న్యూఢిల్లీ: ఇంధన అమ్మకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే నెలలో జోరుగా సాగాయి. 90 శాతం మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు గత నెలలో 28 లక్షల టన్నుల పెట్రోల్ విక్రయించాయి. 2021 మే నెలతో పోలిస్తే ఇది 55.7 శాతం అధికం. 2020 సంవత్సరం అదే నెలతో పోలిస్తే 76 శాతం ఎక్కువ.
నెలవారీ వృద్ధి 8.2 శాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 39.4 శాతం అధికమై 68.2 లక్షల టన్నులకు ఎగసింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 1.8 శాతం ఎక్కువ. గత నెలలో అధిక ధరల తర్వాత డిమాండ్ తిరిగి రావడం వల్ల అమ్మకాలపై సానుకూల ప్రభావంతో ఇంధన వినియోగం ఎక్కువైంది. పంట కోత సీజన్ ప్రారంభం కావడం కూడా డిమాండ్‌కు తోడ్పడింది.
వేసవి నుంచి ఉపశమనానికి శీతల ప్రాంతాలకు యాత్రలు పెరిగాయి. ఇక వంట గ్యాస్ అమ్మకాలు 1.48 శాతం అధికమై 21.9 లక్షల టన్నులకు చేరుకుంది. 2020 మే నెలతో పోలిస్తే ఇది 4.8 శాతం తక్కువ. 2022 మార్చి నుంచి ఒక్కో సిలిండర్ ధర రూ.103.5 పెరిగింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగం రెండింతలకుపైగా పెరిగి 5,40,200 టన్నులు గా ఉంది. నెలవారీ వృద్ధి 7.5% నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment