పెద్దల మాటే పెళ్లిమంత్రం
ఈ ఇంట్లో రెండో అబ్బాయ్ శ్రీరామ్.
ఆ ఇంట్లో రెండో అమ్మాయ్ శ్రీలక్ష్మి.
ఇద్దర్నీ కలిపి ఒకటి చేసేస్తే?
ఏడడుగులు నడిపిస్తే?
ఈ ఇంటి పెద్దాయనకి, ఆ ఇంటి పెదనాన్నకీ...
ఒకేసారి వచ్చిన ఐడియా!
ఐడియా వస్తే సరిపోతుందా?
పిల్లల్ని అడగాలి కదా!
శ్రీరామ్‌ని అడిగారు... మీ ఇష్టం అన్నాడు.
శ్రీలక్ష్మిని అడిగారు... తనదీ అదే మాట!
పెళ్లయిపోయింది.
పాతికేళ్లు కూడా అయిపోతున్నాయి.
ఇప్పుడీ దంపతుల్ని కదిపి చూడండి...
‘‘అరేంజ్డ్ మ్యారేజ్ ఇంత కుదురుగా ఉంటుందా!!’’
అని ఇద్దరూ ఒకేమాటగా ఆశ్చర్యపోతారు.
ఉమ్మడి కుటుంబంలోని కోడలిగా శ్రీలక్ష్మి...
నలుగురిలో ఒక తోడల్లుడిగా శ్రీరామ్...
సాగిస్తున్న కలుపుగోలు ప్రయాణమే
ఈవారం ‘మనసే జతగా...’
మొన్నటి సినీ నటుడు. నిన్నటి సీరియల్ నటుడు, ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు రెండవ కుమారుడు ఏడిద శ్రీరామ్! ‘డిగ్రీ వరకు చదివినా, సినిమా హీరో అనిపించుకున్నా తల్లిదండ్రుల చాటు బిడ్డగానే పెరిగాను’ అంటారు శ్రీరామ్! ‘పెద్దలు కుదిర్చిన వివాహబంధంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాం కనుకనే పాతికేళ్లుగా ఆనందంగా ఉంటున్నాం’ అంటూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాపురం ఉంటున్న శ్రీరామ్, ఆయన అర్ధాంగి శ్రీలక్ష్మి తమ వైవాహిక జీవితం ముచ్చట్లను ఇలా తెలిపారు.
శ్రీరామ్: ‘స్వరకల్పన’ సినిమా చేస్తున్న సమయంలో అమ్మానాన్నలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అలా శ్రీలక్ష్మితో నా పెళ్లి అక్టోబర్ 5, 1989 జరిగింది. అప్పటివరకు చెన్నైలోనే ఉండేవాళ్లం. వివాహవ్యవస్థ పట్ల ఉండే గౌరవం, అందులోని ఆనందం... మా అమ్మానాన్నల దాంపత్యం చూసి తెలుసుకున్నాను. మాది ఉమ్మడికుటుంబం. ఇంట్లో అందరికీ నచ్చిన, అణకువ కలిగిన అమ్మాయి నాకు తోడుంటే చాలనుకున్నాను. అలాగే నా జీవితంలోకి శ్రీలక్ష్మి అడుగుపెట్టింది. మా ఇంట అడుగుపెట్టినరోజే తనది కలుపుగోలు స్వభావమనీ, ఆనందంగా ఉండే తత్త్వమనీ అర్థమైంది. ఆ ఆనందం పాతికేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. నటుడిగా కొనసాగుతూనే సీరియల్స్ వైపు పయనించాను. ఆ తర్వాత ఇక నటనాపరంగా చాలనుకున్న సమయంలో కన్స్ట్రక్షన్ రంగం వైపు ఆసక్తి కనబరిచాను. ఏం చేసినా భార్యగా నన్ను ప్రోత్సహించడంలో తను ముందుంటుంది. జీవితభాగస్వామి అర్థం చేసుకుని ఆలంబనగా ఉండటంలోనే ఉంది అసలైన విజయం.
శ్రీలక్ష్మి: మాది కాకినాడ. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు ఆడపిల్లలం. నేను రెండవ అమ్మాయిని. మా పెదనాన్న, మామయ్యగారు స్నేహితులు. ముందు ఈ సంబంధం గురించి పెదనాన్న చెప్పినప్పుడు ‘సినిమా రంగానికి చెందిన వ్యక్తి కదా... ఎలా ఉంటారో’ అని భయమేసి వద్దన్నాను. కాని, కుటుంబం చాలా ఉన్నతమైనదని, అబ్బాయి మంచి వాడని పెదనాన్న చెప్పారు. పెద్దవాళ్లు అంతగా చెబుతున్నారంటే నా బాగు గురించే అనుకుని ఒప్పుకున్నాను. ‘ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లాలి, ఎలా నడుచుకుంటానో, ఏం తప్పుపడతారో...’ అని ఎప్పుడూ ఆలోచించలేదు. పెళ్లయ్యాక నాకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. అత్తవారింట్లో అడుగుపెడుతూనే, ఇదే నా ఇల్లు, ఈయనతోనే నా జీవితం అని డిసైడయ్యాను. అప్పటికి వయసురీత్యా కూడా చిన్నదాన్ని కావడంతో మా అత్తగారు నన్ను చిన్నపిల్లలా, సొంత కూతురులా చూసుకునేవారు. తోటికోడలు, అత్త, మామ... ఎక్కడా పరాయి భావన కలగలేదు. ఏ విషయమైనా అందరితో అంత బాగా పంచుకునేదాన్ని. బాధ అనేది ఎవరూ మచ్చుకైనా నా దరికి రానివ్వలేదు. పోనుపోను కుటుంబంలో నా ప్రాముఖ్యం పెరుగుతూ వచ్చింది. మావారు ఇప్పుడు సినిమా నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ఏ కొత్త ప్రాజెక్ట్ చేపట్టినా నా సలహా అడుగుతారు. ఏది ఆసక్తిగా ఉంటుందో ఆ పని చేస్తే నూటికి నూరుపాళ్లు విజయం లభిస్తుందని చెబుతుంటాను. మా నాన్నగారికి నలుగురు అల్లుళ్లు. అన్నదమ్ముల్లా కలిసిపోతారు. మా నాన్నగారు ‘ఇది నా అదృష్టం’ అంటారు.
శ్రీరామ్: శ్రీలక్ష్మికి మంచి అభిరుచులున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆసక్తి. పెయింటింగ్స్ వేయడమంటే ప్రేమ. నృత్యం, సంగీతం అంటే ఇష్టం. ఇవన్నీ నలుగురిలో తనని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇంటికి కావలసిన డిజైనింగ్‌లోనే కాదు నా వర్క్‌లో కూడా సలహాలు అడిగి తెలుసుకుంటాను.
శ్రీలక్ష్మి: శ్రీరామ్ బయటకు సీరియస్‌గా, అంత ఎక్కువ మాట్లాడనట్టు కనిపిస్తారు. కాని ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇంట్లో ఈయన లేకపోతే బోర్‌గా అనిపిస్తుంటుంది. మా అత్తగారు కూడా ఈయన ఇంట్లో లేకపోతే ‘రాంబాబు(శ్రీరామ్) ఎప్పుడొస్తాడు, బోర్‌గా ఉంది’ అని అడుగుతుంటారు. మాకు ఒక పాప. పేరు శ్రీజ. తను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటోంది. ముగ్గురం కలిశామంటే పండగే! ఆయన పాపను గారాబంగా చూస్తుంటే, నేను మాత్రం స్ట్రిక్ట్ అనే పేరు తెచ్చుకున్నాను. ఈ విషయంలోనే అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటాను.
శ్రీరామ్: చిన్న చిన్న గొడవలు, మాటపట్టింపులు మా ఇద్దరి మధ్య వస్తుంటాయి. అలాగని ఏ విషయాన్నీ సాగదీయం. ఎదుటివారిని సాధిద్దామనే ఆలోచన ఉండదు. ఎప్పుడైనా నేనే కాస్త కోపం తెచ్చుకుంటాను. అప్పుడు తను కూల్‌గా ఉంటుంది. తనవైపు కరెక్ట్ అనిపించినప్పుడు నేను కూల్‌గా ఉంటాను. ఇరువైపులా కుటుంబ సభ్యులు ఎక్కువ. అందువల్ల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, వేడుకలూ ... అన్నీ ఎక్కువే! మా కుటుంబంలోని పిల్లలకు, పెద్దవారికి శ్రీలక్ష్మి ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేస్తుంటుంది.
శ్రీలక్ష్మి: ఆర్థిక విషయాలు నేనంతగా పట్టించుకోను. కాని, శ్రీరామ్ అవి నాకు తెలియాలనుకుంటారు. అందువల్ల ప్రతిదీ నాతో చర్చిస్తారు. ఆలూమగల మధ్య ఎటువంటి దాపరికాలూ లేకపోతేనే వారిద్దరూ ఆనందంగా ఉండగలరన్న పెద్దల సూచనను ఇద్దరం పాటిస్తాం. తన కింద పనిచేసేవారు తప్పులు చేసినా వారిని ఒక్కమాట కూడా అనరు. డౌన్ టు ఎర్త్ అనిపిస్తారు. ఆ ప్రవర్తన నాకు బాగా నచ్చుతుంది. ఎప్పుడో ఈయన దగ్గర పనిచేసిన వారు కూడా ఇప్పటికీ ఈయనను కలిసి వెళుతుంటారు. ఈయన దేనికీ టెన్షన్ పడరు. నేనే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని వెంటనే అమల్లో పెట్టవచ్చు కదా! అని అడుగుతుంటాను. అప్పటికి సరే అంటారు. కాని ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరమని చెబుతుంటారు. అలాగే పనులు కూడా చేస్తారు. ఇది ముందు నచ్చకపోయినా, ఫలితం చూశాక సబబే అనిపిస్తుంది.
‘భార్యాభర్తలిద్దరూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నించాలి. అహానికి ఏమాత్రం చోటివ్వకూడదు. ఏదైనా విషయం వస్తే.. ఇద్దరూ సర్దుబాట్లు చేసుకోవాలి. సాధించాలనే ధోరణి ఇద్దరిలోనూ ఉండకుండా జాగ్రత్తపడితేనే ఆ ఇల్లు ఆనందనిలయంగా మారుతుంది’ అని ఈ జంట పాతికేళ్ల వివాహబంధం విజయంలోని అసలు కిటుకులను వివరించారు.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
మా ఇంట అడుగుపెట్టినరోజే తనది కలుపుగోలు స్వభావమనీ, ఆనందంగా ఉండే తత్త్వమనీ అర్థమైంది. ఆ ఆనందంపాతికేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది.
- శ్రీరామ్
పెళ్లయ్యాక నాకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. అత్తవారింట్లో అడుగుపెడుతూనే, ఇదే
నా ఇల్లు, ఈయనతో నేనా జీవితం అని డిసైడయ్యాను.
- శ్రీలక్ష్మి