈ 2 డీజీ డ్రగ్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన సాధారణ నుంచి తీవ్ర లక్షణాలున్న కరోనా రోగులకు అనుబంధ చికిత్సగా దీన్ని ఉపయోగిస్తున్నారు. చదవండి : కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో భరోసా -
ఒపియాడ్ డ్రగ్: డా.రెడ్డీస్ హై జంప్
సాక్షి, ముంబై: ఇటీవలస్టాక్మార్కెట్లను లీడ్ చేస్తున్న ఫార్మా సెక్టార్ పరుగు శుక్రవారం కూడా కొనసాగింది. దాదాపు అన్ని మిడ్,స్మాల్ క్యాప్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా డా.రెడ్డీస్ భారీగా లాభపడుతోంది. మాదకద్రవ్యాల చికిత్సలో వినియోగించే సుబోగ్జోన్ ఔషధానికి జనరిక్ వెర్షన్ అయిన బ్యుప్రినార్ఫిన్ అండ్ నాలోక్సోన్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ తుది అనుమతి లభించింది. దీంతో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబ్ కౌంటర్ దాదాపు 5శాతానికి పైగా లాభపడింది. తమ డ్రగ్‌కు అమెరికా ఆరోగ్య నియంత్రణా సంస్థ తుది ఆమోదం లభించిందనీ ఓపియాడ్కు అలవాటు పడిన వారిలో ఈ మత్తుమందునునిలిపివేయడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను సుబాగ్జోస్(బుప్రోనోర్ఫిన్ అండ్ నలోగాన్) నిరోధిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2-8 మి.గ్రా మోతాదుల్లో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలిపింది. సుబోగ్జోన్ ఔషధ జనరిక్ వెర్షన్‌కు భారీ డిమాండ్ ఉంటుందున్న అంచనాలతో డాక్టర్ రెడ్డీస్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలో ఒపియాడ్ డ్రగ్ వినియోగం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో రెడ్డీస్‌కు చెందిన ఈ డ్రగ్‌ను అనుమతి లభించడం విశేషం. కాగా లాభనష్టాల మధ్య కొనసాగుతున్న ఈక్విటీ మార్కెట్లో ఫార్మా రంగ షేర్లు లుపిన్, సన్ ఫార్మా, అరబిందో, సిప్లా, పిరమల్, బయోకాన్ లాంటి ఇతర షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. -
డాక్టర్ రెడ్డీస్.. మళ్లీ తుస్!
న్యూఢిల్లీ : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మరోసారి పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్లోనూ కంపెనీ కన్సాలిడేట్ నికరలాభాలు 17 శాతం మేర క్షీణించాయి. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.483.40 కోట్లగా నమోదయ్యాయి. 2015 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ డ్రగ్ మేకర్ లాభాలు రూ.579.30 కోట్లగా ఉన్నాయి. ఇతర సమగ్ర ఆదాయలు రూ.119.40 కోట్లగా నమోదయ్యాయి. కంపెనీ నికర విక్రయాలు కూడా మందగించినట్టు కంపెనీ నేడు నమోదుచేసిన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 7 శాతం డౌన్ అయి రూ.3,653.40 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. నిర్వహణ లాభాలు(ఈబీఐటీడీఏలు) కూడా ఏడాది ఏడాదికి 13.06 శాతం క్షీణించి, రూ.879.3 కోట్లగా రికార్డు అయ్యాయి. అయితే మూడో త్రైమాసికంలో కంపెనీకి గ్రాస్ ప్రాపిట్ మార్జిన్లు మంచిగా 59.10 శాతం పెరిగాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఈ క్వార్టర్లో రూ.500 కోట్లను ఖర్చుచేసినట్టు పేర్కొంది. -
భారీగా తగ్గిన రెడ్డీస్ నికర లాభం
♦ నికర లాభం 76% తగ్గి రూ.153 కోట్లకు ♦ టర్నోవరు 14 శాతం పడి రూ.3,222 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ రంగ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికం(2016-17, క్యూ1) కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 76 శాతం తగ్గి రూ.647.4 కోట్ల నుంచి రూ.153.5 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు 14.11 శాతం పడి రూ.3,752 కోట్ల నుంచి రూ.3,222 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 60 శాతం తగ్గి రూ.400 కోట్లు నమోదు చేసింది. యూఎస్, వెనిజులా మార్కెట్లలో అమ్మకాలు మందగించడమే లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. యూఎస్ఎఫ్డీఏ నుంచి వార్నింగ్ లెటర్ రావడంతో ఉత్పత్తుల విడుదల ఆలస్యం కావడం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది. పోటీ పెరగడంతో ప్రధాన మాలిక్యూల్స్ విలువ పడిపోవడం కూడా సమస్యను పెంచిందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తితో కలసి ఈ సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పెరిగిన భారత వ్యాపారం..: ఉత్తర అమెరికా జనరిక్స్ వ్యాపారం 16.2 శాతం తగ్గి రూ.1,552 కోట్లు నమోదు చేసింది. ఇక యూరప్ జనరిక్స్ వ్యాపారం 16 శాతం పడి రూ.161.5 కోట్లుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు 26 శాతం తగ్గి రూ.427.7 కోట్లను తాకాయి. వీటికి భిన్నంగా భారత్‌లో కంపెనీ వ్యాపారం పెరిగింది. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ 10 శాతం వృద్ధి చెంది రూ.522 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఆదాయం 16 శాతం పడి రూ.469 కోట్లుగా ఉంది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు 9 శాతం అధికమై రూ.480 కోట్లుంది. 5 శాతం పడిన షేర్లు.. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రెడ్డీస్ షేరు మంగళవారం సుమారు 5 శాతం పడింది. బీఎస్ఈలో షేరు 4.37% పడి రూ.3,322.85 వద్ద స్థిరపడింది. ఇంట్రా డేలో 5.15 శాతం తగ్గి రూ.3,295 నమోదు చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 4.67 శాతం పడి రూ.3,319.65 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 1.54 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 15 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.