హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తా
హన్మకొండ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడవెల్లి బస్వారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు జిల్లాకు హామీల వర్షం గుప్పించారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని, అందుకు సరపడా నిధులు కేటాయిస్తామన్నారు.
వరంగల్ నుంచి హైదరాబాద్‌కు కేవలం గంట సమయంలో వెళ్లే విధంగా 6లేన్, 8లేన్ రోడ్లను నిర్మాణం చేస్తామన్నారు. అంతేకాకుండా రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో లోకల్లో ఫాస్ట్‌ట్రాక్ రైలును నడుపుతామన్నారు. కరీంనగర్, ఖమ్మం, మధ్యప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డులను నిర్మానం చేస్తామని చెప్పారు. భూపాలపల్లిలో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా ప్లాంట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఉత్తర తెలంగాణకు ప్రధానమైన ఎంజీఎంను ఆల్ ఇండియా లెవల్లో తీర్చిదిద్దుతామన్నారు.
వరంగల్‌ను ఐటీ హబ్‌గా చేసి, ఇక్కడ చదువుకున్న వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులకు పూర్తి చేస్తామని, అపెరల్ పార్కును అభివృద్ధి చేస్తామని, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకువస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌గా చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
టూరిజం హబ్‌గా చేస్తామని కాకతీయ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ మంత్రులు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికే మరిచిపోయారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే టూరిజానికి కొత్త వెలుగులు తీసుకువస్తామన్నారు. రాజధానికి మిన్నగా మెగా టౌన్‌గా చేసే బాధ్యతను తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నేను సీఎం అవుతానని ఆశపడ్డా
తెలంగాణ తర్వాత తాను కూడా సీఎం అవుతానని ఆశపడ్డాన ని, కానీ... టీడీపీ చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని, బీసీని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ బలంగా ఉందని టీడీపీ ఎన్నిక ల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయూకర్‌రావు అన్నా రు. కేసీఆర్ టికెట్లు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారిని పార్టీలోకి తీసుకుంటూ జెండాలు మోసిన వారికి మోసం చేస్తున్నారని విమర్శించారు.
‘అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వాలంటే శంకరమ్మకు ఆంధ్రా సరిహద్దులోని హుజూర్నగర్ సెగ్మెంట్ ఇస్తారట. కోదండరాం, లక్ష్మయ్యలకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇస్తారట. గెలవలేని సీట్లు వీరికి... గెలిచే సీట్లు కొడుక్కు, అల్లుడు, బిడ్డకు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే... మళ్లీ గడీల పాలన వస్తుంది’ అని అన్నారు.
సాగునీరిచ్చింది మేమే..
జిల్లాలో ఇప్పుడు పండుతున్న పంటలకు సాగునీరు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-1, ఎస్సారెస్పీ-2, దేవాదుల ప్రాజెక్టులను తీసుకువచ్చింది తామేనని, 14 ఏళ్లు ఉద్యమం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ... కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. టీడీపీని ఖాళీ చేయిస్తామని కేసీఆర్ కథలు చెబుతున్నాడని, కానీ తెలంగాణలో కేసీఆర్ దుకాణం ఖాళీ అవుతుంన్నారు.
టీడీపీకి ఓటేయకుంటే ద్రోహులుగా ఉంటాం
బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీడీపీకి ఓటేయకుంటే 56 శాతం ఉన్న బీసీలంతా ద్రోహులుగా మిగిలిపోతామ ని ఆర్.కృష్ణయ్య అన్నారు. కేసీఆర్ పాలన వస్తే... మళ్లీ దోరల పాలన వస్తుందని, ఇప్పటికే అల్లునికో జిల్లా, కొడుక్కొకటి, బిడ్డకొకటి చొప్పున జిల్లాలు రాసిచ్చాడని, విద్యార్థులు, ఉద్యోగులు, యువత బాధలు పట్టించుకోలేదని విమర్శించారు.
టీఆర్ఎస్సో, మరే పార్టీకో అధికారం అప్పగిస్తే బీసీలు మరో 100 ఏళ్లు ఇలాగే ఉండాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రమేష్ రాథోడ్, మోహన్‌రావు, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు సీతక్క, విజయరమణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జి అరవింద్‌కుమార్‌గౌడ్, నేత లు వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, బానో తు మోహన్‌లాల్, గండ్ర సత్యనారాయరావు, చల్లా ధర్మారెడ్డి, మనోజ్‌రెడ్డి, ఈగమల్లేషం, బాబూరావు, బాలూ చౌహాన్, నెహ్రూ నాయక్, అనిశెట్టి మురళి, గట్టు ప్రసాద్, వెంకటనారాయణ గౌడ్, చాడ సురేశ్‌రెడ్డి, మండల శ్రీరాములు, గండు సా విత్రమ్మ, బాబా ఖాదర్ అలీ, బయ్య స్వామి, కృష్ణ, ఎం.సుధాకర్, కక్కె సారయ్య, గోపాల్, బొట్ల శ్రీనివాస్, పుల్లూరి అశోక్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.