తెలుగు పద్యం
క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
త్తముచిత లజ్జ భూషణ ముదాత్త కవిత్వము రాజ్య మీ క్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగుపట్టున దత్కవచాదులేటికిన్.
భావం: ఓర్పు ఉంటే కవచం అక్కర్లేదు. క్రోధం ఉంటే హాని కలిగించడానికి వేరే శత్రువుతో పని లేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. స్నేహితుడు ఉంటే ఔషధం అక్కరలేదు. దుష్టులు ఉంటే భయంకరమైన సర్పాలే అక్కర్లేదు. ఉదాత్తమైన కవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు.
చక్కని విద్య ఉంటే సంపదతో ప్రయోజనం లేదు. తగురీతిని సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కర్లేదు. ఈ ఓర్పు మొదలైన లక్షణాలన్నీ చెంతనే ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటి అవసరం లేదు.