Earth test center
-
గ్రహ శకలాలతో ముంచుకొస్తున్న పెనుఉత్పాతం
సాక్షి : హాలివుడ్ సినిమాలో చూపినట్లుగా మనం ముందే మేల్కొనకపోతే గ్రహశకలాలతో భూమికి ప్రమాదం రాబోతోందా? మొత్తం మానవ సమాజం తుడిచిపెట్టుకుపోయేంత విపత్తు మనకు ఈ గ్రహశకలాలతో ఎదురుకానుందా?.. అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మొత్తం నాలుగు గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోకపోయినా గ్రహశకలాల వల్ల విపత్తు తలెత్తే అవకాశం ఉండటంతో జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జూన్ 30నే ఎంచుకోవడానికి కారణం ఈ రోజే అతిపెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టింది కనుక. 1908 సంవత్సరం రష్యాలోని టుంగ్సుకా ప్రాంతంలో వేల ఎకరాల అడవిని నాశనం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రస్తుతానికి భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఈ నాలుగు గ్రహశకలాలకు 1979XB, అపోఫిస్, 2010RF12, 2000SG344 అని పేరు పెట్టారు. 1979xb గ్రహశకలం 900 మీటర్ల వ్యాసం గల ఈ గ్రహ శకలం మన భూగ్రహాన్ని ఢీకొడితే వినాశనమేనని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది గంటకు 70,000కిమి వేగంతో సౌర వ్యవస్థలో ప్రయాణిస్తుంటుంది. ప్రతి సెకనుకు 30 కిలోమీటర్లు భూమికి దగ్గరవుతూ భయపెడుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భూమికి ప్రమాదం తెచ్చే గ్రహశకలాల జాబితాలో దీనికి రెండవ స్థానం ఇచ్చింది. ఈ శతాబ్ధం మధ్యలో ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినా, ఖగోళ నిపుణులు మాత్రం ఇది 2024లోపే భూవాతావరణంలోకి ప్రవేశించొచ్చని అనుమానిస్తున్నారు. అపోఫిస్ నాలుగు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణం ఉన్న ఇది భూ కక్ష్యకు చాలా దగ్గరలో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రస్తుతం భూమికి 200 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూ సెకన్‌కు 0.5 కిలోమీటర్ల చొప్పున భూమి దిశగా వస్తోంది. ఈ గ్రహ శకలం క్రమం తప్పకుండా భూ కక్ష్యలో వెళ్తుంది. తాజా రాడార్ సిగ్నల్ ప్రకారం ప్రకారం ఇది 2029లో భూమికి కేవలం 30,000 కి.మి చేరువకు వస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ మధ్యలో మన భూ కక్ష్య మీదుగా వెళ్తుంది. ఇక్కడ సంతోషకర విషయం ఏమంటే ఈసారి భూమికి 30 మిలియన్ కి.మి దూరంలో వెళ్లడం. ఇది గానీ భూమిని ఢీకొడితే 15,000 అణుబాంబుల శక్తి ఉత్పన్నం అవుతుంది. 2010 RF12 ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని సందేహాస్పద గ్రహశకలం ఇది. ఎర్త్ ఇంపాక్ట్ మానిటరింగ్ మరియు ఈఎస్‌ఏలు రెండింటిలోనూ దీన్ని ప్రమాదకర గ్రహశకలంగా నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం భూమికి 215 మిలియన్ కి.మి దూరంలో గంటకు 1,17,935 కి.మి వేగంతో ప్రయాణిస్తోంది. దీంతో ప్రమాదాన్ని ఈ శతాబ్దం చివరి వరకూ అంచనా వేయకపోయినా 500 టన్నుల బరువు, 7 మీటర్ల వ్యాసం గల ఇది భూమిని ఢీకొడితే 2013లో రష్యా పట్టణం చెల్యాబిస్క్‌పై ఉల్కపాతం పడినప్పుడు జరిగిన నష్టం కన్నా ఎక్కువే ఉంటుంది. అనుకోకుండా ఒక ఉల్కపాతం ఈ రష్యా నగరంపై పడి వేలాది భవనాలు దెబ్బతినడమే గాక వందల మంది గాయాలు పాలయ్యారు. 2010RF12 ఆగస్టు 13 2022లో భూమికి దగ్గరగా ప్రయాణిస్తుందని, అప్పుడు దీని భవిష్యత్ గమనాన్ని అంచనా వేయడానికి వీలుంటందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. 2000 Sg344 50 మీటర్ల వ్యాసం కలిగినా చాలా తక్కువ పరిమాణం ఉండటంతో ఇది కలిగించే ప్రమాదం కొంచెం తక్కువే. రష్యా పట్టణానికి కలిగిన నష్టంతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇది భూమికి ప్రతి సెకనుకు 1.3 కి.మి చేరువ అవుతోంది. 2000 SG344 అనేది అటెన్ ఆస్టరాయిడ్స్ అని పిలువబడే ఒక సమూహంలో భాగం. ఈ సమూహంలోని గ్రహశకలాల కక్ష్యలు భూమి కక్ష్యకు చాలా దగ్గరగా ఉంటాయి. రాబోయే మూడు లేదా నాలుగు దశాబ్దాల్లో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. ఇంకా గుర్తించనివి.. మనకు ఇంకా తెలియని గ్రహశకలాలు చాలా ఉన్నాయి. ఇవి మనం గుర్తించక ముందే ఏ సెకను అయినా భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చు. మన సాంకేతికత ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఉదాహరణకు రష్యా మీదకు వచ్చిన ఉల్కపాతాన్నిఅంచనా వేయలేకపోయాం. ఇది జపాన్‌పై 1945లో వేసిన అణుబాంబు కన్నా30 రెట్లు శక్తివంతమైంది. అలాగే డిసెంబరులో బేరింగ్ సముద్రంలో ఒక గ్రహశకలం పడింది. ఇది సముద్రంలో అణుబాంబు కన్నా10 రెట్లు శక్తివంతమైన అలజడిని రేపింది. గ్రహశకలాలతో మనకు ఏర్పడబోయే ప్రమాదాన్ని పసిగట్టిన ఐక్యరాజ్యసమితి గ్రహశకలాల ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పించడానికే జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవంగా ప్రకటించింది. -
రైతుల వద్దకే మట్టి నమూనా పరీక్షలు
శాయంపేట(భూపాలపల్లి) : తెలంగాణ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మట్టి పరీక్ష ప్రయోగశాల నుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల వద్దకే వచ్చి మట్టి నమూనాలను సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించి అప్పటికప్పుడు రైతులకు పరీక్షా ఫలితాలకు సంబంధించిన రిపోర్టు పత్రాన్ని అందజేయనున్నట్లు భూసారా పరీక్షా కేంద్రం ఏడీఏ బీ. రామ్‌జీ తెలిపారు. మండలంలో మొదటి విడతగా పెద్దకోడెపాక, కాట్రపల్లి గ్రామాల్లో ‘మొబైల్ వ్యాన్’ ద్వారా సంచార భూసారా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు పండించే పంటలను ముందుగానే అంచనా వేసుకునే వీలుంటుందన్నారు. పరీక్షల ద్వారా మట్టిలో ఉన్న నత్రజని, భాస్వరం, పోటాషియం ఎంతవేయాలో వ్యవసాయ అధికారులు సిఫారసు చేయడంతోపాటు రిపోర్టులో ఉంటుందన్నారు. మట్టిలోని ఆమ్ల, క్షార గుణాలను, లవణాలైన సోడియం, మెగ్నిషియం, కాల్షియం సాంద్రతను తెలసుకునే వీలుంటుందన్నారు. తద్వారా భూమికి కావా ల్సిన ఎరువుల వాడకాన్ని, ఎలాంటి భూమిలో ఏఏ పంట లు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చో తెలిసిపోతుందన్నారు. రైతులు విత్తనాలు వేస్తే ఎంత శాతం మొలకెత్తే అవకాశం ఉంటుందో వీటి ద్వారా తెలస్తుందన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి రైతు భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడి సాధించుకోవాలని సూచించారు. అనంతరం మట్టి పరీక్షలు నిర్వహించిన రైతులకు అక్కడే ఫలితాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా కేంద్రం ఏఓ హేమలత, సూర్యనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎండీ అహ్మద్ రజా, ఆర్. శివకుమార్, కాట్రపల్లి సర్పంచ్ జర్పుల మాజీబాయి, రాజుపల్లి సర్పంచ్ లావుడ్యా కమల, ఎంపీటీసీ హనీఫా, కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే గౌస్, సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్, గట్టు కుమారస్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
‘భూ చేతన’తో రైతన్నకు లాభం
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని వ్యవసాయ సాగు భూముల్లో సూక్ష్మ ధాతువుల లోపాల్ని భర్తీ చేసేందుకు వ్యవసాయ శాఖ భూ చేతన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రబీ సీజన్‌నుంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో 20శాతం పంట దిగుబడుల్ని పెంపొందించేందుకు ఈ పథకం దోహదపడుతోందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. సూక్ష్మ ధాతువులు సాగు నేలల్లో లోపించటం వల్లనే పంట దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయని ఏటా వేసవిలో సాగు నేలల్లో వ్యవసాయాధికారులు సేకరిస్తున్న మట్టి నమూనాలు చెబుతున్నాయి. అధికారులు గ్రామాల వారీగా సేకరించిన మట్టి నమూనాల్ని ఎప్పటికపుడు హైదరాబాదు భూ పరీక్షా కేంద్రానికి పంపుతారు. అక్కడి పరీక్షల్లో జిల్లాలోని కొన్ని గ్రామాల సాగునేలల్లో సూక్ష్మ ధాతువులు పూర్తిగా లోపించాయని తేటతెల్లమైంది. సూక్ష్మ ధాతువుల లోపాల వలన పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు సాగు నేలలో బతికే పరిస్థితి కనబడటం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐదు గ్రామాల్లో అమలు... ఈ పథకాన్ని జిల్లాలోని బంటుమిల్లి మండలం కొర్లపాడు, కలిదిండి మండలం కొండంగి, గూడూరు మండలం గురిజేపల్లి, గుడ్లవల్లేరు మండలం గాదేపూడి, ముదినేపల్లి మండలం వైవాక గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో క్లస్టరు(250ఎకరాలు)గా తీసుకున్నారు. ఈ గ్రామాల్లో 1,250మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సూక్ష్మ ధాతువుల్ని నివారించేందుకు వీరికి 50శాతం సబ్సిడీతో జిప్సం- 50టన్నులు, జింక్- 12.5టన్నులు, అగ్రిబోర్- 250 కిలోలు సరఫరా చేస్తున్నారు. ప్రాంతాల్ని బట్టి ఒక్కో రైతుకు ఎకరాకు జిప్సం- 40కిలోలు, జింక్- 10కిలోలు, అగ్రిబోర్- 400గ్రాముల్ని అందజేస్తున్నారు. మళ్లీ రెండేళ్ల వరకూ ధాతు లోపాలుండవు... ఒకసారి ఒక గ్రామంలో భూ చేతన పథకాన్ని అమలు చేస్తే ఆ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు ధాతు లోపాల్ని భర్తీ చేసే విధంగా ఆ సీజనంతా పని చేస్తాం. మళ్లీ రెండేళ్ల వరకూ ఆ నేలల్లో ఆ ధాతు లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల్ని ఎప్పటికపుడు నిర్ధారించుకునే విధంగా రైతులకు శిక్షణ ఇస్తాం. పంటసాగుకు మేలైన కొత్త రకాల వంగడాల్ని సిఫారసు చేస్తాం. -జి.ప్రశాంత్‌కుమార్, జిల్లా భూ చేతన కో-ఆర్డినేటర్