విహారంలో విషాదం..
సాక్షి, మలాపురం: విహారంలో విషాదం చోటు చేసుకుంది.నీటిలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.బక్రీద్ పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. సంతోషంగా విహారం చేద్దామని ఇంటినుంచి బయలుదేరిన 2 గంటల్లోనే ఈ విషాదం చోటుకుంది.ఈ సంఘటనలో షేక్ జాఫర్ హుసేన్ (42) మృతి చెందగా, ఇర్ఫాన్(12), జాకీర్(12), షాహిద్(10) గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన జాఫర్ హుసేన్, సాదకున్ దంపతులు, అదే వీధికి చెందిన హసీన తన ముగ్గురు పిల్లలతో సమీపంలోని పెన్నా నది వద్దకు వన భోజనానికి వెళ్లారు.
ఇంటి పక్కనే ఉన్న మరో ఇద్దరు చిన్నారులు జాకీర్, షాహిద్ వస్తామంటే వారిని కూడా పిలుచుకుని పోయారు. బక్రీద్ పండుగ జరిగిన నేపథ్యంలో వారు వనభోజనానికి వెళ్లారు. భోజనం అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాఫర్ హుసేన్ ఈత కొట్టేందుకు నదిలో దిగారు. చిన్నారులు కూడా ఏటి గడ్డన ఉన్న తక్కువ నీటిలో ఆడుకుంటున్నారు. అరగంట తర్వాత జాఫర్ హుసేన్ ఏటీ మధ్యలోకి వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయారు. ఈ సంఘటన చూసిన చిన్నారులు మామా.. మామా.. అంటూ కేకలు వేస్తూ నది నీటి ప్రవాహం గురించి తెలియక జాఫర్ వైపునకు వెళ్లారు. వారు కూడా జాఫర్ లాగే నీటిలో కొట్టుకొని పోయారు. అయితే జాఫర్ లుంగీ తగులుకొని కంపచెట్లకు ఆనుకున్నారు.
ఈ విషయం చూసిన అక్కడ ఉన్న వారు జాఫర్‌ను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అతను అప్పటికే మృతి చెందారు. ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుడి భార్య జాఫర్ మృతదేహంపై పడి భోరున విలపించింది. మృతునికి ఇద్దరు కుమారులున్నారు. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో కమలాపురం పట్టణంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు నదిలోకి చేరుకున్నారు. చిన్నారుల జాడ కోసం వెతికారు. కానీ ప్రయోజనం లేక పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రగుంట్ల రూరల్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది.
గల్లంతైన చిన్నారులందరూ రెండో సంతానమే:
గల్లంతైన ముగ్గురు చిన్నారులు వారి తల్లిదండ్రులకు రెండో సంతానమే. మాబుఖాన్, హుసేన్ బీల కు ఒక కుమార్తె, ఒక కుమారుడు. జాకీర్ రెండో సంతానం. ఉన్న ఒక్క కుమారుడు గల్లంతు కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. హసీనా, హైదర్‌లకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు కాగా, ఇర్ఫాన్ రెండో సంతానం. ఖాదరు, సాబీరున్లకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఉండగా షాహిద్ కూడా రెండో సంతానమే.
ఎమ్మెల్యే పరామర్శ
పెన్నా నదిలో ప్రవాహానికి కొట్టుకొని పోయి మృతి చెందిన జాఫర్ హుసేన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఇలా జరగడం దారుణం అన్నారు. చిన్నారుల గాలింపు చర్యల కోసం పోలీస్ శాఖ, రెవెన్యూ, ఫైర్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. చిన్నారుల ఆచూకీ త్వరలోనే లభిస్తుందన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
కళ్ల ముందే కొట్టుకొని పోయాడు
నా కొడుకు ఇర్ఫాన్ కళ్ల ముందే కొట్టుకొని పోయాడు. అది చూసి ముగ్గురు పిల్లలు ఆ వైపే వెళ్లారు. వెళ్ల వద్దు.. అని మొత్తుకున్నా వినలేదు.. ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో.. –హసీనా, ఇర్ఫాన్ తల్లి.
గారాభంగా పెంచుకున్నాం
అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టడంతో గారాభంగా పెంచుకున్నా. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నదివద్దకు వెళ్లకున్నా బాగుండేదని విలపించారు. –మాబుఖాన్, జాకీర్ తండ్రి
నా కొడుకు వస్తాడు:
నా తమ్ముడు జాఫర్ చనిపోయాడని తెలిస్తే నదివద్దకు వెళ్లాను. అక్కడికి పోయాక తెలిసింది తన కుమారుడు షాహిద్ కూడా గల్లంతైన వారిలో ఉన్నాడని. నా కొడుకు వస్తాడు అనే నమ్మకం ఉంది. –ఖాదరు, షాహిద్ తండ్రి
అనవసరంగా వెళ్లాం
అనవసరంగా వన భోజనానికి వెళ్లాం. అలా వెళ్లక పోయి ఉంటే బాగుందేది. నా కళ్ల ముందే నా భర్త నీళ్లలో కొట్టుకొని పోయారు. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. –సాదకున్, జాఫర్ హుసేన్ భార్యఉదయం
6 గంటలకే గాలింపు చేపడతాం:
దాదాపు మూడు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టాం. చీకటి పడటంతో ఆటంకం కలిగింది. ఫైర్ సిబ్బందికి తెప్పలు వచ్చాయి. ఉదయం 6గంటలకే గాలింపు చర్యలు ప్రారంభిస్తాం. గజ ఈత గాళ్లును సిద్ధం చేశాం. చిన్నారుల ఆచూకీ లభ్యం అయ్యే వరకు గాలింపు చర్యలు చేపడతాం. –టీవీ కొండారెడ్డి సీఐ.