Federation of Resident Doctors Association
-
రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే
సాక్షి, ఢిల్లీ/ హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో అల్లోపతి వైద్యం పని చేయడం లేదని.. వైద్యులు విఫలమయ్యారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం నల్ల దినంగా (బ్లాక్ డే) వైద్యులు రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి.. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నె తదితర ప్రాంతాల్లో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోషల్ మీడియాలో కూడా రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. #ArrestRamdev అనే హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ట్విటర్, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి, వైద్యారోగ్య మంత్రులను విజ్ఞప్తులు పంపుతున్నారు. చదవండి: బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు చదవండి: రామ్‌దేవ్ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి -
రాందేవ్ బాబా వ్యాఖ్యలపై 1న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యాన్ని తప్పుపడుతూ యోగా గురు రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై జూన్ ఒకటో తేదీన బ్లాక్‌డేగా పాటించి, నిరసన తెలుపుతామని రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాందేవ్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌వోఆర్‌డీఏ శనివారం ట్విట్టర్లో పేర్కొంది. ఇందుకు నిరసనగా జూన్ 1వ తేదీన బ్లాక్‌డేగా పాటిస్తూ విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలుపుతామని తెలిపింది. ఇప్పటికే ఎఫ్‌వోఆర్‌డీఏ రాందేవ్‌పై రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా కూడా వేసింది. అల్లోపతి వైద్యులు, వైద్యంపై ఇటీవల రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. (చదవండి: రాజాకు సతీవియోగం) -
రెసిడెంట్ డాక్టర్ల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించేందుకు ఆరోగ్య కార్యదర్శి హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఆదివారం తెలిపింది. ‘సమ్మెను మార్చి 15 వరకు వాయిదావేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చే వారంలోగా సెక్యూరిటీని పెంచుతామనే హామీ మాకు లభించింది. అప్పటిలోగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చి 16 నుంచి మళ్లీ సమ్మెకు వెళ్తాం’ అని ఎఫ్ఓఆర్డీఏ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ చెప్పారు. ఎఫ్ఓఆర్డీఏలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు మొత్తం 25 ఉన్నాయి. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణం సెక్యూరిటీని పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 12న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎఫ్ఓఆర్డీ లేఖ రాసింది. ఫిబ్రవరి 28లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని అందులో పేర్కొంది. గతంలో గురు టిగ్ బహదూర్ హాస్పిటల్, సప్దర్ జంగ్ ఆసుపత్రుల్లో రోగుల బంధువులు రెసిడెంట్ డాక్టర్లపై దాడులు చేయడంతో అసోసియేషన్ ఈ లేఖను రాసింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరైన భద్రత చర్యలు లేకపోవడం వల్ల రోగుల డబ్బు దొంగతనానికి గురవుతోందని ఫిర్యాదులో పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత పెంచి రక్షణ కల్పించాలని సింగ్ కోరారు. రోగులు కూడా తమను అర్థం చేసుకుని సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.