fuel sector
-
పెరుగుతున్న భారత్ చమురు డిమాండ్
బెతుల్ (గోవా): ప్రపంచ చమురు డిమాండ్‌లో చైనాను భారత్ 2027లో అధిగమిస్తుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) బుధవారం పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో రవాణా, పరిశ్రమల వినియోగం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ చమురు డిమాండ్ విషయంలో చైనాను భారత్ వెనక్కునెట్టనుందని అభిప్రాయపడింది. క్లీన్ ఎనర్జీ, విద్యుదీకరణ వంటి రంగాల పురోగతికి దేశం ప్రణాళికలు వేస్తున్నప్పటికీ చమురు డిమాండ్ కొనసాగుతుందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఈఏ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ను పురస్కరించుకుని ‘ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్‌లుక్ 2030’ అనే పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే... ► దేశం చమురు డిమాండ్ 2023లో రోజుకు 5.48 మిలియన్ బ్యారెళ్లు (బీపీడీ). 2030 నాటికి ఈ పరిమాణం 6.64 మిలియన్ బీపీడీకి పెరుగుతుంది. చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశీయ వినియోగం రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ (బీపీడీ). ఐఈఏ నివేదికలో అంకెలు చూస్తే, దేశీయంగా అలాగే ఎగుమతుల కోసం జరుగుతున్న ఇంధన ప్రాసెస్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ► గ్రీన్ ఎనర్జీ విషయంలో పురోగతి ఉన్నప్పటికీ 2030 నాటికి భారత్ చమురు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ► ప్రపంచ చమురు డిమాండ్‌లో భారత్‌లో వృద్ధి 2027లో చైనాను అధిగమిస్తుంది కానీ, దేశీయంగా చూస్తే, భారతదేశంలో డిమాండ్ 2030లో కూడా చైనా కంటే వెనుకబడి ఉంటుంది. ► ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది. దేశం తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటోంది. దేశీయ ఉత్పత్తి పడిపోవడంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ► భారీ చమురు క్షేత్రాలు కనుగొనలేకపోవడం వల్ల 2030 నాటికి దేశీయ ఉత్పత్తి 540,000 బీపీడీకి పడిపోతుంది. 2023లో దిగుమతులు 4.6 మిలియన్ బీపీడీలు ఉండగా, 2030 నాటికి 5.8 మిలియన్ బీపీడీలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ► భారతదేశం 66 రోజుల అవసరాలను తీర్చడానికి సమానమైన చమురు నిల్వలను కలిగి ఉంది. ఇందులో 7 రోజుల అవసరాలు భూగర్భ వ్యూహాత్మక నిల్వలలో నిల్వ ఉన్నాయి. మిగిలినవి రిఫైనరీలు మరియు ఇతర ప్రదేశాలలో డిపోలు– ట్యాంకులలో నిల్వలో ఉన్నాయి. భారత్ కాకుండా ఐఈఏ ఇతర సభ్య దేశాలు తమ డిమాండ్‌లో 90 రోజులకు సమానమైన నిల్వను నిర్వహిస్తున్నాయి. -
జూన్‌లో ఇంధన అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: పంటల సీజన్, ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన విక్రయాలు పెరుగుతున్నాయి. జూన్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం.. పంటల సీజన్ ప్రారంభ దశ కావడంతో డీజిల్ విక్రయాలు కరోనా ముందు స్థాయికి ఎగిశాయి. రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేశాయి. జూన్‌లో డీజిల్ అమ్మకాలు (2021 జూన్‌తో పోలిస్తే) 35.2 శాతం పెరిగి, 7.38 మిలియన్ టన్నులకు చేరాయి. 2019 జూన్‌తో (కరోనా పూర్వం) పోలిస్తే ఇది 10.5 శాతం, 2020 జూన్‌తో పోలిస్తే 33.3 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది మేలో నమోదైన 6.7 మిలియన్ టన్నులతో పోలిస్తే 11.5 శాతం అధికం. వ్యవసాయం, రవాణా రంగాల్లో వినియోగం పెరగడం వల్ల డీజిల్‌కు డిమాండ్ ఎగిసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ రిటైల్ సంస్థల్లో పెట్రోల్ విక్రయాలు జూన్‌లో 29 శాతం పెరిగి 2.8 మిలియన్ టన్నులకు చేరాయి. 2020 జూన్‌తో పోలిస్తే ఇది 36.7 శాతం, 2019 అదే నెలతో పోలిస్తే 16.5 శాతం అధికం. నెలవారీగా చూస్తే 3.1 శాతం ఎక్కువ. గతేడాది ఇదే వ్యవధిలో బేస్ తక్కువగా నమోదు కావడం కూడా జూన్‌లో గణాంకాలు మెరుగ్గా ఉండటానికి కారణమని పరిశ్రమ వర్గాలు వివరించాయి. అటు, గత నెల వంట గ్యాస్ అమ్మకాలు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరాయి. విమానయాన రంగం రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు రెట్టింపై 5,35,900 టన్నులుగా నమోదయ్యాయి. విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో సుంకాల నష్టం దాదాపు భర్తీ .. దేశీయంగా ఉత్పత్తయ్యే, విదేశాలకు ఎగుమతి చేసే చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే దఖలు పడనుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు వల్ల వాటిల్లే సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాన్ని నాలుగింట మూడొంతుల మేర ప్రభుత్వం భర్తీ చేసుకోనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు దాకా కొనసాగించిన పక్షంలో ఖజానాకు కనీసం రూ. 72,000 కోట్ల మేర ఆదాయం రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మే నెలలో పెరిగిన ఇంధన వినియోగం!
న్యూఢిల్లీ: ఇంధన అమ్మకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే నెలలో జోరుగా సాగాయి. 90 శాతం మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు గత నెలలో 28 లక్షల టన్నుల పెట్రోల్ విక్రయించాయి. 2021 మే నెలతో పోలిస్తే ఇది 55.7 శాతం అధికం. 2020 సంవత్సరం అదే నెలతో పోలిస్తే 76 శాతం ఎక్కువ. నెలవారీ వృద్ధి 8.2 శాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 39.4 శాతం అధికమై 68.2 లక్షల టన్నులకు ఎగసింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 1.8 శాతం ఎక్కువ. గత నెలలో అధిక ధరల తర్వాత డిమాండ్ తిరిగి రావడం వల్ల అమ్మకాలపై సానుకూల ప్రభావంతో ఇంధన వినియోగం ఎక్కువైంది. పంట కోత సీజన్ ప్రారంభం కావడం కూడా డిమాండ్‌కు తోడ్పడింది. వేసవి నుంచి ఉపశమనానికి శీతల ప్రాంతాలకు యాత్రలు పెరిగాయి. ఇక వంట గ్యాస్ అమ్మకాలు 1.48 శాతం అధికమై 21.9 లక్షల టన్నులకు చేరుకుంది. 2020 మే నెలతో పోలిస్తే ఇది 4.8 శాతం తక్కువ. 2022 మార్చి నుంచి ఒక్కో సిలిండర్ ధర రూ.103.5 పెరిగింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగం రెండింతలకుపైగా పెరిగి 5,40,200 టన్నులు గా ఉంది. నెలవారీ వృద్ధి 7.5% నమోదైంది. -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు నితిన్ గడ్కరీ శుభవార్త!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర రవాణా, రహదారుల వ్యవహారాల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో పరిస్థితి మారుతుందని చెప్పారు. రాజ్యసభలో ఆయన ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని పరిశీలిస్తే.. పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండగా.. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే ప్రత్యామ్నాయ ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఎలాంటి లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకో లేదు. ఈ కొనుగోళ్లు వినియోగదారుల సహజ ఎం పికగా ఉండేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంకానీ, లక్ష్యాల మేరకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని భావించడం తగదు. ఎలక్ట్రిక్ వెహికిల్, పెట్రోల్ కారు ధర ఒకేవిధంగా రూ.15 లక్షల వద్ద ఉంటే.. ఇదే సమయంలో ఇంధనం ధర రూ. 50,000 (పెట్రోల్), రూ. 2,000 (ఈవీ కోసం) ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఎకానమీగా ఎలక్ట్రిక్ వెహికిల్‌నే ఎంచుకుంటాడు. ‘ఛార్జింగ్’ సమస్యలు లేవు... ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత సమస్య తీవ్రంగా ఉందన్న ఆరోపణలు తప్పు. అన్ని కార్యాలయాలతో సహా ప్రతిచోటా ఈవీ ఛార్జింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే రోజు త్వరలోనే రానుంది. జాతీయ రహదారుల సంస్థ 650 ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తోంది. హైవేలపై ప్రతి 40 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇక స్కూటర్, కార్ల తయారీ సంస్థలు చిన్న ఛార్జర్లను అందిస్తున్నాయి. రోజంతా కారును ఉపయోగించవచ్చు. సాయంత్రం ఇంట్లో చార్జింగ్కు ప్లగ్ చేసుకోవచ్చు. ఇది రాత్రిపూట ఛార్జ్ అవుతుంది. ఉదయం ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఇప్పుడు ప్రధాన సమస్యంతా బ్యాటరీ వ్యయం తీవ్రంగా ఉండడమే. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ వనరు పెద్ద సవాలు. మన దగ్గర లిథియం అయాన్ లేదు. దాదాపు 81శాతం బ్యాటరీలను మేం ఇక్కడ భారతదేశంలోనే తయారు చేస్తున్నాం. ప్రపంచంలో లిథియం అయాన్ అందుబాటులో ఉంది. దీనిని దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వం కొన్ని గనులను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉంది. ప్రస్తుతం భారత్‌కు ముడి చమురు దిగుమతుల విలువ రూ.8 లక్షల కోట్లుగా ఉంది. ఇది ఐదేళ్లలో రూ.25 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. దేశం, ఆర్థిక వ్యవస్థ, జీవావరణం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధనం, విద్యుత్, ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్జీ, గ్రీన్ హైడ్రోజన్ల వైపునకు వ్యవస్థ మారాల్సిన సమయం ఇది. మనం అదే బాటలో ఉన్నాం. -
పెట్రోల్ డిమాండ్ తగ్గేదేలే!
న్యూఢిల్లీ: కోవిడ్–19పరమైన ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ, ప్రస్తుత త్రైమాసికంలో దేశీయంగా ఇంధనానికి డిమాండ్ మెరుగుపడటం కొనసాగనుంది. అయితే, కొంగొత్త వేరియంట్లతో కేసులు పెరగడం, తత్ఫలితంగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాల వల్ల ఆర్థిక వ్యవస్థ, ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడే రిస్కులు కూడా పొంచి ఉన్నాయి. ఒక నివేదికలో ఫిచ్ రేటింగ్స్ ఈ అంశాలు వెల్లడించింది. ఇంధనానికి డిమాండ్, తద్వారా ధరల పెరుగుదలతో చమురు, గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. క్యూ 4లో ‘‘జనవరి–మార్చి త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మాత్రం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2–4 శాతం తక్కువగానే ఉండవచ్చు’’ అని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఫిచ్ నివేదిక ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ 5 శాతం మేర పెరిగింది. అయితే, నెలవారీ సగటు మాత్రం కోవిడ్ పూర్వ స్థాయికన్నా 8–10 శాతం తక్కువగా సుమారు 16.4 మిలియన్ టన్నుల స్థాయిలో నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహమ్మారి కట్టడికి సం బంధించిన ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. ‘‘ కోవిడ్–19 కేసుల ఉధృతి, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలపై ప్రభావాల రిస్కులకు లోబడి నాలుగో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు సంబంధించిన రికవరీ కొనసాగవచ్చు’’ అని ఫిచ్ తెలిపింది. మరింతగా ఓఎంసీల పెట్టుబడులు.. రిఫైనింగ్ సామర్థ్యాలు, రిటైల్ నెట్‌వర్క్‌లను పెంచుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందు కు తయారీ కంపెనీలు.. మరింతగా ఇన్వెస్ట్ చేయ డం కొనసాగించనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ‘‘క్రూడాయిల్ ఉత్పత్తి స్థిరంగా కొనసాగవచ్చు. అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలపై ఉత్పత్తి కంపెనీలు మరింతగా పెట్టుబడులు కొనసాగించడం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక మోస్తరుగా పెరగవచ్చు. దేశీయంగా ఉత్పత్తి పెర గడం, స్పాట్ ధరల్లో పెరుగుదల తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులపై ప్రభావం చూపవచ్చు. అయితే, వినియోగం పుంజు కునే కొద్దీ మధ్యకాలికంగా చూస్తే ఎల్ఎన్జీ దిగుమతులు క్రమంగా పెరగవచ్చు’’ అని ఫిచ్ తన నివేదికలో పేర్కొంది. మెరుగుపడనున్న రిఫైనింగ్ మార్జిన్లు .. ఎకానమీ రికవరీ క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే కొద్దీ కీలకమైన చమురు రిఫైనింగ్ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (అక్టోబర్ 2021–మార్చి 2022) మెరుగుపడనున్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. డిమాండ్, ఉత్పత్తి ధర–విక్రయ ధర మధ్య వ్యత్యాసం, తక్కువ రేటుకు కొని పెట్టుకున్న నిల్వల ఊతంతో ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్ 2021) ప్రభుత్వ రంగ ఓఎంసీలు మెరుగైన మార్జిన్లు నమోదు చేశాయి. ఒక్కో బ్యారెల్‌పై బీపీసీఎల్ 5.1 డాలర్లు, ఐవోసీ 6.6 డాలర్లు, హెచ్‌పీసీఎల్ 2.9 డాలర్ల స్థాయికి మార్జిన్లు మెరుగుపర్చుకున్నాయి. క్రూడాయిల్ అధిక ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కొనసాగించడం ద్వారా ద్వితీయార్ధంలో కూడా ఓఎంసీలు స్థిరంగా మార్కెటింగ్ మార్జిన్లను నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. -
ధరాఘాతం నుంచి ఊరట.. అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు మరో శుభవార్త ! వరుసగా రెండో నెల కూడా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) తగ్గింది. ద్రవ్యల్బణానికి ముఖ్యమైన సూచీల్లో ఒకటిగా చెప్పుకునే డబ్ల్యూపీఐ తగ్గనుండటంతో క్రమంగా ధరలు దిగివస్తాయనే ఆశలు కలుగుతున్నాయి. 2021 జులైకి సంబంధించి డబ్ల్యూపీఐ 11.12 శాతంగా నమోదు అయ్యింది. గతేడాది ఇదే నెలకు సంబంధఙంచి డబ్ల్యూపీఐ 12.07 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్రం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ వివరాలు వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే ఒక శాతం పెరగాల్సి ఉండగా తగ్గింది. ఇక ఆహర ధాన్యాలకు సంబంధించి గతేడాది 6.66 శాతం ఉండగా ఈసారి అది 4.46 శాతానికి పడిపోయింది. ఫ్యూయల్, పవర్ సెక్డార్లో 32.85 శాతం నుంచి 2602 శాతానికి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. -
మార్కెట్లోకి కొత్త బంకులు.... పెట్రోలు ధర తగ్గేనా ?
న్యూఢిల్లీ: ఆటో ప్యూయల్ మార్కెట్లో కొత్త పోటీకి కేంద్రం తెర లేపింది. ఇప్పటి వరకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ కంపెనీలకు పోటీగా మరి కొన్ని సంస్థలను మార్కెట్లోకి ఆహ్వానించింది. కొత్త ప్లేయర్లు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు కంపెనీలకు అనుమతులు జారీ చేసింది కేంద్రం. 2019లో మార్కెట్ ఫ్యూయల్ ట్రాన్స్‌పోర్టేషన్ నిబంధనలకు సంబంధించిన నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. అనుమతి పొందినవి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్, ఇథనాల్ వంటి ఆటో ఫ్యూయల్స్ అమ్మేందుకు కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియన్ మోలాసిస్ కంపెనీ (చెన్నై బేస్డ్), అస్సాం గ్యాస్ కంపెనీ, ఆన్సైట్ ఎనర్జీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్, రిటైల్‌గా పెట్రోలు, డీజిల్‌ను అమ్మడానికి అనుమతి ఉంటుంది. 100 బంకులు ఏడాదికి రూ. 500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన కంపెనీల నుంచి కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం బంకులను పూర్తిగా రిమోట్ ఏరియాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన కేంద్రం పొందు పరిచింది. వ్యాపారం జరిగేనా ఇంధన వ్యాపారానికి సంబంధించి కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో ఒక్క రిలయన్స్ ఇండస్ట్ట్రీస్‌కి తప్ప మరే కంపెనీకి దేశవ్యాప్తంగా నెట్వర్క్ లేదు. అస్సాం గ్యాస్ కంపెనీకి మౌలిక వసతులు ఉన్నా అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో చాలా వరకు బల్క్ ఫ్యూయల్ సెల్లింగ్‌కే అనుకూలంగా ఉన్నాయి. ధర తగ్గేనా ప్రస్తుతం ఆటో ఫ్యూయల్ విభాగంలో పోటీ నామామత్రంగా ఉంది. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ వంటి కంపెనీలు ఉన్నా ధరల్లో వత్యాసం లేదు. కొత్త ప్లేయర్లు మార్కెట్లోకి రావడం వల్ల ఫ్యూయల్ ధరలు ఏమైనా కిందికి దిగుతాయోమో చూడాలి. -
పెట్రోల్ ధరలు తగ్గించండి - ఇక్రా
ముంబై: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం.. ‘ప్రభుత్వ ఆదాయాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా’ ఇంధన సెస్ తగ్గింపునకు దోహదపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం విశ్లేషించింది. 2020–21లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాల్లో ఎటువంటి ప్రభావం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.5 సెస్ భారం తగ్గించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల తీవ్రత దీనితో దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇక్రా తాజా సూచనలు చేసింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆందోళనలను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. ఇక్రా విశ్లేషణాంశాలను పరిశీలిస్తే.. మహమ్మారి వ్యాప్తికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22లో పెట్రోల్ వినియోగం 6.7 శాతం, డీజిల్ వినియోగం 3.3 శాతం పెరుగుతుందని అంచనా. కాగా, 2020–21లో పోల్చితే పెట్రోల్ వినియోగం 2021–22లో 14 శాతం పెరుగుతుందని అంచనా. డీజిల్ విషయంలో ఈ అంచనా 10 శాతంగా ఉంది. 2020–21లో సెస్ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అధిక వినియోగం వల్ల ఈ ఆదాయాలు 2021–22లో మరో రూ.40 వేల కోట్లు పెరిగి రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న రవాణా, ఎకానమీ రికవరీ దీనికి కారణం. అంటే వినియోగం భారీ పెరుగుదల వల్ల సెస్‌ల రూపంలో 2021–22లో రూ.40,000 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందన్నమాట. ఈ అదనపు సెస్ రూ.40,000 కోట్ల వసూళ్లను ప్రభుత్వం వదులుకోడానికి సిద్ధపడితే, లీటర్ ఇంధనంపై రూ.4.5 మేర సెస్ భారం తగ్గుతుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాలను చూస్తే, ఏప్రిల్, మే నెలల్లో రూ.80,000 కోట్లు ఒనగూరాయి. 