
రాళ్లదాడిలో దెబ్బతిన్న బోగీ విండో అద్దం
దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’పై రాళ్ల దాడి జరిగింది.
న్యూఢిల్లీ: దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’పై రాళ్ల దాడి జరిగింది. ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బోగీ అద్దం దెబ్బతింది. సకూర్‌బస్తీ నుంచి రాత్రి 11.03 గంటల ప్రాంతంలో బయలుదేరి రాత్రి 11.50కు న్యూఢిల్లీ చేరుకుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ సహా ఐదుగురు రైల్వే పోలీసులు అందులో ప్రయాణించారు. (ట్రైన్ 18 ఇక ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’)
లాహొరి గేట్ పోస్ట్ పరిధిలోని సర్దార్ ప్రాంతంలో రాళ్ల దాడి జరిగిందని ఉత్తర రైల్వే ఒక ప్రకటన చేసింది. 188320 బోగీ టీ-18 విండో గ్లాస్ దెబ్బతిందని తెలిపింది. సర్దార్ ప్రాంతంలో రైల్వే పోలీసులు గాలించారని, అనుమానితులు ఎవరూ కనిపించలేదని ప్రకటించింది. ‘ట్రైన్ 18’గా వ్యవహరిస్తున్న ఈ రైలుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ అని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. వారణాసి–ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.