
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రైల్వే టికెట్లు విక్రయించే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తరహాలో ప్రత్యేకంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల బాధ్యతలను ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆన్‌లైన్ టికెట్ విక్రయాలు జరపాలని ఏపీ ఫిల్మ్ చాంబర్ కోరడంతో దానిపై ప్రభుత్వం పలుమార్లు చర్చించింది. సినీ నిర్మాతలు, ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇతర సినీ రంగానికి సంబంధించిన వారి అభిప్రాయాలు తీసుకుంది.
ఆన్‌లైన్ టికెట్ విక్రయాలను జరపాలన్న వారి కోరిక మేరకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. అధ్యయనం కోసం తొలుత ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు బుక్ మై షో వంటి ప్రైవేటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్‌లైన్ టికెట్ అమ్మకాలు ఇకపై కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం(గేట్‌వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్ పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది.