ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 11న ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లతోపాటు పరీక్ష తరువాత చేపట్టాల్సిన కార్యకలాలపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష పూర్తి కాగానే అదే రోజు సాయంత్రం ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ఆ ప్రాథమిక కీపై 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక విద్యార్థుల ర్యాంకులను 16వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమచారం.
పరీక్షకు హాజరయ్యే వారు 40 వేల లోపే
ఎంసెట్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది విద్యార్థులను ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఎంసెట్-3 కమిటీ నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 17,939 మంది, మిగతా వారు తెలంగాణ వారు. అయితే వారందరూ పరీక్ష రాసేలా వారికి హాల్ టికెట్లను జనరేట్ చేసి, డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినా, శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 36,500 మంది విద్యార్థులు మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నందునా.. రాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య మరో 3 వేల మందికి మించదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం జరిగే ఎంసెట్-3 పరీక్షకు రాసే వారి సంఖ్య 40 వేలకు మించకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.