కాలువలోకి దూసుకెళ్లిన బైక్
లక్కరాజుగార్లపాడు (సత్తెనపల్లిరూరల్), న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం కాలువలోకి దూసుకెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మరొకరు వాహనం పైనుంచి ఒడ్డున పడటంతో సురక్షితంగా బయట పడ్డాడు. ఈ సంఘటనలో విద్యార్థులు కట్టా శ్యామ్ ప్రసాద్, జంగి సాయి గల్లంతు కాగా, కాటేపల్లి సాయిరామ్ బయట పడ్డాడు. వీరు ముగ్గురూ మిత్రులు, దూరపు బంధువులు. గుంటూరుకు చెందిన కట్టా శ్యామ్ ప్రసాద్ జేకేసీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్, కాటేపల్లి సాయిరామ్ డిగ్రీ మొదటి సంవత్సరం, విజయవాడకు చెందిన జంగి సాయి అక్కడి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
క్రిస్మస్ సందర్భంగా మంగళవారం ద్విచక్ర వాహనంపై ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడులో వుండే జంగి సాయి బావ, పాస్టర్ అనోక్ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి రాత్రికి సత్తెనపల్లిలోని శ్యామ్ ప్రసాద్ నాయనమ్మ రాజమ్మ ఇంటికి వచ్చారు. తెల్లవారిన తరువాత ముగ్గురూ ద్విచక్ర వాహనంపై యర్రగుంట్లపాడు బయలుదేరారు. లక్కరాజుగార్లపాడు సమీపంలోకి రాగానే మూత్ర విసర్జన కోసం ఆగారు. అనంతరం జంగి సాయి తాను డ్రైవ్ చేస్తానంటూ స్టార్ట్ చేయడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సాగర్ పంట కాలువలోకి దూసుకు వెళ్లింది. వెనుక కూర్చున్న సాయిరామ్ కింద పడగా వాహనంపై ఉన్న సాయి, శ్యామ్‌ప్రసాద్ బైక్‌తో పాటు కాలువలో పడి గల్లంతయ్యారు.
గాలింపు చర్యలు...
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సాగర్ కెనాల్ అధికారులతో మాట్లాడి నీటి ఉధృతి తగ్గేంచేలా చూసి సాయంత్రం వరకు గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ చిక్కలేదు. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.