Emergency calls
-
ఫోన్లో నెట్వర్క్ లేకున్నా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్లో ఫోన్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, ఫోనులో నెట్వర్క్ లేకపోయినప్పటికీ ఎమర్జెన్సీ కాల్ చేసే ఆప్షన్ కనిపించడాన్ని మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఎవరైనాసరే ఎటువంటి నెట్వర్క్ అవసరం లేకుండా ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఎమర్జెన్సీ కాల్లో పోలీసులకు, అంబులెన్స్ మొదలైనవాటికి ఫోను చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, నెట్వర్క్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫోనులో నెట్వర్క్ లేదంటే దాని అర్థం ఆపరేటర్ నుంచి నెట్ వర్క్ అందడం లేదని అర్థం. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ మరో పద్ధతిలో కనెక్ట్ అవుతుంది. మీ ఫోనుకు మీ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ కాకపోతే.. ఆటోమేటిక్‌గా అదే ఏరియాలో అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ ఏదైనా ఇతర నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇటువంటి సమయంలో సాధారణ కాల్ కనెక్ట్ అవదు. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ చేసినా ఏ నెట్ వర్క్‌తో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. కాగా, ఎమర్జెన్సీ కాల్స్ చేసే సమయంలో ప్రత్యేకమైన నెట్వర్క్ ఉండాలన్న నియమం ఏదీ లేదు. ఈ కారణంగానే ఎమర్జెన్సీ కాల్ ఎప్పుడైనా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాల్ ఎలా కనెక్ట్ అవుతుందంటే.. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ముందుగా ఆ ఫోను మాధ్యమం ద్వారా సమీపంలోని నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్‌కు మెసేజ్ చేరుకుంటుంది. అప్పుడు ఫోనుకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ కొద్ది సెకెన్ల వ్యవధిలోనే జరుగుతుంది. ఫలితంగానే మీరు వెంటనే అవతలి వ్యక్తితో మాట్లాడగలుగుతారు. ఇది కూడా చదవండి: జియో, ఎయిర్టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా -
అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం
సాక్షి, ఖమ్మం: కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల విషయం పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతీ మీటర్‌పై వ్యాట్ రూపంలో చెల్లిస్తున్న రుసుంతో బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. ఒకరిద్దరు నిబంధనల పేరుతో ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం తెలిసిందే. బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ పంపులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛమైన తాగునీరు.. బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందు కోసం బంకు డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంది. ఏ బంకులో కూడ తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థ కు ఫిర్యాదు చేయవచ్చు. మూత్రశాలలు, మరుగుదొడ్లు.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా వినియోగించేందుకు నిర్వహకులు అనుమతులివ్వటం లేదు. మరికొన్ని చోట్ల అసలు కనిపించని పరిస్థితి నెలకొంది. బంకుల్లో ఇలాంటి సౌకర్యాలు లేనట్లయితే పెట్రోలియం సంస్థలకు ఫిర్యాదు చేయొచ్చు. లీటర్ పెట్రోల్, లేదా డీజిల్ కొనుగోలు చేస్తే అందులో మనం బంకులకు 4 నుంచి 8 పైసల వరకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు చెల్లిస్తున్నాం. ఆపదవేళ ఫోన్ సదుపాయం.. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ధ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పని లేదు. ఏదైనా పెట్రోల్ బంక్ ను సందర్శించటం ద్వారా మీరు ఏ నంబర్ కు అయినా కాల్ చేసుకోవచ్చు. ఉచితంగా గాలి నింపాల్సిందే.. టైర్లలో గాలి నింపటానికి గాలి శాతం తనీఖీ చేసుకోవటానికి అనువుగా బంకుల్లో కచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు కూడ ఓ వ్యక్తి ని అందుబాటులో ఉంచాలి. బంకులో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకున్నా, వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనీఖీ చేయాలి. ఇటీవల కాలంలో వాహనాల టైర్లకు ప్రత్యామ్నయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ట్యూబ్‌లెస్ టైర్లు వస్తున్నాయి. వాటిలో నైట్రోజన్ నింపాలి. ఫిర్యాదుల పెట్టె, ప్రథమ చికిత్స కిట్టు ఉండాలి.. ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టే లేదా రిజిష్టర్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారుడు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతి బంకు వద్ధ ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ ప్రథమ చికిత్స పెట్టెలో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీంతో పాటు అన్ని మందులపై గడువు తేదీ కూడ రాసి ఉంచాలి. పాత మందులు ఉండకూడదు. నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు.. పెట్రోల్, డీజీల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ నాణ్యత పరిమాణాన్ని తెలుసుకునేందుకు పరికరాలను సిద్ధంగా ఉంచాలి. వాటి ద్వారా నాణ్యత ను పరీక్షించేందుకు హక్కు మనకు ఉంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజీల్ తక్కువగా వస్తుందనే అనుమానం వచ్చినా పరీక్షించుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ కరువు.. బంకుల వద్ద ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సిన హక్కులు ఉండి కూడ ఏ ఒక్కటి కూడ కల్పించటం లేదు. ముఖ్యంగా బంకులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలన వారి ఇష్టారాజ్యంగా అవుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. - బచ్చలకూరి నాగరాజు, కోరట్లగూడెం అవగాహన కల్పించాలి బంకుల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అన్నింటికి కలిపి చమురుకు ధరలు చెల్లిస్తున్నారు. కానీ వాటిని మాత్రం వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. -మాదాసు శ్రీనివాసరావు, కొత్తకొత్తూరు ఫిర్యాదుల పెట్టెలు కనిపించవు బంకులపై ఫిర్యాదు చేసేందుకు కనీసం ఫిర్యాదుల పెట్టెలు కానీ, రిజిష్టర్లు కానీ బంకుల వద్ధ ఎవరికి కనిపించవు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించరు. ప్రజల హక్కులను కూడ వినియోగించుకోలేకపోతున్నారు. బంకుల పై అధికార యంత్రాంగం ఉందా లేదా అనిపిస్తుంది. -రావెళ్ల కృష్ణారావు, మోటాపురం -
"థింక్ బి ఫోర్ యూ డయల్"
బ్రిటన్: ప్రతి దేశంలో ప్రజలకు అత్యవసర సమయంలో పోలీస్ సేవలు అందుబాటులో ఉండటం కోసం ఆయ దేశాల ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ఫోన్ నెంబర్లను కేటాయిస్తాయి. ఆ ఫోన్ నెంబర్లు అందరికి గుర్తుండేలా ఫ్యాన్సీ నెంబర్లా త్రి డిజిట్ రూపంలో ఉంటుంది. వీటిని ప్రజలు అత్యవసర సమయాల్లో వినయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తే కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గానీ అనవసరమైన వాటి గురించి కాల్ చేసి మరీ విసిగిస్తారు. (చదవండి: ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్) దీంతో పోలీస్ అధికారులు పరిస్థతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అయినా అవి ప్రజల సంరక్షణార్థం ఏర్పాటు చేస్తే వాటిని ప్రశ్నార్థకం చేసేలా అనవసరమైన వాటికి కాల్ చేసి విసిగిస్తే ఎవ్వరికైన కోపం రాకుండా ఉండదు కదా. అచ్చం అలాంటి సంఘటనే యూకేలోని థేమ్స్ వ్యాలీ పోలీస్ అధికారులకు ఎదురైంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక వ్యక్తి పోలీస్ ఎమర్జెన్సీ కాల్ 999 (వృద్ధుల సహాయ నిమిత్తం ఏర్పాటు చేసింది)కి కాల్ చేసి "నేను ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్లి కుళ్లిపోయిన చికెన్ కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నేరుగా పెట్టేశాను. ఆ తర్వాత చూస్తే కుళ్లిపోయిందని, తాను ఆ విషయం గురించి సూపర్ మార్కెట్ అధికారులోతో చెప్పాను. నాకేం ఏంచేయాలో తెలియడం లేదా ఏదైన సలహ ఇవ్వండి" అని కూడా చెబుతాడు. దీంతో ఆ పోలీస్ అధికారి ఇది వృద్ధుల సహాయ నిమిత్తం ఏర్పాటు చేసింది, క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తామని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. పైగా ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ నిరంతరం వస్తుండటంతో సదరు పోలీస్ అధికారులు వీటికి వెంటనే చెకపెట్టాల్సిందే అని అనుకున్నారు. దీంతో సదరు అధికారులు అనుకున్నదే తడువుగా ఆ కాల్ క్లిప్‌ని రికార్డు చేసిన వీడియో తోపాటు "డయల్ చేసే ముందు కాస్త ఆలోచించండి" అనే ట్యాగ్‌లైన్ జోడించి ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ప్రస్తతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆ ఆడియా క్లిప్‌కి లక్షలో వ్యూస్‌లు, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా వినండి. (చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!") -
ఎమర్జెన్సీ కాల్స్‌లో అసభ్య పదజాలం
విజయవాడ : టెలిఫోన్లో మహిళా సిబ్బందిని టార్గెట్ చేసి అసభ్యకరంగా వేధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన నిందితుడిని విజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసు కంట్రోల్‌రూంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ పాల్రాజు శనివారం విలేకరులకు తెలిపారు. డయల్ 100, 108, 104 నెంబర్లకు ఓ వ్యక్తి నిరంతరం కాల్స్ చేస్తూ మహిళల గొంతు వినగానే అసభ్యకరంగా మాట్లాడేవాడు. మహిళా కానిస్టేబుల్స్, 104, 108 సిబ్బందిని కూడా ఇదే విధంగా వేధించాడు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన లారీ డ్రైవర్ డేగపాటి మురళి విజయవాడ పోలీసు కంట్రోల్ రూంకు గత 20 రోజుల్లో 298 కాల్స్ చేసి మహిళా కానిస్టేబుల్స్‌తో అసభ్యకంగా మాట్లాడాడు. ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది అతని కాల్స్‌పై నిఘా పెట్టి వాయిస్ రికార్డు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసు కంట్రోల్ రూంకు కాల్ చేసి మాట్లాడిన మాటల రికార్డులను మీడియాకు వినిపించారు. నిందితుడు మురళీకి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనవసరంగా కాల్స్ చేస్తే చర్యలు డయల్ 100, 104, 108, ప్రభుత్వ సర్వీసులను దుర్వినియోగం చేసే విధంగా అనవసరంగా కాల్స్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కంట్రోల్‌రూంలో లా అండ్ ఆర్డర్ డీసీపీ పాల్రాజు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు వెంకటరమణ, కె. శ్రీనివాస్, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు.