ఆంధ్రాతో పంచాయితీ అయిపోలేదు: కేసీఆర్
* సంపూర్ణ తెలంగాణ సాధించాల్సి ఉంది: కేసీఆర్
* భద్రాచలంలోని ఏడు మండలాలూ తెలంగాణకే
* ‘మన రాష్ట్రం-మన పార్టీ’ నినాదంతో 17 పార్లమెంటు సీట్లు గెలవాలి
* బలహీనవర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం
* తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు
* ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే ఎస్ఐ ఉద్యోగం తీసేస్తాం
* టీఆర్ఎస్లో చేరిన కొండా దంపతులు, రిటైర్డు డీజీ జయచంద్ర, వనపర్తికి చెందిన వివిధ పార్టీల నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రాతో పంచాయితీ పూర్తిగా అయిపోలేదని, చాలా అంశాల్లో ఇంకా పోరాడి సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రిటైర్డు డీజీ ఎస్.కె.జయచంద్ర, మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు, వనపర్తి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కేసీఆర్ సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని చెప్పారు. వీటిలో పంపిణీ పూర్తయ్యేదాకా ఆంధ్రాతో పంచాయతీ పూర్తయినట్టు కాదన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలు కూడా తెలంగాణలో కలపాలని ఆయన డిమాం డు చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఎస్.నిరంజన్ రెడ్డి పేరు ఖరారు అయిందని, ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆత్మగా నిలిచిన టీఆర్ఎస్ కోరుకున్న బంగారు, ఆకుపచ్చ తెలంగాణకోసం కేంద్రం నుండి చాలా ప్రాజెక్టులు, నిధులు తెచ్చుకోవాల్సి ఉంది. ‘మన రాష్ట్రం-మన పార్టీ’ నినాదంతో 16-17 పార్లమెంటు సీట్లు గెలిస్తే కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అవసరమైన శక్తి ఉంటుంది.
తెలంగాణ యాస మాట్లాడితే మోటు అనుకునే సమయం నుండి ఇప్పటిదాకా తెలంగాణకోసం 14 ఏళ్లు జరిగిన ఉద్యమంలో చూసిన ప్రజల గోస, బాధలు, ఆత్మలను చూసిన పార్టీగా ఎన్నో కలలు ఉన్నాయి. తెలంగాణలో 85 శాతం బలహీనవర్గాలే ఉన్నాయి. వారికోసం పనిచేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉంది. టీఆర్ఎస్ ఎందుకు విలీనం కాకుండా ఉన్నదో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది.
ఇప్పటిదాకా సమైక్యరాష్ట్రంలోని సకల బాధలను పరిష్కరించే విధంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది. మహిళలు, మైనారిటీలు, బీసీలు, దళితులకు సంబంధించిన కార్యక్రమాలను మేనిఫెస్టోలో చేరుస్తాం.
వచ్చే ప్రభుత్వంలో పూర్తిచేస్తామని చెప్పిన కొన్ని హామీలు
బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం అంటూ ఒక గదిని కట్టిస్తున్నారు. ఒకటే గదిలో భార్యాభర్తలు, పిల్లలు, కొత్తగా ఎవరైనా చుట్టం వస్తే దానిలోనే. ఇంట్లో ఆడపిల్ల స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవాలంటే ఎట్లా? గ్రామాల్లో గొడ్డుగోదా, గొర్రెపిల్లో, మేకపిల్లో ఉంటే కూడా అదే గదిలో ఉంటయి. పందిగూడులాగా ఒకటే గదిని కట్టించి ఇచ్చి బలహీనవర్గాలకు ఇళ్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నరు. తెలంగాణ రాష్ట్రంలో రెండు బెడ్రూములు, ఒక హాలు, కిచెన్, బాత్రూములు, మరుగుదొడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. పూర్తిగా ప్రభుత్వమే ఈ ఖర్చును ఉచితంగా భరిస్తుంది.
కుల రహిత వ్యవస్థ ఉండాలని చెబుతున్న ప్రభుత్వమే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను ఎందుకు పెడుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తం. అటెండరు నుండి ఐఏఎస్‌దాకా, రిక్షా కార్మికుని నుండి మంత్రుల పిల్లల దాకా అదే హాస్టళ్లలో ఉంటరు. స్విమ్మింగ్‌పూల్, విశాలమైన ఆట మైదానంతో పాటు భోజనం వంటి అన్ని వసతులను ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. వీటిని మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తరు.
పోలీసులకు సామాజిక బాధ్యత ఉంటది. గ్రామాల వారీగా ఐదేళ్లు దాటిన పిల్లల జాబితాను రెవెన్యూ శాఖ ద్వారా పోలీసులకు వెళ్తుంది. ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే అక్కడ ఉన్న పోలీసు సబ్ ఇన్స్పెక్టరు ఉద్యోగం పోతుంది. దీనివల్ల ఉచిత నిర్బంధ విద్య కచ్చితంగా అమలు అవుతుంది. ఒక తరం విద్యను పొందితే, ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దితే ఆ కుటుంబాల స్థితిగతులే మారిపోతాయి.
తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను పట్టణాలు, నీటి సౌకర్యం ఉన్న నియోజకవర్గాలు పోగా 72 నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఉన్న జిల్లాలకు తోడుగా కొత్తగా మరో 14 జిల్లాలను ఏర్పాటు చేస్తాం.
కేసీఆర్‌ను కలసి టికెట్లు కోరిన న్యాయవాదులు
టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వాలని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ నేతలు సి.ఉపేందర్, గోవర్ధన్ రెడ్డి కేసీఆర్‌ను కలసి వినతిపత్రాన్ని అందించారు. హూజూర్‌నగర్ టికెట్‌కోసం ఉపేందర్ దరఖాస్తు చేయగా, దేవరకద్రను ఇవ్వాలని గోవర్ధన్ రెడ్డి కోరారు.