2020–21 ఆదాయాలను చేరడానికి మరో రూ.2.4 లక్షల కోట్లు వసూలయితే సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 2 నుంచి 6 శాతం శ్రేణిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ రూ.40,000 కోట్ల సెస్ తగ్గింపు నిర్ణయం దోహదపడుతుంది. సెస్‌ను లీటర్‌కు రూ.4.5 తగ్గిస్తే, ఇంధనం, లైట్, ఆహార ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22లో 5.3 శాతం ఉండే వీలుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం ఇది 5.1 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ ఇటీవలి ద్వైమాసిన సమీక్ష అంచనావేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు తోడు డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి, మార్చి 2020 నుంచీ కేంద్రం విధించిన అధిక సెస్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రెట్లకుపైగా పెంచిన వ్యాల్యూ యాడెడ్ పన్నులు (వీఏటీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు భారీగా పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటర్ రూ.100 దాటేసింది. డీజిల్ విషయంలోనూ ధర మూడంకెలకు చేరవయ్యింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇంధనంపై విధించిన సెస్‌ను తగ్గించాలన్న డిమాండ్ విస్తృతమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అదనపు ఆదాయానికి ఒక మార్గంగా 2020 ప్రారంభంలో సెస్ మార్గాన్ని కేంద్రం ఎంచుకుంది. ఇప్పుడు క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. అయినా ప్రభుత్వం సెస్‌ను కొనసాగిస్తోంది. ఇది వినియోగదారుపై తీవ్ర భారాన్ని మోపుతోంది. ద్రవ్యోల్బణం ఐదు శాతం: యూబీఎస్ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండే వీలుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనావేసింది. అయితే రూపాయి మరింత బలహీనపడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్రా రేటింగ్స్ విషయంలో ఈ అంచనా 5.3 శాతంగా ఉండగా, ఆర్బీఐ అంచనా 5.1 శాతం -
సంస్కరణలకు ‘ఇంధనం’!
న్యూఢిల్లీ: దేశీ ఇంధన రంగంలో మరిన్ని సంస్కరణలకు అవకాశముందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. చమురు, గ్యాస్ ఉత్పత్తిలో మరింతగా అధ్యయనాలు, నూతన ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు. సోమవారం దేశ, విదేశ చమురు దిగ్గజ సంస్థల అధినేతలతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సుమారు మూడు గంటలసేపు సాగిన ఈ సమవేశంలో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ చేతిలో ఉన్న ముంబై హై వంటి క్షేత్రాల్లో తమకూ వాటాలు ఇప్పించాలని ప్రైవేట్ రంగ చమురు దిగ్గజాలు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి నిర్దిష్ట స్థాయిని దాటితే బ్యారెల్‌కి ఇన్ని డాలర్ల చొప్పున ఫీజు చెల్లించేలా నిబంధనలు విధించవచ్చని వారు తెలిపినట్లు పేర్కొన్నాయి. నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలియని క్షేత్రాల్లో ఇన్వెస్ట్ చేయడం రిస్కుతో కూడుకున్నదే తప్ప.. ఫలితాల కోసం దీర్ఘకాలం ఎదురుచూడాల్సి వస్తుందని సమావేశంలో చమురు సంస్థల అధినేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాల్లోనే అవుట్‌పుట్ మరింతగా పెంచేందుకు పెట్టుబడులు పెట్టడం, సాంకేతికంగా అనుభవమున్న సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా ముందుకెళ్లొచ్చని పేర్కొన్నారు. మరోవైపు, సమగ్ర ఇంధన విధానాన్ని రూపొందించాలన్న సూచనను మోదీ స్వాగతించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. విధానాలు, సంస్కరణల అమలు జరుగుతున్న తీరును పలువురు సీఈవోలు ప్రశంసించినట్లు వివరించాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ నెట్వర్క్ మొదలైన వాటిల్లో పెట్టుబడుల