పీటర్సన్ ప్రవర్తనపై ఈసీబీ డాక్యుమెంట్స్
లండన్: గత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వ్యవహారశైలి గురించి డాక్యుమెంట్స్ లీకవడంపై దుమారం రేగుతోంది. ఆసీస్‌లో జరిగిన ఈ సిరీస్‌లో పీటర్సన్ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి ఎలా ప్రవర్తించాడో తెలుపుతూ ఐదు పేజీలతో కూడిన రిపోర్ట్ ప్రముఖ క్రీడా వెబ్సైట్లో ప్రచురితమైంది. అయితే అవి యాషెస్‌కు సంబంధించినవి కాదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఖండించింది. పీటర్సన్ ఆత్మకథ వెలువడిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా రూపొందించుకున్నవని తెలిపింది.
‘అది ప్రైవేట్ లీగల్ ఈమెయిల్. కేపీ తన ఆత్మకథలో అనేక విషయాలు తెలిపిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈసీబీ లాయర్స్ కొన్ని విషయాలను సేకరించి పెట్టుకున్నారు’ అని ఈసీబీ పేర్కొంది. ఆ రిపోర్ట్‌లో మాజీ కోచ్ ఫ్లవర్తోపాటు జట్టు సభ్యులతో పీటర్సన్ విభేదాల గురించి పేర్కొన్నారు.
అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు అనంతరం ఆటగాళ్లు లేట్ నైట్ పార్టీలకు వెళ్లద్దని కోచ్ ఫ్లవర్ ఆదేశిస్తే.. పీటర్సన్ మరో ఇద్దరు యువ ఆటగాళ్లను వెంటేసుకుని తెల్లవారుజాము దాకా తాగొచ్చినట్టు ఆ నివేదికలో ఉంది. మరోవైపు ఈ డాక్యుమెంట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని పీటర్సన్ వ్యాఖ్యానించాడు.