Durga Malleswara swamy
-
కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం.. వైభవంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి వేడుకలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
దుర్గమ్మ కానుకల లెక్కింపులో వీడని మూస పద్ధతి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం... రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు రాక.. రోజుకు రూ.13.90 లక్షలకు పైగానే హుండీ ఆదాయం... ఇక దసరా, భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ముగిస్తే కానుకల లెక్కింపు మూడు, నాలుగు రోజులు సాగాల్సిందే! రోజుకు వెయ్యి నుంచి 30 వేల పైబడి భక్తులకు పెరిగినా... కానుకల లెక్కింపులో మాత్రం దేవస్థానం ఇంకా మూస పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో అమ్మవారి కానుకలు, మొక్కుబడులు చేతి వాటానికి గురవుతున్నాయి. బయట పడేవి కొన్నే... గడిచిన ఐదేళ్ల కాలంలో పదికి పైగా ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో ఆలయ సిబ్బంది నేరుగా ఉంటే మరి కొన్ని సంఘటనల్లో సేవా సిబ్బంది, అవుట్ సోర్స్ సిబ్బంది ఉంటున్నారు. టీ కప్పులో బంగారం తాడు దాచి దొరికి పోయిన వైనం ఒకటయితే.. హుండీల నుంచి కానుకలను మహా మండపానికి తరలించేందుకు తీసుకెళ్లే ప్లాస్టిక్ సంచులలో బంగారాన్ని దాచి పెట్టి దొరిపోయిన వైనం మరోటి. సేవకు వచ్చి బంగారం, డబ్బు చక్క బెట్టేసిన వైనం ఇంకొకటి.. ఇలా బయట పడిన ఘటనలు కొన్ని.. ఇంక బయట పడని ఘటనలు ఎన్ని ఉన్నాయోననే అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి కానుకలు, మొక్కుబడులు పెరుగుతున్న తరుణంలో ప్రతి వారం లేదా పది రోజులకు ఒక సారి లెక్కింపు జరిగితే ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టవచ్చునని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వారం లెక్కింపునకు అడ్డంకులేంటి.. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను ప్రస్తుతం 15 రోజులకు ఒక సారి చేపడుతున్నారు. దీంతో ఆలయంలోని అన్ని హుండీల నుంచి ఒకే సారి కానుకలను లెక్కింపుకు తీయడంతో అవి వంద నుంచి 120కి పైగా మూటలవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కానుకలను లెక్కించడం ఆలయ సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంది. లెక్కింపుకు ఆలయ సిబ్బందితో పాటు సేవా సిబ్బందిని అనుమతిస్తారు. దీంతో కానుకల లెక్కింపు ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ఎవరు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. సోమవారం కూడా ఇదే జరిగింది. ఆలయ సిబ్బంది గంటల తరబడి నేలపై కూర్చోవడం ఇబ్బందికరమే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆదమరుపుగా ఉన్న తరుణంలో చేతివాటాన్ని ప్రదర్శించి కానుకలను పక్కదారి పట్టించారు. వారంలో ఒక రోజు కానుకల లెక్కింపు క్రమం తప్పకుండా జరిగితే సాయంత్రానికి లెక్కింపు పూర్తవుతుందని ఆలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీని వల్ల బయటి వ్యక్తులను లెక్కింపునకు పిలవాల్సిన అవసరం కూడా ఉండదని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. విరాళాలు.. కానుకలు ఒక విభాగంగా మార్చితే.. దేవస్థానంలో ప్రస్తుతం పరిపాలనా విభాగం, పూజల విభాగం, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలతో పాటు మరి కొన్ని విభాగాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి భక్తులు అందచేసే విరాళాలు, కానుకలను ఒక విభాగంగా చేసి బాధ్యులను అప్పగిస్తే ఫలితాలు బాగుంటాయని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయానికి, అన్నదానం, అభివృద్ధి పనులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. అయితే ఈ విరాళాల సేకరణ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని గతంలో పలువురు ఈవోలు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. విరాళాల సేకరణతో పాటు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల పర్యవేక్షణ రెండు కలిసి ఒక విభాగం చేసి ఎఈవో స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. (క్లిక్: చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో..) దశాబ్దాలుగా ఇవే పద్ధతులు.. = 15 రోజలకు ఒక సారి లెక్కింపు జరగడం = కానుకలు లెక్కించే ప్రాంతంలోకి వచ్చే సిబ్బందికి మాత్రమే తనిఖీలు ఉండటం = ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు లెక్కింపు జరగడం = సేవా సిబ్బంది పేరిట కొంత మంది సిఫార్సు చేసిన వారిని లెక్కింపులోకి అనుమతించడం = లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఏదైనా ఘటన జరిగిన సమయంలో అవి ఉపయోగకరంగా లేకపోవడం = కానుకల లెక్కింపులో పాల్గొనే పోలీసు, సెక్యూరిటీ, హోంగార్డులను సైతం తనిఖీలు లేకపోవడం -
దుర్గమ్మకు గాజుల మహోత్సవం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో శనివారం గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని గాజులతో అలంకరించారు. యమ ద్వితీయను పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రెండు లక్షల గాజులతో అలంకరించారు. శనివారం అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, ఆది, సోమవారాలు కూడా ఆలయ ప్రాంగణం గాజుల అలంకరణతోనే ఉంటుందని ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో మల్లేశ్వరస్వామికి పెద్ద ఎత్తున భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, దీపార్చన నిర్వహించారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం మరో రూ.3.19 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగింది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3.19 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో రూ.3,19,39,430 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నగదుతో పాటు 474 గ్రాముల బంగారం, 8.85 కిలోల వెండి లభించిందన్నారు. కాగా, సోమవారం జరిగిన లెక్కింపులో రూ.2,87,83,153 ఆదాయం సమకూరింది. రెండు రోజులలో మొత్తం రూ.6.07 కోట్ల మేర హుండీల ద్వారా దుర్గమ్మకు ఆదాయం వచ్చింది. కానుకల లెక్కింపు బుధవారం కూడా కొనసాగనుంది. -