సమీకరణ కోసం ఉద్దేశించిన ఈ సమావేశంలో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, చమురు ఎగుమతి దేశాల కూటమి సెక్రటరి జనరల్ మొహమ్మద్ బర్కిందో, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తదితరులు పాల్గొన్నారు. రష్యన్ దిగ్గజం రాస్‌నెఫ్ట్ సీఈవో ఐగోర్ సెచిన్, సౌదీ ఆరామ్కో సీఈవో అమీన్ మొదలైన వారు ఈ భేటీకి ప్రత్యేకంగా రావడం గమనార్హం. ఏకీకృత ఇంధన విధానం, బయో ఇంధనాలకు ప్రోత్సాహం, గ్యాస్ సరఫరాను మెరుగుపర్చడం, గ్యాస్ హబ్ ఏర్పాటు, నియంత్రణపరమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చినట్లు పేర్కొన్నాయి. జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు..! పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేరిస్తే పోటీ మరింత పెరుగుతుందని దేశ, విదేశ చమురు సంస్థలు సూచించినట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. దీనిపై రాష్ట్రాలతో చర్చిస్తానని ప్రధాని భరోసా ఇచ్చినట్లు వివరించారు. అంతర్జాతీయ దిగ్గజాలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నట్లు చెప్పారు. వచ్చే దశాబ్దకాలంలో భారత చమురు, గ్యాస్ రంగంలో 300 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశీయంగా గ్యాస్ ట్రేడింగ్ ఎక్సే్చంజ్ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు తెలిపారు. భారత్‌లో మెగా పెట్టుబడులు రిఫైనరీలు, పెట్రోకెమికల్స్లో ఇన్వెస్ట్ చేస్తాం సౌదీ ఆరామ్కో సీఈవో అమీన్ నాసర్ న్యూఢిల్లీ: భారత్‌లోని రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చమురు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే టాప్ సంస్థ సౌదీ ఆరామ్కో సీఈవో అమీన్ హెచ్ నాసర్ వెల్లడించారు. భారత్‌తో క్రయ,విక్రయాలకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవడంపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 2.7 లక్షల కోట్లతో పశ్చిమ తీరప్రాంతంలో ప్రతిపాదిత రిఫైనరీ, ఇటీవలే పూర్తయిన ఓఎన్జీసీ పెట్రోకెమికల్ ప్రాజెక్టు మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్నట్లు ఇండియా ఎనర్జీ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాసర్ పేర్కొన్నారు. ‘భారీ మార్కెట్ గల భారత్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. కీలకమైన ఈ మార్కెట్లో అత్యంత భారీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. భారత ఇంధన రంగంలో ముఖ్యంగా.. పునరుత్పాక, పెట్రోకెమికల్స్ మొదలైనవాటిపై దృష్టి సారిస్తున్నాం. త్వరలోనే మా బృందం ఇక్కడికి రానుంది‘ అని ఆయన చెప్పారు. చమురు సరఫరా నుంచి, రిఫైనింగ్, మార్కెటింగ్ దాకా అన్ని స్థాయుల కార్యకలాపాల్లోనూ తాము ఇన్వెస్ట్ చేయదల్చుకున్నట్లు పేర్కొన్నారు. -
ఇంధన సామర్థ్యంపై ‘బ్రిక్స్’ చర్చలు
- విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ ఇంధన సామర్థ్యసదస్సు సోమవారం విశాఖలో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెండురోజుల సదస్సులో ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశాలైన భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. ఇంధన రంగంలో ఈ దేశాలు సాధించిన ప్రగతి గురించి సమీక్షిస్తున్నారు. ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు గురించి ఇంధనశాఖ అడిషనల్ సెక్రటరీ బి.పి.పాండే విదేశీ ప్రతినిధులకు వివరించారు. తమ దేశాలు అవలంబిస్తున్న విద్యుత్ సామర్థ్యం పెంపు-ఆదా విధానాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిక్స్ దేశాల ప్రతి నిధులు చర్చించారు. రాత్రి 7 గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ దీపాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి బి.పి.పాండేతో పాటు బిఈఈ సెక్రటరీ సంజయ్సేత్, ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు.