కుగ్రామం నుంచి అమెరికాకు
ఇక్కడ తయారయ్యే అప్పడాలు, చక్కిలాలు, పేణి, సొండిగలు రుచికి పేరుపొందాయి. సబ్బియ్యము, జిలకర, పుదీన, పాలాకు, కరివేపాకు,కొత్తిమీర, మెంతాకు, టమోటోలను కలిపి చేసే అప్పడాలు చూడగానే నోరూరిస్తాయి. ఇక విడిగాను, భోజనాల్లోను నంజుకుని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.
గౌరిబిదనూరు: గౌరిబిదనూరు సమీపంలోని కల్లూడి గ్రామం రుచికరమైన అప్పడాల తయారీకి ప్రసిద్ధి పొందింది. ఇక్కడి మహిళలు తయారుచేసే అప్పడాలు ఇతర రాష్ట్రాలకు, తాజాగా విదేశాలకూ ఎగుమతి అవుతూ పల్లెవాసుల కీర్తిని చాటుతున్నాయి. ఆ ఊళ్లో ఏ ఇంటి ముంగిట, మిద్దెల మీద చూసినా అప్పడాలు ఆరవేసిన దృశ్యాలే కనిపిస్తాయి. సుమారు 2 వేలమంది జనాభా, 720 కుటుంబాలు నివసిస్తున్న ఈ చిన్న గ్రామంలో 80 శాతం మంది వృత్తి అప్పడాల తయారీనే. ఈ గ్రామంలో 5 పిండిమరలు ఉన్నాయి. ప్రతి మిల్లూ రోజూ 4 క్వింటాళ్ళ బియ్యాన్ని పిండి ఆడిస్తుంది. ఇలా ఒక కుగ్రామంలో పుట్టిన ఆర్థిక విప్లవంగా ఈ గ్రామాన్ని సందర్శించిన అభ్యుదయవాదులు పేర్కొన్నారు. గ్రామంలో మహిళలు సూర్యోదయం నుంచే అప్పడాల తయారీ ఆరంభిస్తారు. సిరిధాన్యాలు, ఆకుకూరలను కలిపి అనేక రకాల ఫ్లేవర్లలో 18 రకాల అప్పడాలు చేయడంలో వీరు దిట్టలు. పురుషులు వాటిని నగరాలు, పట్టణాల్లో విక్రయించుకుని వస్తారు. ఒక్కో మహిళకు రోజుకు రూ.200 వరకు లాభం మిగులుతుంది.
విదేశాల్లోనూ డిమాండు
అప్పడాల పేరు క్రమంగా రాష్ట్రం దాటి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. అక్కడి నుంచి వ్యాపారులు, దళారులు వచ్చి పెద్ద మొత్తంలో కొనుక్కువెళ్తున్నారు. బెంగళూరు తదితర నగరాల నుంచి విదేశాలకు వెళ్లే వారు కల్లూడి అప్పడాలను వెంట తీసుకెళ్లడం ఆరంభమైంది. తమ కోసమే కాకుండా అక్కడ ఉండే బంధుమిత్రుల కోసం కూడా ఆర్డర్లపై చేయించుకుని తీసుకెళ్తుంటారని గ్రామ మహిళలు చెప్పారు. ఒక్కసారి కొనుక్కువెళ్లినవారు మళ్లీ మళ్లీ కావాలని ఫోన్లు చేసి కొరియర్ ద్వారానో, లేదా తమ బంధుమిత్రుల ద్వారానో తెప్పించుకుంటా రు. అమెరికా, గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లేవా రు ఎక్కువగా అప్పడాలకు ఆర్డర్లు ఇస్తూ ఉంటా రు. దీంతో గ్రామ మహిళల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. నాణ్యత, రుచి పునాదులగా తయారయ్యే అప్పడాలకు ఎంత చెల్లించినా తక్కువే అంటారు కొనుగోలుదారులు.