faulty airbags
-
మారుతి కార్లలో లోపాలు: రీప్లేస్ చేసేదాకా దయచేసి వాడకండి!
సాక్షి, ముంబై: భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8, 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి బుధవారం తెలిపింది.ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో , గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఈరోజు విడుదల చేసింది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్టు వెల్లడించింది. ఈ లోపం కారణంగా వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది. ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత కార్ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది. కాగా గత డిసెంబరులో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా,ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా మోడల్స్ 9,125 యూనిట్లను ఫ్రంట్‌లైన్ సీట్ బెల్ట్‌లలోని లోపాలను సరిచేయడానికి రీకాల్ చేసింది. -
బీఎండబ్ల్యూ కారు ఎయిర్ బ్యాగ్ పేలుడు కలకలం
టకాటా ఫాల్టీ ఎయిర్‌బ్యాగ్ మరోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీసింది. బీఎండబ్ల్యూ కారులో ఎయిర్ బ్యాగ్ అకస్మాత్తుగా పేలడంతో కారు యజమానురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన కలకలం రేపుతోంది. జూన్ 18న ఈ పేలుడు సంభవించింది. సంస్థ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్ పేలుడుతో అడిలైడ్‌కు చెందిన జార్జియా బెక్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్ ఒక్కసారిగా పేలి కారు స్టీరింగ్ నుండి, విండి స్క్రీన్‌లోంచి పై కప్పుకు ఎగిసింది. దీంతో జార్జియా గడ్డంకింద, చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల సంస్థ చేపట్టినభారీ రీకాల్‌లో భాగంగా ప్యాసింజెర్ వైపు ఎయిర్‌బ్యాగ్‌ను రీప్లేస్ చేసినట్టు ఆమె తెలిపారు. అయితే డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగును పెద్దగా పట్టించుకోలేదు. అదే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినపుడు నల్లటి పొగ అలుముకుందని, గన్ పౌడర్ వాసన వచ్చిందంటూ భయంకరమైన తన అనుభవాన్ని జార్జియా బెక్ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీఎండబ్ల్యూఅంతర్జాతీయ దర్యాప్తునకు ఆదేశించింది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎయిర్‌బ్యాగ్‌ను జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి పంపింది. అయితే 2009 లో ప్రమాదానికి గురైన ఈ కారును పాత యజమాని ఆ విషయాన్ని దాచిపెట్టి , జార్జియాకు విక్రయించినట్టుగా సంస్థ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా టకాటా ఎయిర్ బ్యాగు లోపాల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించడంతో హోండా, బీఎండబ్ల్యూ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే లక్షలాది కార్లను రీకాల్ చేశాయి. కానీ, ప్రాణాంతకమైన ఎయిర్‌బ్యాగ్‌లతో 7లక్షల కార్లు ఇప్పటికీ రోడ్లపై ఉన్నట్టు తెలుస్తోంది. -
కొత్త డిజైర్, స్విప్ట్ కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోదిగ్గజం మారుతి సుజుకి దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బాగ్స్‌లో లోపాల కారణంగా కొత్త జనరేషన్ స్విఫ్ట్, డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు మారుతి ఒక ప్రకటన విడుదల చేసింది. మే 7నుంచి జులై 5, 2018 మధ్య ఉత్పత్తి అయిన మొత్తం 1279 కార్లను పరీక్షిస్తున్నట్టు తెలిపింది. 2018, జులై 25నుంచి ఈ రీకాల్ ప్రారంభమవుతుందని ప్రకటించాంది. మారుతి సుజుకి దేశంలో కొత్త తరం స్విఫ్ట్ , డిజైర్ మోడళ్ల కార్లలో లోపాలను తనిఖీ చేయడానికి ఈ రీకాల్ చేపట్టినట్టు కంపెనీ తెలిపింది. 566 స్విఫ్ట్ , 713 డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. సంబంధిత వాహన యజమానులను మారుతి సుజుకి డీలర్లు సంప్రదించనున్నారని తెలిపింది. వారికి ఉచితంగా ఆయా భాగాలను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అలాగే అధికారిక మారుతి సుజుకి వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని కార్ల యజమానులను కంపెనీ కోరింది. -
58 లక్షల టయోటా కార్ల రీకాల్!
కార్లను రీకాల్ చేస్తున్న కంపెనీల జాబితాలోకి టయోటా కూడా చేరింది. జపాన్, యూరప్, చైనాలతో పాటు భారతదేశంలో ఉన్నవాటితో కలిపి మొత్తం 58 లక్షల కార్లను రీకాల్ చేయాలని టయోటా నిర్ణయించింది. వీటన్నింటిలో ఉపయోగించిన టకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లలో లోపం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ కారు ప్రమాదానికి గురై ఒక వ్యక్తి గాయపడినట్లు తెలిసిందని కంపెనీ చెప్పింది. కానీ, ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయం చెప్పలేకపోతున్నారు. ఎయిర్ బ్యాగ్ చిరిగిపోవడం వల్లే ఇలా జరిగిందా అనే విషయాన్ని టయోటా పరిశీలిస్తోంది. అమెరికాలో ఇలాగే ఎయిర్‌బ్యాగ్‌లు బాగోని కార్లను రీకాల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2.31 కోట్ల కార్లను రీకాల్ చేసి, వాటిలో ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను బాగుచేయనున్నట్లు టయోటా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టకాటా ఎయిర్‌బ్యాగ్‌లు బాగోని కార్ల ప్రమాదాల్లో 16 మంది మరణించారు. 17 కార్ల కంపెనీలు అమెరికాలోనే 6.9 కోట్ల కార్లను, ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల కార్లను రీకాల్ చేశారు. తాజాగా హిలక్స్ పికప్, కరొల్లా, ఎటియోస్, యారిస్ కార్లను ఇలా రీకాల్ చేశారు. కరొల్లా, కరొల్లా రన్ఎక్స్, కరొల్లా యాక్సియో, కరొల్లా ఫీల్డర్, కరొల్లా ఎక్స్, బెల్టా.. ఇలా పలు రకాల మోడళ్లలో ఎయిర్ బ్యాగ్ లోపాలున్నట్లు తేలింది. టకాటా ఎయిర్‌బ్యాగ్‌లు ఎక్కువగా ఉపయోగించే కార్ల కంపెనీలలో హోండా, టయోటా, ఫియట్ క్రిస్లర్ తదితరాలున్నాయి. టకాటా ఎయిర్‌బ్యాగ్‌లలో లోపాల కారణంగా వాటిని వాడటం మానేశామని చాలావరకు కార్ల కంపెనీలు చెబుతున్నాయి. రీకాల్ ఖర్చులన్నీ తడిసి మోపెడు కావడంతో టకాటా కంపెనీ దివాలా తీసే ప్రమాదం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు.