Dumbriguda
-
దారుణం : తండ్రీ కొడుకులను కొట్టిచంపి.. ఆపై
సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను దుండగులు మాటువేసి హతమార్చారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చంపి ఆపై కాల్చివేశారు. ఈ ఘటన డుంబ్రిగూడ మండలం కోచిగూడలో చోటుచేసుకుంది. వివరాలు.. కోచిగూడకు చెందిన తండ్రీకొడుకులు గమ్మిలి మోహనరావు, అప్పారావు బైక్‌పై పొరుగూరికి వెళ్తుండగా దారికాసిన ఇద్దరు వ్యక్తులు వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం వారికి నిప్పు పెట్టి బూడిద చేశారు. ఈ ఘటనకు ఆస్తి తగాదా కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల గ్రామానికి చెందిన గమ్మిల అర్జున్, డొంబు ఈ హత్యలు చేసి ఉండొచ్చిని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
డుంబ్రిగుడ స్టేషన్ C/o అరకులోయ
విశాఖపట్నం,డుంబ్రిగుడ(అరకులోయ): మావోయిస్టుల భయం కారణంగా ఏకంగా రెండు దశాబ్దాలకుపైగా డుంబ్రిగుడ మండల ప్రజలకు పోలీస్‌స్టేషన్ అందుబాటులో లేకుండా పోయింది. 23 ఏళ్ల క్రితం డుంబ్రిగుడ మండల కేంద్రం నుంచి అరకులోయకు పోలీస్‌స్టేషన్‌ను తరలించారు.దీంతో ఈ మండల వాసులు ఫిర్యాదులు చేసేందుకు మండల కేంద్రం నుంచి 16 కిలో మీటర్ల దూరంలో గల అరకులోయకు వెళ్లవలసి వస్తోంది. డుంబ్రిగుడ మండల కేంద్రంలో 1991 సంత్సరంలో పోలీసు స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి డుంబ్రిగుడ నుంచి గుంటసీమ వెళుతున్న మార్గం సమీపంలో గల మర్రిచెట్టు కింద ఉన్న భవనంలో కొంత కాలం పోలీసు స్టేషన్ నిర్వహించారు. అక్కడ మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండడంతో అరకు–పాడేరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న భవనంలోకి ఈ స్టేషన్‌ను మార్చారు. మళ్లీ మావోయిస్టుల భయంతోనే 1995 సంవత్సరంలో ఈ పోలీసు స్టేషన్ అరకులోయ మండల కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే నిర్వహిస్తున్నారు. ఫిర్యాదుదారుల అవస్థలు డుంబ్రిగుడ మండల కేంద్రంలో పోలీసుస్టేషన్ లేక పోవడంతో 18 పంచాయతీల గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తోందని మండలవాసులు వాపోతున్నారు. సందర్శనతో సరి.. డుంబ్రిగుడ మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ ప్రారంభించేందుకు ఐదేళ్లక్రితం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో భవన నిర్మాణం చేపట్టారు. పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి, భవనాన్ని పరిశీలించారు. కానీ స్టేషన్‌ను ప్రారంభించే చర్యలు తీసుకోలేదు. ఇక్కడ పోలీసుల నివాస గృహాలు లేవు. ఇక్కడ పోలీసు సిబ్బందికి రక్షణ ఉండదన్న కారణంగా స్టేషన్ ఏర్పాటులో జాప్యం చేస్తున్నారని సమాచారం. ఏర్పాటు ఏప్పుడో ? డుంబ్రిగుడలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తామని చాలా రోజుల నుంచి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే కార్యరూపం దాల్చడం లేదు. గత నెల 23న మండలంలో పోతంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామ సమీపంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేశారు. ఈనేపథ్యంలోనైనా ఇక్కడ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తారా ? లేదా ? అని మండల వాసులు ప్రశ్నిస్తున్నారు. డుంబ్రిగుడలో పోలీసు స్టేషన్ ఉంటే ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదేమోనని వారు అంటున్నారు. ఆదేశాలు వస్తే... పోలీసు స్టేషన్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేస్తే స్టేషన్‌ను డుంబ్రిగుడ మండలకేంద్రానికి తరలిస్తాం. – వెంకినాయుడు, అరకు సీఐ. -
చెరువులో పడి విద్యార్థి మృతి
డుంబ్రీగూడ (విశాఖపట్నం జిల్లా): డుంబ్రీగూడ మండలం అరకు సంతబయలు వద్ద ఎన్ఆర్జీఎస్ చెరువులో పడి బంగారు రవీంద్ర ప్రసాద్(13) అనే విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. ప్రసాద్ స్థానికంగా ఉన్న అరకు హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
డుంబ్రిగూడ (విశాఖపట్నం) : ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పాలి(43) అనే గిరిజన మహిళ ఇంటి ముందు పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది. -
చేతబడి నెపంతో వ్యక్తి దారుణహత్య
డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం గుంటిసీమ పంచాయతీ సోబూరు గ్రామంలో సాగి కొండ(50) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. చేతబడి నెపంతో గ్రామస్తులు కొట్టి చంపి బూడిద చేశారు. ఈ దారుణం గత నెల 14 న జరిగినా ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించటంతో భార్యా,పిల్లలు భయపడి చెప్పలేదు. మంగళవారం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాటర్ ట్యాంక్ కూలి యువతి మృతి
డుంబ్రిగూడ (విశాఖపట్నం) : నీళ్లు తేవడానికి ట్యాంక్ వద్దకు వెళ్లిన యువతి ట్యాంక్ కూలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలంలోని అమలగూడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కుర్ర డాలిమ్మ(22) మంచి నీటి కోసం వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ కూలిపోవడంతో గోడ మీద పడి యువతి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ట్యాంక్ శిథిలావస్థలో ఉందని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, దీని వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. -
విశాఖలో ఎలుగుబంటు దాడి; ఇద్దరు మృతి
విశాఖ జిల్లాలో ఎలుగుబంటు దాడి చేసిన సంఘటనలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లా గిరిజన ప్రాంతమైన దంబ్రిగూడ మండలంలో శుక్రవారం ఈ సంఘటన జరిగినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయినవారిని జి.బలరామ్ (49), కొర్రా సిబ్బో (51)గా గుర్తించారు. మృతులు గాటివలస గ్రామస్తులు. తీవ్రంగా గాయపడ్డ దామోదర్‌కు మొదట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రికి తరలించారు. బలరామ్, సిబ్బో, దామోదర్‌తో పాటు మరికొందరు గిరిజనులు సంతకు అరకు వెళ్తుండగా ఎలుగుబంటి వారిపై దాడిచేసినట్టు బాధితులు తెలిపారు. మొదట బలరామ్‌పై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతణ్ని రక్షించేందుకు వెళ్లిన సిబ్బోను తీవ్రంగా గాయపరిచింది. సిబ్బో కూడా సంఘటన స్థలంలోనే మరణించగా, దామోదర్ తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.