సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం దిశగా రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) సన్నద్ధమవుతోంది. సినీపరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
ఈ మేరకు హోం శాఖ తాజాగా జీవో జారీచేసింది. దీంతో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కలెక్టర్లకు నిర్దేశించారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు.
కలెక్టర్ల ద్వారా ఎంవోయూ
రాష్ట్రంలో ఉన్న 1,140 సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎఫ్‌డీసీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలి. అందుకోసం ఎంవోయూ కాపీలను ఎఫ్‌డీసీ జిల్లా కలెక్టర్లకు పంపింది. కలెక్టర్లు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశమై ఎంవోయూపై అవగాహన కల్పిస్తారు. అనంతరం వారం, పదిరోజుల్లో ఎంవోయూ కుదుర్చుకుని ఆ పత్రాలను కలెక్టర్లు ఎఫ్‌డీసీకి పంపుతారు.
ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం కోసం థియేటర్ల వారీగా ఉన్న సీట్లను నిర్ధారిస్తారు. అవకతవకలకు అవకాశం లేకుండా సీట్లను మ్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో థియేటర్లలో ఎన్ని సీట్లు ఉన్నాయన్నది అధికారికంగా గణాంకాలు లేవు. కొన్ని థియేటర్ల యజమానులు సీట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు.
ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత కూడా సీట్ల సంఖ్యపై స్పష్టత లేకపోతే.. కొన్ని టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయించి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే థియేటర్ల వారీగా సీట్లను ఎఫ్‌డీసీ మ్యాపింగ్ చేయనుంది.
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కల్పించనున్న సర్వీసు ప్రొవైడర్
ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం కోసం పిలిచిన టెండర్లను ఎస్‌ఆర్‌ఐటీ–జస్ట్ టికెట్స్ సంస్థ దక్కించుకుంది. టెండర్లు, రివర్స్ టెండర్ల ప్రక్రియ అనంతరం ఆ సంస్థకు టెండరును ఎఫ్‌డీసీ ఖరారు చేసింది. టికెట్లను నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ టికెట్ కౌంటర్లలో కూడా ఎఫ్‌డీసీ పోర్టల్ నుంచే టికెట్లు విక్రయిస్తారు. అందుకోసం సినిమా థియేటర్లకు అవసరమైన హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఇతర మౌలిక సదుపాయాలను సర్వీసు ప్రొవైడర్‌గా ఎంపికైన సంస్థ కల్పిస్తుంది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయంపై సిబ్బందికి శిక్షణ ఇస్తుంది.
ఇతర సంస్థల కంటే చాలా తక్కువ సర్వీసు చార్జి
ఆన్‌లైన్‌లో విక్రయించే సినిమా టికెట్లపై 1.95 శాతం చొప్పున సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 0.95 శాతాన్ని సర్వీస్ ప్రొవైడర్‌కు చెల్లిస్తారు. మిగిలిన ఒక శాతం ఎఫ్‌డీసీ ఖాతాలోకి చేరుతుంది. ఆ విధంగా సమకూరే నిధులతో రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎఫ్‌డీసీ చేపడుతుంది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న వివిధ సంస్థలకంటే చాలా తక్కువ సర్వీసు చార్జీని ప్రభుత్వం నిర్ణయించింది. పలు సంస్థలు రాష్ట్రంలో ప్రధాన నగరాలతోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి టికెట్ రేటును బట్టి రూ.12 నుంచి రూ.50 వరకు సర్వీసు చార్జి వసూలు చేస్తుండటం గమనార్హం.
ఆ సంస్థలు కూడా టికెట్లను ఎఫ్‌డీసీ పోర్టల్ నుంచే కొనుగోలు చేయాలి. ఆ సంస్థలు తాము ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలో 1.95 శాతాన్ని ఎఫ్‌డీసీకి చెల్లించాలి. ఆ విధంగా కాకుండా నేరుగా ఎఫ్‌డీసీ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రేక్షకులకు సర్వీసు చార్జి తక్కువగా పడుతుందని ఎఫ్‌డీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్‌డీసీ పోర్టల్‌పై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కల్పిస్తామని కూడా తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment