న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించేందుకు ఆరోగ్య కార్యదర్శి హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్‌ఓఆర్‌డీఏ) ఆదివారం తెలిపింది. ‘సమ్మెను మార్చి 15 వరకు వాయిదావేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చే వారంలోగా సెక్యూరిటీని పెంచుతామనే హామీ మాకు లభించింది. అప్పటిలోగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే మార్చి 16 నుంచి మళ్లీ సమ్మెకు వెళ్తాం’ అని ఎఫ్‌ఓఆర్‌డీఏ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ చెప్పారు. ఎఫ్‌ఓఆర్‌డీఏలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు మొత్తం 25 ఉన్నాయి.
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణం సెక్యూరిటీని పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 12న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎఫ్‌ఓఆర్‌డీ లేఖ రాసింది. ఫిబ్రవరి 28లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని అందులో పేర్కొంది. గతంలో గురు టిగ్ బహదూర్ హాస్పిటల్, సప్దర్ జంగ్ ఆసుపత్రుల్లో రోగుల బంధువులు రెసిడెంట్ డాక్టర్లపై దాడులు చేయడంతో అసోసియేషన్ ఈ లేఖను రాసింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరైన భద్రత చర్యలు లేకపోవడం వల్ల రోగుల డబ్బు దొంగతనానికి గురవుతోందని ఫిర్యాదులో పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత పెంచి రక్షణ కల్పించాలని సింగ్ కోరారు. రోగులు కూడా తమను అర్థం చేసుకుని సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
రెసిడెంట్ డాక్టర్ల సమ్మె వాయిదా
Published Sun, Mar 1 2015 10:19 PM | Last Updated on Thu, Oct 4 2018 4:56 PM
Advertisement