స్వర్ణకవచాలంకారంతో కరుణించిన కనకదుర్గ
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కనకదుర్గమ్మ.. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేదపండితులు, అర్చకుల సుప్రభాతసేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తొలిదర్శనం చేసుకున్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు అమ్మవారికి తొలిపూజ చేశారు. గవర్నర్ దంపతులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాలను జరుపుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పక్కా ప్రణాళికతో, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. కోవిడ్ ఉపశమనంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కృష్ణమ్మ చెంత పులకించిపోయారు. అయితే ప్రభుత్వం ఈసారి కూడా నదీస్నానాలకు అనుమతించలేదు. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడే జల్లు స్నానాలు చేసేందుకు 300కు పైగా షవర్లను ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటుచేశారు. భక్తులకు ఉచిత ప్రసాదం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. క్యూలైన్లలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, సీపీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పల్లకీసేవ, పంచహారతులు భక్తులను పరవశింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరోనా నుంచి ఉపశమనం కలగాలి: గవర్నర్ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అమ్మవారిని దర్శించుకుని తొలిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు ఉపశమనం లభించాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు తెలిపారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు, ప్రముఖులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ శివశంకర్ దర్శించుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్నవారిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ పి.కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులున్నారు. -
దుర్గమ్మ సేవలో సీఎస్ సమీర్‌శర్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ శనివారం దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన సమీర్‌శర్మ దంపతులకు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించారు. మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. -
దుర్గమ్మ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులు విధిగా సంప్రదాయ వ్రస్తాలు ధరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. నేటి (సోమవారం) నుంచే ఈ సంప్రదాయం అమలయ్యేలా చూడాలంటూ దుర్గ గుడి ఈవో ఎంవీ సురేష్ బాబు ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వ్రస్తాలను ధరించేలా చూడాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో అంతరాలయ దర్శనం నిలిపివేసినప్పటికీ, తిరిగి అంతరాలయ దర్శనం ప్రారంభించినప్పుడు ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పురుషులకు దోవతి, పైజామా లాల్చీలు, మహిళలకు చీర, చున్నీలతో కూడిన పంజాబీ డ్రస్సును మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వ్రస్తాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై అమ్మవారి దర్శనానికి విచ్చేసే వారు సైతం సంప్రదాయ వ్రస్తాలను ధరించాల్సి ఉంటుంది. ఒక వేళ దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల వద్ద సంప్రదాయ వ్రస్తాలు లేని పక్షంలో వారి కోనం దేవస్థానం ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేసి చీరలు, పంచెలను అందుబాటులో ఉంచుతుంది. అమ్మవారికి సమర్పించే సారె విక్రయ కేంద్రాలలోనే ఈ వ్రస్తాలు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. -
తెప్పోత్సవానికి చకచకా ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైనా మంగళవారం నిర్వహించనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణ చేసిన హంస వాహనంపై ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాముల వారు కృష్ణానదిలో విహరించనున్నారు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఉండటంతో దుర్గ గుడి అధికారులు తెప్పోత్సవానికి నీటిపారుదల శాఖ అనుమతి తీసుకున్నారు. అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో డీసీపీ విజయరావు, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్‌రావు మాట్లాడుతూ.. కృష్ణానదిలో 40 నిమిషాల పాటు హంస వాహనం ట్రయల్ రన్ నిర్వహించినట్టు తెలిపారు. తెప్పోత్సవం సందర్భంగా 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంస వాహనంపై 32 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. -
దేదీప్యం.. ఆదిదంపతుల నగరోత్సవం
ఆది దంపతుల నగరోత్సవం శనివారం దేదీప్యమానంగా సాగింది. దసరా ఉత్సవాలను పురష్కరించుకుని ఈ ఏడాది దసరా ఉత్సవాలలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మల్లేశ్వరాలయం నుంచి ప్రారంభమైన నగరోత్సవం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా సాగింది. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళార్చన జరిగింది. కళార్చన తర్వాత ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, విజయేశ్వర ఆలయం, టోల్‌గేటు, ఘాట్ రోడ్డు మీదగా ఆలయ ప్రాంగణానికి చేరింది. – విజయవాడ (ఇంద్రకీలాద్రి)