durgabai deshmukh
-
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్‌ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
మహోజ్వల భారతి: నెహ్రూకు నో ఎంట్రీ చెప్పిన దుర్గాబాయ్!
దుర్గాబాయి దేశ్‌ముఖ్ భారత స్వాతంత్య్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాద్‌లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను దుర్గాబాయే స్థాపించారు. రాజ్యాంగ సభలో, ప్రణాళికా సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. నేడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి. 1909 జూలై 15న రాజమండ్రిలో జన్మించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాల్పంచుకున్నారు. పన్నెండేళ్ల వయసులోనే ఆంగ్ల విద్యకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు. ఆంధ్రప్రదేశ్‌కు మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని ఆ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేశారు. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు.. టిక్కెట్ లేని కారణంగా నెహ్రూను ఆమె సభలోపలికి అనుమతించలేదు. కర్తవ్య నిర్వహణలో నిక్కచ్చిగా ఉన్నందుకు తిరిగి నెహ్రూ నుంచే ఆమె ప్రశంసలు అందుకున్నారు. చదవండి: మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు -
స్త్రీ సంక్షేమ సం‘కల్పకం’
ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, కాకినాడ, మహిళల అభ్యున్నతి సాధికారత రంగంలో సేవలను అందించిన ప్రముఖ వ్యక్తులకు పద్మవిభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరిట ఒక అవార్డును ఏర్పాటుచేసింది. ఈ పురస్కారానికి మొదటి గ్రహీతగా కల్పకం ఏచూరిని ఎంపిక చేశారు. దుర్గాబాయ్ జయంతి నాడు (ఈ జూలై 15న) అవార్డును, ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేస్తారు. కల్పకం ఏచూరి చెన్నైలో 23.06.1933న శ్రీమతి పాపయ్యమ్మ జస్టిస్ కందా భీమశంకరం దంపతులకు జన్మించారు. ఏచూరి సీతారామారావు, శేషమ్మ కుమారుడు ఏచూరి సర్వేశ్వర సోమయాజులును వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు పెద్దవారు సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యుడూ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు. ఇక రెండవవారు మారుతి ఉద్యోగ్ నుండి పదవీ విరమణ చేసిన భీమా శంకర్ ఏచూరి. ఆమె సోదరుడు కందా మోహన్, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. కల్పకం తల్లిదండ్రులు దుర్గాబాయి దేశ్‌ముఖ్ కుటుంబ బంధువులు. దుర్గాబాయి ప్రభావంతో ఆమె అనుయాయిగా కల్పకం ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవారు. దుర్గాబాయి స్థాపించిన ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలు కల్పకం. ఆనాటి నుంచీ ఆమె గత ఆరు దశాబ్దాలుగా మహిళా సంఘంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. మహిళా విద్య కోసం రాష్ట్ర మహిళా మండలి, ఎ.పి. సభ్యుల అక్షరాస్యత ఉద్యమంలో పని చేశారు. బయోగ్యాస్ పొగలేని చుల్హా ప్రాజెక్టులు, ఇంధన సంరక్షణ, ఉపయోగించిన ప్లాస్టిక్ సంచుల రీసైక్లింగ్, మూలికా తోటపని, పంచాయతీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ మైక్రో క్రెడిట్, గ్రామీణ శక్తి ద్వారా మహిళల సాధికారత, యూని ఫెమ్ సహకారంతో ప్రాజెక్ట్ మేనేజర్స్ శిక్షణపై ఆమె అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు సహకారంతో గ్రామాలలోని కొందరు నేత కార్మికులకు కొత్త మగ్గాలు ఇవ్వడం, వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కొత్త డిజైన్లతో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా వారు రుణాల ఉచ్చు నుండి బయటపడడానికి వీలు కల్పించారు. నిరంతర సహాయం ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని వందలాది మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి ఆమె వీలు కల్పించారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన వాతావరణ మార్పులపై పార్టీల సమావేశంలోనూ ఇంకా అనేక జాతీయ అంతర్జాతీయ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. కల్పకం సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా అనుక్షణం మహిళల అభ్యున్నతికి అంకితమయిన పద్మవిభూషణ్ దుర్గాబాయ్ దేశముఖ్ నూటపన్నెండో జయంతి సందర్భంగా మహిళా లోకం ఆమెకు ప్రణమిల్లుతోంది. పి. పద్మజావాణి, కాకినాడ, 82474 99024 (నేడు ఏచూరి కల్పకంకు కాకినాడలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అవార్డు ఇస్తున్న సందర్భంగా) -
