Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు.. పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్‌గా, రిఫరెన్స్ మెటీరియల్‌గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం సభా మందిరంలో బుధవారం నిర్వహించిన "మూడు దారులు" పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృషిని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబీ వర్ధన్ సభకు అధ్యక్షత వహించగా, లీడర్ దిన పత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారని ప్రశంసించారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ వైఎస్ ఆర్ విద్యా విషయాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టేవారనీ, పాలనా వ్యవహారాలలో తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారని పేర్కొన్నారు. రాజకీయాలలో నైతిక విలువలకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. మూడు దారులు పుస్తకంలో రచయిత ప్రత్యేకంగా ప్రస్తావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్మోహన రెడ్డి గురించి పుస్తకం చదివిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో తానే స్వయంగా రాండమ్ శాంపిల్ సర్వే చేశానని ఆయన వివరిస్తూ.. వైఎస్ఆర్ కు 87 శాతం, చంద్రబాబు కు 49.5 శాతం, జగన్ కు 78.5 శాతం జనం మద్దతుగా మాట్లాడారని పేర్కొన్నారు.
మూడు దారులు పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పుస్తకాన్ని సమగ్రంగా సమీక్ష చేసిన లీడర్ దిన పత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించేందుకు జరిపిన వైస్రాయ్ ఉదంతాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో ఆ కుట్రను పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని, ఈ పుస్తకం ద్వారా అమర్ నెరవేర్చారన్నారు. పుస్తకంలో ముగ్గురు ముఖ్యమంత్రులను కథా వస్తువుగా అమర్ తీసుకున్నారని, అయితే నాలుగో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తారని తెలిపారు. అధికారం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ని వెన్నుపోటుకు సైతం వెనుకాడని సంఘటన పుస్తకంలో సాక్షాత్కరిస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ ఎలా క్షోభించింది, అడ్డదారిలో చంద్రబాబు పాలన ఎలా కైవసం చేసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు. ఈ ఆధారాలతో అమర్ రాయడం విశేషమని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. చరిత్రలో వాస్తవిక దృష్టితో రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఏయూ జర్నలిజం శాఖ విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబివర్ధన్ మాట్లాడుతూ.. పాత్రికేయులు అమర్ రాసిన మూడు రహదారుల పుస్తకంపై పి.హెచ్.డి చేయవచ్చన్నారు. సాధారణంగా చరిత్రలను, జీవిత కథలను రాస్తూ ఉంటారని, అందుకు భిన్నంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనా చరిత్రను తొలిసారిగా రాసి అమర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశోధనాత్మక జర్నలిజం ప్రాంతీయ భాషలోనే చేయవచ్చని, అందుకు ఉదాహరణ ఈ పుస్తకమే అన్నారు. పాత్రికేయ ప్రముఖులు మంగు రాజగోపాల్ ఆత్మీయ ప్రసంగం చేస్తూ జర్నలిస్టులలో రాసే జర్నలిస్టు అక్షర బాహుబలి అమర్ అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సమాజంలోని రాజకీయ పరిణామాలకు అప్డేట్ అవ్వాలని, వారిలో అమర్ ముందుంటారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి అమర్ ఈ పుస్తకం రాశారని తెలిపారు.
పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ.. దక్షిణాది వారిని ఉత్తరాది వారు పట్టించుకోరని, మద్రాసీయూలుగా పిలిచే తెలుగువారిని ఆంధ్రులుగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, 1983 వరకు ఓకే పార్టీలో కలిసి ప్రయాణించారని తెలిపారు. 83లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చానని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదన్నారు. అనంతరం, రచయిత అమర్ ను అతిథులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు బిఎస్ రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది.