EAMCET - 3
-
అప్పుడు వందల్లో.. ఇప్పుడు వేలల్లో..
* ఎంసెట్ 2 లీకేజీ ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థులకు చుక్కెదురు * లీకేజీని బయటపెట్టిన వ్యక్తి కూతురికి మెరుగైన ర్యాంకు సాక్షి,హైదరాబాద్/భూపాలపల్లి/పరకాల: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడి మంచి ర్యాంకులు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు విద్యార్థులకు ఎంసెట్-3లో చుక్కెదురైంది. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంసెట్ -2లో 704, 295 ర్యాంకులు రాగా, తాజాగా ఎంసెట్-3లో ఏకంగా 15 వేలు, 9 వేల పై చిలుకు ర్యాంకులకు పడిపోయారు. వీరికి ఎంసెట్-1లో కూడా 20 వేలు, 9 వేల పై చిలుకు ర్యాంకులు రావడం గమనార్హం! ఇక ఎంసెట్-2లో 800 లోపు, 900 లోపు ర్యాంకులతో రాణించిన మరో ఇద్దరు విద్యార్థులకు ప్రస్తుతం 13 వేలు, 24 వేల పై చిలుకు ర్యాంకులు వచ్చాయి. వీరికి ఎంసెట్-1లో 17 వేల పై ర్యాంకులు వచ్చాయి. నిజానికి ఎంసెట్-3లో వీరికి అసాధారణ ర్యాంకులు రావడాన్ని అనుమానించి తోటి విద్యార్థినులుతమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎంసెట్ పేపర్-2 లీకేజీ జరిగిందని ఆరోపించారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాన్ని బహిర్గతం చేసిన వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన గుండెబోరుున రవి కుమార్తె ప్రజ్ఞ ర్యాంకు ఈసారి కాస్త మెరుగైంది. ఆమెకు ఎంసెట్-2లో 3,823వ ర్యాంకు రాగా తాజాగా ఎంసెట్-3లో 3,200 ర్యాంకు వచ్చింది. ఎంసెట్-2 సందర్భంగా తన కుమార్తెతో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు వారం ముందు మాయమై, చివరికి ర్యాంకులు తెచ్చుకోవడంతో అనుమానించిన రవి.. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్ ర్యాంకులు, మార్కుల ఆధారాలు సేకరించారు. ఎంసెట్-2లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. లీకేజీ నిజమేనని తేలడంతో జూలై 29వ తేదీన ఎంసెట్-2ను రద్దు చేసింది. -
రేపే ఎంసెంట్–3
పరీక్ష రాయనున్న 4,710 మంది విద్యార్థులు ఎనిమిది పరీక్షా కేంద్రాల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆదివారం జరిగే ఎంసెట్–3 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు 4,710 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకెఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్‌లోని ఎల్బి కళాశాల, హ్యూమనిటీస్ భవనంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లోకి ఒక గంట ముందుగానే ఉదయం 9గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్ ఎంసెట్ –3 రీజినల్ కోఆర్డినేటర్ అయిన కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకుగాను ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 12మంది అబ్జర్వర్లును, రెండు ఫైయింగ్స్క్వాడ్ల బృందాలు, ఎనిమిది మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లు, సెల్ఫోన్లుఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి గుండ్లసింగారం రూట్ నుంచి చేరుకోవాలని ప్రొఫెసర్ మల్లారెడ్డి సూచించారు. పరీక్షాకేంద్రాలకు వీలైనంత ముందుగా చేరుకోవాలని ఆయన కోరారు. -
11న ఎంసెట్-3, ఫలితాలు 16న
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లతోపాటు పరీక్ష తరువాత చేపట్టాల్సిన కార్యకలాలపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష పూర్తి కాగానే అదే రోజు సాయంత్రం ప్రాథమిక కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ఆ ప్రాథమిక కీపై 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక విద్యార్థుల ర్యాంకులను 16వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమచారం. పరీక్షకు హాజరయ్యే వారు 40 వేల లోపే ఎంసెట్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది విద్యార్థులను ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఎంసెట్-3 కమిటీ నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 17,939 మంది, మిగతా వారు తెలంగాణ వారు. అయితే వారందరూ పరీక్ష రాసేలా వారికి హాల్ టికెట్లను జనరేట్ చేసి, డౌన్లోడ్ చేసుకునేందుకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినా, శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 36,500 మంది విద్యార్థులు మాత్రమే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్నందునా.. రాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య మరో 3 వేల మందికి మించదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం జరిగే ఎంసెట్-3 పరీక్షకు రాసే వారి సంఖ్య 40 వేలకు మించకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.