Former President of the United States
-
గట్టెక్కిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ సెనేట్‌లో శనివారం జరిగిన ఓటింగ్‌లో 57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన ఘటనలో ట్రంప్‌ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు. గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్ ఒక్కరే. అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్‌లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్‌లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్‌లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్‌పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్‌లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్‌పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది. ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది సెనేట్‌లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్‌గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారు ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్‌ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే బీటలు అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్‌కి విముక్తి లభించిన వెంటనే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. -
ట్రంప్ అభిశంసన రాజ్యాంగ విరుద్ధం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానాన్ని తీసుకురావడంపై డెమొక్రాట్లపై పలువురు రిపబ్లికన్ సెనేటర్లు విరుచుకుపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమంటూ 45 మంది సెనేటర్లు తేల్చిచెప్పారు. ట్రంప్ అనునూయులు హింసకు, హేట్ స్పీచ్‌కు పాల్పడ్డారని, ఇందుకు ట్రంపే కారణమని డెమొక్రాట్లు చెప్పడాన్ని దుయ్యబట్టారు. నిజానికి పలుమార్లు డెమొక్రాట్లే నిజమైన విద్వేష ప్రసంగాలివ్వడం, హింసను రెచ్చగొట్టడం చేశారని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ విమర్శించారు. ట్రంప్‌పై తీర్మానం మతిమాలిన చర్య అని మార్క్ రూబియో, లిండ్సే గ్రాహం, టెడ్ క్రూజ్ అన్నారు. అంతకుముందు ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్ సెనేటర్లు ఓటు వేశారు. ఐదుగురు అటువైపే అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేశారు. మిట్ రోమ్నీ, బెన్సాసే, సుసాన్ కోలిన్స్, లీసా ముర్కోవిస్కీ, పాట్ టూమీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానానికి 55 అనుకూల ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ను అభిశంసించాలంటే సెనేట్‌లో మూడింట్ రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే డెమొక్రాట్లకు 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. ఇలాంటి తీర్మానాలు అమెరికా ప్రతిష్టను భంగపరుస్తాయని రిపబ్లికన్ సెనేటర్లు వ్యాఖ్యానించారు. అభిశంసనంటే పదవి నుంచి దింపడమని, ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారని ప్రశ్నించారు. ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంటని సెనేటర్ రూబియో కొట్టిపారేశారు. కావాలంటే ట్రంప్‌ను ఒక పౌరుడిగా కోర్టుల ద్వారా ప్రాసిక్యూట్ చేయవచ్చని, అభిశంసన కుదరదని చెప్పారు. ట్రంప్ అభిశంసన అగ్గి రాజేయడమవుతుందని హెచ్చరించారు. ట్రయల్ కొనసాగుతుంది సెనేట్‌లో సాధారణ మెజార్టీ లభించినందున ట్రంప్‌పై అభిశంసన ట్రయల్ య«థాతథంగా కొనసాగనుంది. ఫిబ్రవరి 9న ట్రయల్ జరగనుంది. అప్పటివరకు ఇరుపక్షాలు తమ వాదనలు బలోపేతం చేసుకునే యత్నాలు చేస్తాయి. అయితే ట్రయల్ అనంతరం తీర్మానానికి రెండు సభల ఆమోదం అవసరం. డెమొక్రాట్ల అధీనంలోని హౌస్‌లో తీర్మానానికి ఆమోదం లభించినా సెనేట్‌లో మాత్రం ఆమోదం లభించదని తాజా ఓటింగ్‌తో తేలింది. అందువల్ల ట్రంప్‌పై అభిశంసన జరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
తాత అయ్యారుగా.. కంగ్రాట్స్!
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకునేందుకు న్యూయార్క్ పాలెస్ హోటల్‌కు వచ్చారు. వారికి మోదీ, భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ సాదరంగా స్వాగతం పలికారు. సుష్మా, హిల్లరీలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యలైనందుకు క్లింటన్ జంటను మోదీ, సుష్మాలు అభినందించారు. అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు వారు సమావేశమై, భారత్, యూఎస్ సంబంధాలపై చర్చించారు. ‘ఆర్థికరంగ అభివృద్ధికి సంబంధించి మీ కున్న పరిజ్ఞానం ముందు ఎవరైనా దిగదుడుపే’ అని మోదీని బిల్ క్లింటన్ ప్రశంసించారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అలాగే, గంగానది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడాన్ని కూడా క్లింటన్ ప్రశంసించారని తెలిపారు. ‘అది పవిత్రమైన కార్యక్రమం. మీ ఈ చర్య ఆసియాలోని ఇతర దేశాలకు ఒక స్ఫూర్తినిస్తుంది’ అని క్లింటన్ అన్నారని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. బిల్, హిల్లరీల కూతురు చెల్సియా గతవారం పాప చార్లట్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్ పోటీపడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ జరగడం విశేషం.