రాజధాని దరి.. పశ్చిమగోదావరి
►జిల్లాకు నిట్, నిఫ్ట్లతో సరి
►తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ
►చింతలపూడిలో బొగ్గు నిక్షేపాల వెలికితీత
►నరసాపురానికి ఫిషింగ్ హార్బర్
►పోలవరంపై నామమాత్రపు ప్రస్తావన
►‘ఏలూరు స్మార్ట్ సిటీ’ ఊసెత్తని సీఎం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సహజ వనరులు అపారంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధాని చేయాలనే డిమాండ్‌ను ఇసుమంతైనా పట్టించుకోని పాలకులు మొదటినుంచీ చెబుతున్నట్టుగానే మన జిల్లాకు సమీపంలో ఉన్న విజయవాడను రాజధానిగా ప్రకటించారు. దానికి కూతవేటు దూరంలోనే ఉన్న జిల్లాగా రాజధాని స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆశలు తప్ప ప్రత్యేకించి పశ్చిమగోదావరికి ప్రభుత్వం పట్టం కట్టలేదన్న వాదనలకే బలం చేకూరుతోంది. జిల్లాకు ముందునుంచీ చెబుతున్నట్టు నిట్, నిఫ్ట్, తాడేపల్లిగూడెం ఎరుుర్‌పోర్టు పునరుద్ధరణ, నరసాపురంలో ఫిషింగ్ హార్బర్ తప్పించి జిల్లాను దేశ చిత్రపటంలో నిలిపే స్థాయిలో బహుళార్థసాధక ప్రాజెక్టు ఏమీ రాలేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీ సమావేశంలో మన జిల్లాలో నెలకొల్పే ప్రాజెక్టులకు సంబంధించి చేసిన ప్రకటనలపై వివిధవర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
స్మార్ట్ సిటీ వట్టిమాటే
ఏలూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించి అభివృద్ధి చేస్తామని ఇక్కడి ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చినా కనీసం ఎక్కడా ఆ ప్రస్తావనే రాలేదు. అటు శ్రీకాకుళం ఇటు రాజమండ్రి, కాకినాడ సహా 14 నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చగా, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి మాత్రం ఆ భాగ్యం దక్కలేదు. తాడేపల్లిగూడెంలో నిర్వాసితుల వివాదం నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాదు రాదని చెబుతున్న విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు సీఎం స్పష్టమైన ప్రకటన చేశారు.
సిరామిక్ పరిశ్రమలకు ఊతం
జిల్లాకు ఆదాయం సమకూర్చడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమ్యే ఖనిజ సంపద జిల్లాలో సమృద్ధిగా ఉంది. ద్వారకాతిరుమల వద్ద 6 మీటర్ల లోతులో లక్షలాది టన్నుల సుద్ద బంకమట్టి (వైట్ క్లే) నిల్వలు ఉన్నాయి. కూచింపూడి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఈ నిక్షేపాలున్నట్టు అంచనా. దీనితో కుండలు, తెల్ల సుద్దలు, రాచిప్పులు తయారు చేయడమే కాక సిరామిక్స్ పరిశ్రమలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సిరామిక్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పడంతో అది ఈ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక చింతలపూడిలో బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తామని ప్రకటించడంతో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్టయింది.
అగ్రివర్సిటీకి బదులు ఉద్యాన పరిశోధనా కేంద్రం
జిల్లాలో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములు, వెంకట్రామన్నగూడెం, చింతలపూడి అటవీ భూములు అనువుగా ఉంటాయని, ఈ మూడుచోట్ల దాదాపు 1,500 ఎకరాల భూమి అందుబాటులో ఉందని జిల్లా అధికారులు కొద్దిరోజుల క్రితమేనివేదిక రూపొం దించి ఉన్నతాధికారులకు పంపారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఇప్పటికే ఉండటంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం వస్తుందనుకున్నారు.
కానీ అది గుంటూరు జిల్లాకు తరలిపోవడంతో ఉద్యాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో వైద్య కళాశాలను నెలకొల్పాలనే యోచన ఉన్నట్టు పాలకులు చెబుతూ వచ్చినా దానిపైనా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యాసంస్థలను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. వీటిలో నిట్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోనూ, నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
భీమవరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్
జిల్లాలో 5,22,549 హెక్టార్ల సాగుభూమి ఉంది. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు. అత్యధికంగా వరి పండిస్తుండగా అరటి, చెరకు, కొబ్బరి, జొన్న, పొగాకు, పత్తి, మామిడి, ఆరుుల్‌పామ్ వంటి పంటలనూ సాగు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను అన్ని జిల్లాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రజల ఆహార అవసరాలు తీర్చవచ్చు. అంతేకాకుండా పొగాకు, జీడిపప్పు పరిశ్రమలను విస్తరించి అంతర్జాతీయ మార్కెట్లో వాటా సంపాదించవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపిస్తామని ప్రకటించారు. అక్వా రాజధానిగా ఉన్న భీమవరంలో అక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
మరోవైపు డెల్టాలో లేసుపార్కు ఏర్పాటుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు వ్యవసాయాధారితమైన నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పడం తోపాటు జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. ఇక కొల్లేరు సరస్సును పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరంపై నామమాత్రపు ప్రకటనలే చేశారు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటూ ముందునుంచీ చెబుతూ వచ్చిన ప్రకటనే తప్పించి పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఎక్కడా వెల్లడించలేదు. ఏతావాతా ముందుగా అనుకున్న ప్రాజెక్టులే తప్పించి జిల్లాను అనూహ్యంగా అభివృద్ధి చేయగల, వేలాదిమందికి ఉపాధి చేకూర్చగల బహుళార్థప్రయోజన ప్రాజెక్టులేమీ దక్కలేదన్న వ్యాఖ్యలే ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.