ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, కాకినాడ, మహిళల అభ్యున్నతి సాధికారత రంగంలో సేవలను అందించిన ప్రముఖ వ్యక్తులకు పద్మవిభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరిట ఒక అవార్డును ఏర్పాటుచేసింది. ఈ పురస్కారానికి మొదటి గ్రహీతగా కల్పకం ఏచూరిని ఎంపిక చేశారు. దుర్గాబాయ్ జయంతి నాడు (ఈ జూలై 15న) అవార్డును, ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేస్తారు. కల్పకం ఏచూరి చెన్నైలో 23.06.1933న శ్రీమతి పాపయ్యమ్మ జస్టిస్ కందా భీమశంకరం దంపతులకు జన్మించారు. ఏచూరి సీతారామారావు, శేషమ్మ కుమారుడు ఏచూరి సర్వేశ్వర సోమయాజులును వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు పెద్దవారు సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యుడూ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు. ఇక రెండవవారు మారుతి ఉద్యోగ్ నుండి పదవీ విరమణ చేసిన భీమా శంకర్ ఏచూరి. ఆమె సోదరుడు కందా మోహన్, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
కల్పకం తల్లిదండ్రులు దుర్గాబాయి దేశ్‌ముఖ్ కుటుంబ బంధువులు. దుర్గాబాయి ప్రభావంతో ఆమె అనుయాయిగా కల్పకం ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవారు. దుర్గాబాయి స్థాపించిన ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలు కల్పకం. ఆనాటి నుంచీ ఆమె గత ఆరు దశాబ్దాలుగా మహిళా సంఘంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. మహిళా విద్య కోసం రాష్ట్ర మహిళా మండలి, ఎ.పి. సభ్యుల అక్షరాస్యత ఉద్యమంలో పని చేశారు. బయోగ్యాస్ పొగలేని చుల్హా ప్రాజెక్టులు, ఇంధన సంరక్షణ, ఉపయోగించిన ప్లాస్టిక్ సంచుల రీసైక్లింగ్, మూలికా తోటపని, పంచాయతీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ మైక్రో క్రెడిట్, గ్రామీణ శక్తి ద్వారా మహిళల సాధికారత, యూని ఫెమ్ సహకారంతో ప్రాజెక్ట్ మేనేజర్స్ శిక్షణపై ఆమె అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు సహకారంతో గ్రామాలలోని కొందరు నేత కార్మికులకు కొత్త మగ్గాలు ఇవ్వడం, వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కొత్త డిజైన్లతో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా వారు రుణాల ఉచ్చు నుండి బయటపడడానికి వీలు కల్పించారు. నిరంతర సహాయం ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని వందలాది మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి ఆమె వీలు కల్పించారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన వాతావరణ మార్పులపై పార్టీల సమావేశంలోనూ ఇంకా అనేక జాతీయ అంతర్జాతీయ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. కల్పకం సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా అనుక్షణం మహిళల అభ్యున్నతికి అంకితమయిన పద్మవిభూషణ్ దుర్గాబాయ్ దేశముఖ్ నూటపన్నెండో జయంతి సందర్భంగా మహిళా లోకం ఆమెకు ప్రణమిల్లుతోంది.
పి. పద్మజావాణి, కాకినాడ, 82474 99024
(నేడు ఏచూరి కల్పకంకు కాకినాడలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అవార్డు ఇస్తున్న సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment