Film Development Corporation
-
ఏపీఎఫ్డీసీ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లక్ష్మీపార్వతి, చల్లా మధుసూధన్‌రెడ్డి, పైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఈ బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ‘‘11 ఏళ్లుగా నాకు సీఎం జగన్ తెలుసు. జనంలో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఈ పదవితో సినీ పరిశ్రమకు ఎంత మేలు చేస్తానో తెలీదు కానీ.. కీడు మాత్రం చేయను. కచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సేవ చేస్తా’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ఇప్పుడు ఆ బాధ్యత పోసానికి వచ్చింది: పేర్ని నాని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్‌కు పోసాని కృష్ణమురళి ఆత్మీయులు. జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి పోసాని అని అన్నారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. వంద ఎకరాల్లో స్టూడియోలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎఫ్డీసీ ద్వారా నిర్వహించాలని సంకల్పం ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత పోసానికి వచ్చిందని పేర్ని నాని పేర్కొన్నారు. శుభ పరిణామం: నిర్మాత సి.కల్యాణ్ పోసాని ఎఫ్డీసీ ఛైర్మన్ కావడం శుభపరిణామం అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ఆలోచనలు కృష్ణమురళి కచ్చితంగా అమలు చేస్తారు. సినీ ఇండస్ట్రీని విశాఖకు తీసుకెళ్లాలని సి.కల్యాణ్ అన్నారు. చదవండి: 'అలా అయితే.. కె విశ్వనాథ్ సగం హైదరాబాద్ కొనేసేవారు' -
పోసానికి కొత్త బాధ్యతలు
-
ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళీని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
థియేటర్లతో ఎంవోయూ, సీట్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయం దిశగా రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సన్నద్ధమవుతోంది. సినీపరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు హోం శాఖ తాజాగా జీవో జారీచేసింది. దీంతో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కలెక్టర్లకు నిర్దేశించారు. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. కలెక్టర్ల ద్వారా ఎంవోయూ రాష్ట్రంలో ఉన్న 1,140 సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎఫ్డీసీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలి. అందుకోసం ఎంవోయూ కాపీలను ఎఫ్డీసీ జిల్లా కలెక్టర్లకు పంపింది. కలెక్టర్లు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశమై ఎంవోయూపై అవగాహన కల్పిస్తారు. అనంతరం వారం, పదిరోజుల్లో ఎంవోయూ కుదుర్చుకుని ఆ పత్రాలను కలెక్టర్లు ఎఫ్డీసీకి పంపుతారు. ఆన్లైన్లో టికెట్ల విక్రయం కోసం థియేటర్ల వారీగా ఉన్న సీట్లను నిర్ధారిస్తారు. అవకతవకలకు అవకాశం లేకుండా సీట్లను మ్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్లలో ఎన్ని సీట్లు ఉన్నాయన్నది అధికారికంగా గణాంకాలు లేవు. కొన్ని థియేటర్ల యజమానులు సీట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీట్ల సంఖ్యపై స్పష్టత లేకపోతే.. కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయించి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే థియేటర్ల వారీగా సీట్లను ఎఫ్డీసీ మ్యాపింగ్ చేయనుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కల్పించనున్న సర్వీసు ప్రొవైడర్ ఆన్లైన్లో టికెట్ల విక్రయం కోసం పిలిచిన టెండర్లను ఎస్ఆర్ఐటీ–జస్ట్ టికెట్స్ సంస్థ దక్కించుకుంది. టెండర్లు, రివర్స్ టెండర్ల ప్రక్రియ అనంతరం ఆ సంస్థకు టెండరును ఎఫ్డీసీ ఖరారు చేసింది. టికెట్లను నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్లో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ టికెట్ కౌంటర్లలో కూడా ఎఫ్డీసీ పోర్టల్ నుంచే టికెట్లు విక్రయిస్తారు. అందుకోసం సినిమా థియేటర్లకు అవసరమైన హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలను సర్వీసు ప్రొవైడర్‌గా ఎంపికైన సంస్థ కల్పిస్తుంది. ఆన్లైన్లో టికెట్ల విక్రయంపై సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. ఇతర సంస్థల కంటే చాలా తక్కువ సర్వీసు చార్జి ఆన్లైన్లో విక్రయించే సినిమా టికెట్లపై 1.95 శాతం చొప్పున సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 0.95 శాతాన్ని సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మిగిలిన ఒక శాతం ఎఫ్డీసీ ఖాతాలోకి చేరుతుంది. ఆ విధంగా సమకూరే నిధులతో రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎఫ్డీసీ చేపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న వివిధ సంస్థలకంటే చాలా తక్కువ సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. పలు సంస్థలు రాష్ట్రంలో ప్రధాన నగరాలతోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి టికెట్ రేటును బట్టి రూ.12 నుంచి రూ.50 వరకు సర్వీసు చార్జి వసూలు చేస్తుండటం గమనార్హం. ఆ సంస్థలు కూడా టికెట్లను ఎఫ్డీసీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయాలి. ఆ సంస్థలు తాము ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలో 1.95 శాతాన్ని ఎఫ్డీసీకి చెల్లించాలి. ఆ విధంగా కాకుండా నేరుగా ఎఫ్డీసీ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రేక్షకులకు సర్వీసు చార్జి తక్కువగా పడుతుందని ఎఫ్డీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్డీసీ పోర్టల్‌పై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కల్పిస్తామని కూడా తెలిపాయి. -
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రైల్వే టికెట్లు విక్రయించే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తరహాలో ప్రత్యేకంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది. ఆన్లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలను ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆన్లైన్ టికెట్ విక్రయాలు జరపాలని ఏపీ ఫిల్మ్ చాంబర్ కోరడంతో దానిపై ప్రభుత్వం పలుమార్లు చర్చించింది. సినీ నిర్మాతలు, ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇతర సినీ రంగానికి సంబంధించిన వారి అభిప్రాయాలు తీసుకుంది. ఆన్లైన్ టికెట్ విక్రయాలను జరపాలన్న వారి కోరిక మేరకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. అధ్యయనం కోసం తొలుత ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు ఆన్లైన్ టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు బుక్ మై షో వంటి ప్రైవేటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్లైన్ టికెట్ అమ్మకాలు ఇకపై కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ ప్లాట్‌ఫాం(గేట్‌వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది. చదవండి: (భిక్షగాడికి అమరావతి రైతు గెటప్) -
వైఎస్‌గారికి మరణం లేదు
‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిగారు నాకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇస్తానన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక నన్ను ఎఫ్డీసీ చైర్మన్‌గా నియమించి వైఎస్‌గారి మాట నిలబెట్టారు’’ అని నటుడు, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన విజయచందర్ అన్నారు. హైదరా బాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ► 2003లో ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు వైఎస్‌గారిని చూడగానే ‘సార్.. ఈ సారి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. నాకు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వాలని ఉంది? అన్నాను. ఆయన నవ్వి సరే అన్నారు. 2004లో సీఎం అయ్యాక మొదటిసారి నాకు ఇవ్వలేదు. 2009లో 150 సీట్లతో మళ్లీ సీఎంగా గెలిచారు. ఆయన ఆఫీసుకు వెళ్తూ నన్ను చూసి, షేక్ హ్యాండ్ ఇచ్చి, ‘ఎలా చెప్పావయ్యా 150 సీట్లు వస్తాయని?’ అన్నారు. ‘మూడు నెలల్లో నిన్ను ఎఫ్డీసీ చైర్మన్ చేస్తా’ అన్నారు. కుదర్లేదు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌గారి ద్వారా నాకు ఇప్పించారనిపిస్తోంది.. అందుకే ఆయనకు మరణం లేదనే మాట నేడు నిరూపితమైంది. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటారు. ► ‘చెన్నైలో, హైదరాబాద్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా అభివృద్ధి చెందిందో అలా మన రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేద్దాం’ అని జగన్‌గారు నాతో అన్నారు. ► తెలంగాణలో చిత్రరంగాన్ని అభివృద్ధి చేసినట్టు ఏపీలోనూ చేయాలని ఇండస్ట్రీ వారిని కోరుతున్నా. అందుకు కావాల్సిన అంశాలను ఇండస్ట్రీ పెద్దలందర్నీ అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ► తెలుగు రాష్ట్రాల్లోని ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుసుకుంటాను. సురేష్ బాబుగారు ఫోన్ చేశారు. ఏపీలో షూటింగ్‌లకు డైరెక్ట్‌గా ఎఫ్డీసీ నుంచి అనుమతులు లభించేలా చూడాలన్నారు నిర్మాత వివేక్ కూచిభొట్ల. ఆంధ్రప్రదేశ్‌లో కొంత ఫిల్మ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చి అక్కడ స్థిరపడిపోయే వారికి మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం షూటింగ్‌లు మాత్రమే కాకుండా, నిర్మాణ సంస్థలు వారి ఆఫీసులను కూడా పెట్టాలని కోరుతున్నాం. ఏపీఎఫ్డీసీ డైరెక్టర్స్ విభాగంలో తొలి సభ్యుడిగా సుజిత్‌ను ఎంపిక చేసుకున్నాం. ► మన కళామతల్లికి సేవ చేస్తున్న వారందరి ఫొటోలు, వివరాలతో విశాఖపట్నంలో ‘నందనవనం’ పేరుతో మన చరిత్ర చూపించే విధంగా ప్లాన్ చేద్దాం’ అని జగన్‌గారు అన్నారు. అందుకు ఆయనకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్త నిర్మాతలకు, చిన్న నిర్మాతలకు అండగా ఉంటాం. ► తెలుగు రాష్ట్రాల ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుగార్లకు హ్యాట్సాఫ్. -
సీఎం జగన్‌ను కలిసిన విజయ్ చందర్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, నటుడు విజయ్ చందర్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎన్డీసీ చైర్మన్‌గా విజయ్ చందర్ నిన్న (గురువారం) బాధ్యతలు స్వీకరించారు. చదవండి: విజయ్ చందర్‌కు కీలక పదవి -
నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ్ చందర్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విజయ్ చందర్ కరుణామయుడుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే సాయిబాబాగా కూడా ఆయన తన నటనతో మెప్పించారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విజయ్ చందర్‌కు తాత అవుతారు. అధికార భాషా సంఘం సభ్యుల నియామకం అధికార భాషా సంఘం సభ్యులుగా నలుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు. అధికార భాషా సంఘం సభ్యులుగా మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి నియమితులయ్యారు. -
రూమర్స్ నమ్మకండి : మోహన్‌బాబు పీఆర్ టీం
నటుడు, నిర్మాత, శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత డా.మంచు మోహన్‌బాబు ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ తరుపున ప్రచారంలోనూ పాల్గొన్న మోహన్ బాబు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో తన వంతు బాధ్యత నిర్వర్తించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డ దగ్గర నుంచి మోహన్‌బాబుకు కీలక పదవులు ఇస్తున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మోహన్‌బాబును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. తాజాగా మోహన్ బాబును ఎఫ్డీసీ (ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్) చైర్మన్‌గా నియమించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తలను మోహన్‌బాబు పీఆర్ టీం ఖండించారు.ఆ వార్తల్లో నిజం లేదన్న పీఆర్ టీం, ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం అని వెల్లడించారు. -
సినీ కార్మికులకు ఆరోగ్యభీమా కల్పిస్తాం
‘‘నిత్యం పోటీ ఉండే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. కాదంబరి కిరణ్‌తో పాటు ‘మనంసైతం’ బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని తెలిసింది. అలాంటి శాఖల సినీ కార్మికులకు ఎఫ్డీసీ నుంచి సగం ఖర్చు తగ్గిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తాం’’ అని ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మనం సైతం’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ రావు పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘చిత్రపురి కాలనీలో ఓ వైద్యశాల నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ‘మనం సైతం’ కార్యక్రమానికి నేను ఎప్పుడు అందు బాటులోనే ఉంటాను’’ అన్నారు. ‘‘మానవత్వం ఇంకా మిగిలే ఉందని మనం సైతం కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం’’ అని మాజీ మంత్రి లక్షా్మరెడ్డి సతీమణి శ్వేతా లక్షా్మరెడ్డి అన్నారు. ‘‘నేను ఎదుర్కొన్న బాధలు, కోపం, కసి, ప్రతీకారం, ఆవేదనల నుంచి మొదలైనదే ఈ మనం సైతం కార్యక్రమం. ఏడుగురు సభ్యులతో మొదలైన మా బృందంలో ఇప్పుడు దాదాపు లక్షా డెబ్భై వేలమంది ఉన్నారు’’ అన్నారు కాదంబరి కిరణ్. దర్శకుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సినిమా షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితం’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ అంబికా కృష్ణ పలు రాయితీలను ప్రకటించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు నగదు, పన్ను రాయితీలు కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. 4 కోట్ల రూపాయలలోపు రూపొందే సినిమాలను ప్రభుత్వం చిన్న సినిమాలుగా గుర్తించి, ఆ సినిమాలకు పన్ను మొత్తం వెనక్కి ఇవ్వనుందని.. 18 శాతం జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతం రద్దు చేసి తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. చిన్న సినిమాలకు పన్ను రాయితీలతో పాటు షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితంగా ఇవ్వటం, ఎఫ్డీసీ ద్వారా సింగల్ విండోలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. షూటింగ్‌ల కోసం సెక్యురిటి డిపాజిట్ మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఆ డబ్బును కూడా షూటింగ్ పూర్తయిన తరువాత వెనక్కి తిరిగిచ్చేస్తామన్నారు. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన డబ్బింగ్, రీరికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా ఏపీలోనే చేయాలన్నారు. రాయితీలతో పాటు చిన్న సినిమాల్లో ఉత్తమ కథాంశాలు, విలువలు ఉన్న 15 చిత్రాలకు 10 లక్షల నజరానా ప్రభుత్వం నుంచి అందిచనున్నట్టుగా తెలిపారు. పరభాషా చిత్రాలు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటంతో ధియేటర్ల సమస్య తలెత్తుందని, పైరసీ వల్ల సినీరంగం తీవ్రంగా నష్టపోతుందని అలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటుగా తెలిపారు. -
అటు వినోదం.. ఇటు ఆదాయం
మంచిర్యాల అర్బన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిక్కెట్టేతర ఆదాయంపై దృషి సారించింది. నష్టాల బాటపట్టిన ఆర్టీసీని లాభాల్లోకి నడిపించేందుకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాణ ప్రాంగణాల్లో మల్టీ, మినీప్లెక్స్ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు వినోదాన్ని పంచడంతో పాటు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ)తో ఒప్పందం చేసుకుంది. ఆయా బస్స్టేషన్లలో ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణాన్ని బట్టి ఒకటి నుంచి రెండు వరకు మినీప్లెక్స్‌లు (చిన్న థియేటర్లు) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వంద థియేటర్లను నిర్మించాలనే సంకల్పంతో టీఎస్ఎఫ్డీసీ ముందుకు సాగుతోంది. ఇందుకుగాను ఆయా బస్స్టేషన్లలో స్థలాలను గుర్తించే పనిలో టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, ఇతర అధికారులు నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా ఆసిఫాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ బస్స్టేషన్లను వారు పరిశీలించారు. అనువైన స్థలాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ థియేటర్ నిర్మిస్తే ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందో బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల పరిశీ లన తర్వాత ఆర్టీసీతో స్థలాలు లీజుకు తీసుకోవడమా.. లేక పర్సంటేజీ పద్ధతిలో ఒప్పందం చేసుకోవడమా అనేది తేలనుంది. «థియేటర్ల ఏర్పాటు వల్ల ప్రయాణికులు గంటల కొద్ది బస్సుల కోసం వేచిచూడకుండా కాలక్షేపంతో ఊరట పొందవచ్చు. ఈ విషయంపై టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్రావు సాక్షితో మాట్లాడుతూ ఇప్పటికే పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని బస్స్టేషన్లలో స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. థియేటర్లు లేని ప్రాంతాలతో పాటు అన్ని బస్స్టేషన్లలో స్థలాలను పరిశీలించి చిన్న థియేటర్లు నిర్మించనున్నామని పేర్కొన్నారు. -
మినీ థియేటర్స్ కోసం
రానున్న రోజుల్లో బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్ ప్రత్యక్షం కానున్నాయి. దాని కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అధ్యక్షుడు పి. రామ్మోహనరావులు పలువురు అధికారులతో చర్చించి, తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టీసీ బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు బస్టాండ్స్‌లో, వాటికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో 80 నుంచి 100 మినీ థియేటర్ల ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణతోనూ రామ్మోహన్ రావు చర్చించారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా టెండర్లను ఆహ్వానించినా సరైన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మినీ థియేటర్ల ఏర్పాటుకు తగిన అనుమతులు తీసుకోవాలనుకుంటున్నాం’’ అని రామ్మోహనరావు అన్నారు. -
విశాఖలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు విశాఖలో ఫిలిం డెవలెప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన 28 రాష్ట్రాల సమాచార శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌కు పరిమితమైన చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించడానికి విశాఖలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంపై చిత్ర పరిశ్రమ వర్గాలతో చర్చలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. విశాఖలో ఫిలిం, టెలివిజన్ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార శాఖ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. పథకాల ప్రచారానికి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌తోపాటు ఇతర అన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నామని పల్లె తెలిపారు.