మాట్లాడే రాళ్ళు
విద్యార్థులు ఏదయినా ఒక విషయాన్ని సాధించాలనుకుంటే–దానికి ప్రతిబంధకమయిన విషయాన్ని దాటడంలో ముందు ఉండాల్సింది మనోస్థైర్యం, మొక్కవోని ధైర్యం. ఈ లక్షణాలకు అవసరమయిన ప్రేరణ మహాత్ములయిన వారినుంచి వస్తాయి. వారి జీవిత చరిత్రలను చదివితే, వారి ప్రసంగాలు వింటే వస్తాయి. ప్రముఖ సంఘ సేవకురాలు, స్త్రీ జనోద్ధరణకు విశేషంగా కృషి చేసిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ 11వ ఏట మహాత్మాగాంధీ ప్రసంగం విన్నారు. సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది ఆ రోజుల్లో. హిందీ నేర్చుకోవాల్సిన అవసరాన్ని, విదేశీ వస్తువులను వాడకుండా వదిలివేయాల్సిన అవసరాన్ని ఆ ప్రసంగం ద్వారా అర్థం చేసుకున్నారు. ఇంటికొచ్చి తను అప్పటివరకూ వాడుతున్న విదేశీ వస్తువులన్నీ పెరట్లో పడేసి అగ్నిహోత్రంలో దగ్ధం చేసారు. ఒక రాట్నం కొనుక్కుని నూలు వడకడం నేర్చుకుని తన బట్ట తానే తయారు చేసుకుని ధరించారు. హిందీ నేర్చుకున్నారు. చిన్నపిల్లలతో ప్రత్యేకించి ‘బాలికా హిందీ ప్రచార సభ’ను ఒక చిన్న కుటీరంలో తన 12వ ఏట ప్రారంభించారు. తాను మహాత్మాగాంధీ నుంచి ఎలా ప్రేరణ పొందారో అందరికీ అలా దేశభక్తి కలగడానికి అందర్నీ కూర్చోబెట్టి దేశభక్తుల చరిత్రలు చెప్పేవారు. అలా ఎంత మందిని తీర్చిదిద్దారో! ఆమె సంకల్పబలం ఎంత గట్టిదంటే – ఒక్క ఆంధ్ర దేశంలోనే వంద విశాలమైన ప్రాంగణాలు ఈ ప్రయోజనం కోసం వెలిసాయి. కొన్ని వేలమంది స్త్రీలను ఉద్ధరించడానికి అనువైన పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆమె అనుభవాలతో ‘స్టోన్స్ దట్ స్పీక్’ పేరిట (‘మాట్లాడే రాళ్ళు’ అని) ఒక పుస్తకం రాసారు. మనం పునాది రాయి ఒకటి వేస్తే... అది ఒక సంకల్పానికి ప్రతీక. నేనిక్కడ ఏడంతస్తుల మేడ కట్టాలనుకున్నా, ఒక పునాది రాయి వేసా. అది వందేళ్ళయినా అలాగే ఉంటుంది. అది మాట్లాడదు–అనుకోకండి. ఏమిటీరాయి. పునాదిరాయి. ఎవరేశారు.. ఫలానాయన. ఎప్పుడేశారు... వందేళ్ళక్రితం. ఎందుకేశారు... ఏడంతస్తుల మేడ కట్టాలని. ఏమయింది... కట్టలేదు. ఆయనేడి... కాలగర్భంలో కలిసిపోయాడు... అంటే – ఇప్పుడా రాయి సంకల్పశుద్ధిలేని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్లే కదా !!!. మరో పునాది రాయి ఉంది. దాని పక్కనే ఒక విశ్వవిద్యాలయం, ఒక వైపున వైద్యాలయం, మరోవైపున కళా కేంద్రం, వాటి వెనుక ఒక ఏడంతస్తుల మేడ వచ్చింది. ఒక వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభించాడో అది ఎలా తీర్చిదిద్దబడిందో ఎంతమంది ఆ లక్ష్యం వైపుగా అడుగులు వేసి దేశ చరిత్రలో కీర్తి పుటలను అదనంగా ఎన్ని చేర్చగలిగారో... మాట్లాడలేదు.. అనుకున్న ఆ పునాది రాయి సజీవ సాక్ష్యాలతో చెబుతున్నదా లేదా!!! అందుకే ఆమె ఆ పేరు పెట్టారు. ఆ పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ – ‘‘ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి కాలం విలువను అర్థ చేసుకోగలిగిన వ్యక్తి, ప్రణాళికా బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి.. ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో దానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకాలనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి తీసుకు రాగలడేమో కానీ, కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకు రాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు’’–అన్నారు. -
పరాయి పాలన నుంచి విముక్తికై..
భారతావని నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఎర్రకోటపై మువ్వన్నల జెండా రెపరెపలు చూసి భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. మరి ఈనాటి ఈ సంతోషం ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగఫలమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటీష్ అధికారుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు ఎదురొడ్డి, వారు చేసిన అలుపెరుగని పోరాటం కారణంగానే నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాం. ఇక సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది మహిళామణులు కూడా విశేష పాత్ర పోషించారు. ‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించడానికి తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది ధీరోధాత్తలను నేడు స్మరించుకుందాం. ఆ ఆదిశక్తి స్వరూపాలను తలచుకుంటూ జై భరతనారీ అని నినదిద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి(1828-58) భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత, ‘ఝాన్సీ’కి రాణి మణికర్ణిక తాంబే. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి.(చదవండి: స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.(దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది) కస్తూర్బా గాంధీ(1869-1944) భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. సరోజిని నాయుడు(1879-1949) భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. -
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఏడో తరగతి విద్యార్థికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించిన ఘటనలో ఓ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంనగర్‌కు చెందిన మనోహర్ లింగం కుమారుడు వంశీకృష్ణ(12)కి ఫిట్స్ రావడంతో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అతడికి ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించారు. బాలుడు మరింత అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు వైద్యులను నిలదీసినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో వంశీ మేనమామ శ్రీనివాస్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆస్పత్రిపై ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని నల్లకుంట సీఐ యాదగిరిరెడ్డి తెలిపారు. -
స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!
ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఎంతో మంది పోరాడారు. ఆ పోరాటంలో తెలుగువారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య..... మేము సైతం అంటూ పాల్గొన్నారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య : భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీ మహత్ముడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1948లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించారు. నాటి కృష్ణా జిల్లాలోని గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు. పింగళి వెంకయ్య : దేశానికి పతాకాన్ని అందించిన యోధుడు పింగళి వెంకయ్య. ఈయన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఆయన.. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే మహాత్మాగాంధీని కలిశాడు. భారత్ వచ్చిన వెంకయ్య... ఆ తర్వాత జెండా రూపొందించాలనే తలంపుతో 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఆయన రూపొందించిన నాటి పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ : భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త.. ఇలా భిన్న పార్శ్వాలున్న వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్. 1909, జులై 15న ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ బోధించేవారు. చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్ముడు ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోకి అనువదించేవారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. కొండా వెంకటప్పయ్య : కొండా వెంకటప్పయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య : రామదండు అనే దళాన్ని స్థాపించి.. చీరాల - పేరాల ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఈయన1889 జూన్ 2 న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. 1921 లో సహాయనిరాకరణోద్యమ సందర్భంగా గాంధీగారి ఉపన్యాసాలను అనువదించినందుకు ప్రభుత్వం ఈయనకు ఇచ్చిన భూమిని రద్దుచేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాది పాలు తిరుచిరాపల్లి జైల్లో ఉన్నారు. 1923 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీరాలపేరాలలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత ఆయనదే. టంగుటూరి ప్రకాశం పంతులు : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, మళ్లీ మరణించే సమయానికి కట్టుబట్టలతో మిగిలిన నిజాయితీపరుడు. 1940, 50లలోని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు.